'మందబలంతో వ్యవహరించారు'
న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ మార్చాల్సిందేనని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు చర్చ సందర్భంగా ఆయన శుక్రవారం లోక్ సభలో మాట్లాడారు. ఖమ్మం జిల్లాలోని ఏడు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలపటాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.
గిరిజనులకు అన్యాయం చేసేవిధంగా ఉన్న పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ మార్చాల్సిందేనని గుత్తా ధ్వజమెత్తారు. ఈ బిల్లుపై నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించాలని ఆయన కోరారు. కేంద్ర హోంశాఖ పోలవరం బిల్లును తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు. చట్టబద్దంగా లేని బిల్లును బలవంతంగా ఆమోదింప చేయటం ప్రజాస్వామ్యంలో దురదృష్టకరమైన రోజు అని అన్నారు.
రాముడేమో తెలంగాణకు... ఆయన ఆస్తులు ఆంధ్రప్రదేశ్కు బదలాయించటం సరైంది కాదన్నారు. అయితే తాము పోలవరం ప్రాజెక్ట్ కు వ్యతిరేకం కాదని, ముంపు మండలాలను ఏపీలో కలపటం మంచి పద్దతి కాదని గుత్తా వ్యాఖ్యానించారు. బలవంతంగా గిరిజన గ్రామాలను ముంపుకు గురి చేయవద్దని ఆయన అన్నారు. అహంకార పూరితమైన మందబలంతో ఆర్డినెన్స్ను ఆమోదించారని గుత్తా మండిపడ్డారు.