ఇది రాజ్యాంగ ఉల్లంఘనే: సీఎం కేసీఆర్
ఇది రాజ్యాంగ ఉల్లంఘనే: సీఎం కేసీఆర్
Published Sat, Jul 12 2014 1:31 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
సాక్షి, హైదరాబాద్: పోలవరం ముంపు ప్రాంతాలను ఏపీలో కలుపుతూ తెచ్చిన సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదించడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర నిరసన తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని కేంద్రం పూర్తిగా ఉల్లంఘించిందని, ఎన్డీయే ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిందని శుక్రవారం ఆయన మండిపడ్డారు. భద్రాచలం డివిజన్‌లోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడాన్ని టీఆర్‌ఎస్ మొదటి నుంచీ వ్యతిరేకిస్తోందన్నారు. తాను స్వయంగా రాష్ర్టపతిని కలిసి పోలవరం డిజైన్‌ను మార్చాలని కోరినట్లు కేసీఆర్ గుర్తు చేశారు.
కేంద్రాన్ని కూడా డిమాండ్ చేసినప్పటికీ ఈ విషయంలో మొండిగా వ్యవహరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ, తెలుగుదేశం పార్టీలు విప్ జారీ చేసి పంతం నెగ్గించుకుంటుంటే తెలంగాణలోని ఆ పార్టీల ఎంపీలు అడ్డుకుని ఉండాల్సిందన్నారు. టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఎంత పోరాటం చేసినా కేంద్రం మందబలంతో వారి గొంతు నొక్కేసిందన్నారు. తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రజల మనోభావాలను పట్టించుకోలేదని, రాష్ట్రాల హక్కులను కాలరాసిందని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందినా కూడా ముంపు మండలాలను కాపాడుకునే విషయంలో అనుసరించాల్సిన కార్యాచరణపై ప్రభుత్వపరంగా ఆలోచిస్తున్నామని, న్యాయ, రాజ్యాంగ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చితే ఈ సమస్య ఉండదనేది తన అభిప్రాయమని సీఎం పేర్కొన్నారు.
Advertisement