గుర్తు తెలియని మృతదేహాలు.. కేసులు మిస్టరీగానే | Unidentified Dead Body Cases Are Increasing In Medak District | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని మృతదేహాలు.. కేసులు మిస్టరీగానే

Published Thu, Jun 27 2019 1:03 PM | Last Updated on Thu, Jun 27 2019 1:54 PM

Unidentified Dead Body Cases Are Increasing In Medak District  - Sakshi

సాక్షి, మెదక్‌: గుర్తు తెలియని మృతదేహాల ఆచూకీ అంతుచిక్కడం లేదు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఇలాంటి కేసులు రోజురోజుకూ పెరుగుతుండగా.. పురోగతి మాత్రం కనిపించడం లేదు. అన్‌ ఐడెంటిఫైడ్‌ డెడ్‌ బాడీస్‌ లభ్యం ఘటనలు నెలకు కనీసం ఒకటి, రెండు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

గుర్తు తెలియని వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేశారు. మృతదేహాన్ని సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం మీనాజీపేట రోడ్డు పక్కన అటవీ ప్రాంతంలోని కాల్వలో పడేశారు. ఈ ఘటన ఈ నెల 18న వెలుగు చూసింది. ఇప్పటివరకు ఆ మృతదేహం ఎవరిదో పోలీసులు గుర్తించలేకపోయారు. ముఖం గుర్తు పట్టకుండా చెక్కేయడం.. కనుగుడ్లు పీకేయడంతోపాటు మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో డెడ్‌బాడీ ఎవరిదో గుర్తించడం కష్టంగా మారినట్లు తెలుస్తోంది.

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఈ ఘటన సంచలనం సృష్టించగా.. గుర్తు తెలియని మృతదేహాలకు సంబంధించిన కేసులు మిస్టరీగానే మిగులుతున్నాయి. ప్రధానంగా సంగారెడ్డి జిల్లాలో ఘటనలు అధికంగా చోటుచేసుకుంటుండటం కలవరపెడుతోంది.   

గుర్తు తెలియని శవాల ఘటనల్లో 20 నుంచి 40 ఏళ్లలోపు వారే ఉన్నట్లు పోలీస్‌ రికార్డులు చెబుతున్నాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అన్‌ ఐడెంటిఫైడ్‌ డెడ్‌ బాడీస్‌కు సంబంధించి ఈ ఏడాది ఇప్పటివరకు 28 కేసులు నమోదయ్యాయి. ఇందులో తొమ్మిది గుర్తింపునకు నోచుకోగా, 19 డెడ్‌బాడీలు ఎవరివో పోలీసులు ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారు.

సంగారెడ్డిలో అధికం..
ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలు వస్తాయి. ఇందులో సిద్దిపేట కమిషనరేట్‌గా ఆవిర్భవించింది. సంగారెడ్డిలో 29 లా అండ్‌ ఆర్డర్, రెండు ట్రాఫిక్, ఒకæ సీసీఎస్, ఒక మహిళా పోలీస్‌ స్టేషన్‌.. సిద్దిపేటలో 25 లా అండ్‌ ఆర్డర్, ఒక ట్రాఫిక్‌.. మెదక్‌లో 21 పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి.

ప్రధానంగా సంగారెడ్డి జిల్లాలో అన్‌ ఐడెంటిఫైడ్‌ డెడ్‌ బాడీస్‌ ఘటనలు అధికంగా చోటుచేసుకుంటున్నాయి. ఆ తర్వాత వరుసలో సిద్దిపేట, మెదక్‌ జిల్లాలు ఉన్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు సమీపంలో ఉండడం.. భూమి రేట్లు అమాంతంగా పెరగడంతో సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి నేర ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

కారణాలు ఇవే..
గుర్తు తెలియని మృతదేహాల ఘటనలకు సంబం ధించి కారణాలు అనేకం. వివాహేతర సంబం ధాలు, ప్రేమ వివాహాలు, పగ, ప్రతీకార దాడుల్లో హత్యకు గురికావడం.. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందడంతోపాటు పలు కారణాలతో ఇంటికి దూరమై.. ఊరికి దూరమై.. ఎక్కడో నివసిస్తూ అనారోగ్యం పాలై మృత్యువాత పడిన వారిని అన్‌ ఐడెంటిఫైడ్‌ డెడ్‌ బాడీస్‌ కింద పోలీసులు గుర్తించి కేసులు నమోదు చేస్తారు. అదృశ్యం (మిస్సింగ్‌) కేసుల్లో కొందరు హత్యకు గురైన వారు ఉంటా రని.. కేసు నుంచి తప్పించుకునేందుకు నింది తులు సదరు వ్యక్తి ఆనవాళ్లు లేకుండా చేసిన సం దర్భాలు ఉంటాయని.. వీటిని సైతం అన్‌ ఐడెంటిఫైడ్‌ డెడ్‌బాడీస్‌గానే పరిగణిస్తామని పోలీస్‌ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో లేవని వెల్లడించారు.

జిల్లాల వారీగా ఇలా.. 
సంగారెడ్డి : గుర్తు తెలియని మృతదేహాలకు సంబంధించి సంగారెడ్డి  జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం 20 కేసులు నమోదయ్యాయి. ఇందులో నాలుగు ట్రేస్‌ అవుట్‌ కాగా.. 16 పెండింగ్‌లో ఉన్నాయి. జనవరిలో రెండు కేసులు నమోదు కాగా.. ఒకటి గుర్తింపునకు నోచుకుంది.

ఫిబ్రవరిలో ఒక కేసు నమోదు కాగా.. ఇప్పటివరకు ఏమీ తేలలేదు. మార్చిలో అ«ధికంగా ఎనిమిది కేసులు నమోదు కాగా.. ఒక మృతదేహాన్ని గుర్తించారు. ఏప్రిల్‌లో మూడు కేసులు రిజిస్టర్‌ కాగా.. ఇప్పటివరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. మేలో నాలుగు కేసులు నమోదు కాగా.. రెండింటిని ఐడెంటిఫై చేశారు. జూన్‌లో రెండు కేసులు రిజిస్టర్‌ కాగా.. వాటిని పోలీసులు ఇప్పటివరకు గుర్తించలేక పోయారు.

సిద్దిపేట : ఈ ఏడాది నుంచి ఇప్పటివరకు గుర్తు తెలియని మృతదేహాల ఘటనకు సంబంధించి సిద్దిపేట కమిషనరేట్‌ పరిధిలో నాలుగు కేసులు నమోదయ్యాయి. గౌరారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మూడు.. ములుగు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక ఘటన చోటుచేసుకుంది. ఇందులో మూడు పురుష, ఒక మహిళ డెడ్‌బాడీస్‌ లభ్యమయ్యాయి. గౌరారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘటనకు సంబంధించి ఒక డెడ్‌ బాడీ ఆచూకీ మాత్రమే లభించింది. మిగతా మూడు డెడ్‌బాడీస్‌ ఆచూకీని పోలీసులు ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారు.

మెదక్‌ : జిల్లా పరిధిలో ఈ ఆరు నెలల్లో సుమారు నాలుగు అన్‌ ఐడెంటిఫై డెడ్‌బాడీస్‌ ఘటలనలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో అన్నీ ట్రేస్‌ అవుట్‌ అయ్యాయి. మెదక్‌ టౌన్‌ పోలీస్‌స్టేష న్‌ పరిధిలో 2017 నుంచి 2019 వరకు గుర్తు తెలి యని శవాలకు సంబంధించిన కేసులు 16 నమో దుకాగా.. అన్నిమృతదేహాల ఆచూకీ లభ్యమైంది. 

పోలీసుల ఫార్మాలిటీస్‌..
ముందుగా గుర్తు తెలియని శవాన్ని గుర్తించిన వారితో పోలీసులు ఫిర్యాదు తీసుకుంటారు. ఆ తర్వాత కేసు నమోదు చేసి.. మిగతా తతంగం పూర్తి చేస్తారు. అంటే రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజల సమక్షంలో డెడ్‌బాడీ పంచనామా నిర్వహిస్తారు. డెడ్‌ బాడీ ఫొటోను నలుదిక్కులా తీయడంతోపాటు ఫింగర్‌ ప్రింట్స్, బ్లడ్‌ శాంపిల్స్, డీఎన్‌ఏకు సంబంధించి మాంసాన్ని సేకరించి భద్రపరుస్తారు.

డెడ్‌ బాడీకి ఉన్న దుస్తులు, ప్యాకెట్లలో ఏమైనా లభించాయా.. పరిసర ప్రాంతాల్లో ఏమైనా ఆనవాళ్లు కనిపించాయా వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించి పరిశోధిస్తారు. డెడ్‌ బాడీ మామూలు స్థితిలో ఉంటే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి భద్రపరుస్తారు. కుళ్లిన స్థితిలో ఉంటే పూడ్చి పెడతారని మెదక్‌ టౌన్‌ సీఐ వెంకట్‌ వివరించారు.

డెడ్‌బాడీస్‌ గుర్తింపు ప్రయత్నాలు ఇలా..
పంచనామా, ఇతరత్రా ఫార్మాలిటీస్‌ అనంతరం గుర్తు తెలియని శవాలకు సంబంధించి క్రిమినల్‌ ఇంటెలిజెన్స్‌ సిస్టం ద్వారా రాష్ట్రంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లకు లుక్‌అవుట్‌ నోటీసులు, రేడియం మెస్సేజ్‌ చేస్తారు. మృతుడి వయసు, ఫొటోలు, దుస్తులు, ఇతర ఆనవాళ్ల ఫొటోలను అప్‌లోడ్‌ చేస్తారు.

ఈ మేరకు ఎక్కడెక్కడ మిస్సింగ్‌ కేసులు నమోదైనవి.. అన్‌ ఐడెంటిఫైడ్‌ డెడ్‌బాడీస్‌లో మిస్సింగ్‌ అయిన వారు ఎవరైనా ఉన్నారా.. అనేది పరిశీలిస్తారు. పోలీస్‌ క్రైం రికార్డుల్లోని నేర చరితుల ఫొటోలతో అన్‌ ఐడెంటిఫైడ్‌ డెడ్‌ బాడీస్‌ ఫొటో ట్యాలీ చేస్తామని సీఐ వెంకట్‌ వెల్లడించారు.

సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం సింగయ్యపల్లి గ్రామానికి చెందిన బంధారం మల్లయ్య ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని ఈ ఏడాది మే 7న అతడి కుటుంబ సభ్యులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సైతం కేసు నమోదు చేశారు. మూడు రోజుల తర్వాత 10న గౌరారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక అన్‌ ఐడెంటిఫైడ్‌ డెడ్‌బాడీ లభ్యమైంది. మృతదేహాన్ని గజ్వేల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పోలీసులు అన్ని పోలీస్‌స్టేషన్లకు లుక్‌అవుట్‌ నోటీసులు పంపించారు. దోతి, పుట్టుమచ్చల ద్వారా బంధారం మల్లయ్యగా గుర్తించారు. మృతుడు ఆకలితో అలమటిస్తూ మృతిచెందినట్లు తేలింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement