పోలీసుల పనితీరు భేష్
పోలీసుల పనితీరు భేష్
Published Sat, Nov 26 2016 4:18 AM | Last Updated on Mon, Sep 4 2017 9:06 PM
డీజీపీల సదస్సులో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్
► యువత ఐసిస్ బాట పట్టకుండా బలగాలు కృషి చేశాయి
► ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేశాయి
► పెద్ద నోట్ల రద్దుతో జాతి వ్యతిరేక శక్తులకు నిధులు ఆగిపోతాయి
సాక్షి, హైదరాబాద్: దేశ అంతర్గత భద్రతలో కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాల పాత్ర ప్రశంసనీయమని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. యువత ఐసిస్ వైపు తప్పుదోవపట్టకుండా కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలు సమన్వయంతో కృషి చేశాయని, దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్మూలించాయని కొనియాడారు. ఈశాన్య రాష్ట్రాల్లో చొరబాట్లు, వామపక్ష తీవ్రవాదం, జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులతో గడచిన ఏడాది కాలంగా దేశ అంతర్గత భద్రత పెను సవాళ్లను ఎదుర్కొందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో డీజీపీ, ఐజీపీల 51వ జాతీయ సదస్సును రాజ్‌నాథ్‌సింగ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రం, రాష్ట్రాలకు చెందిన పోలీస్ అధికారుల మధ్య ఆరోగ్యదాయకమైన పోటీ ఉంటే చక్కని ఫలితాలు సాధించవచ్చన్నారు. పెద్ద నోట్ల రద్దుతో.. జాతి వ్యతిరేక శక్తులకు అందే నిధులు ఆగిపోతాయన్నారు. రాష్ట్రాలు, కేంద్ర సంస్థల పోలీసు సిబ్బంది ఉత్తమ విధానాలపై పరస్పరం సమాచారం ఇచ్చి పుచ్చుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. దర్యాప్తు, ఫోరెన్సిక్ సైన్‌స, ప్రాసిక్యూషన్ వంటి వివిధ భద్రతా విభాగాల సేవలను సముచితంగా గుర్తించాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా హోంశాఖ, ఇంటెలిజెన్‌స బ్యూరోకు చెందిన అధికారులకు ఇండియన్ పోలీస్ పతకాలను రాజ్‌నాథ్ ప్రదానం చేశారు.
మూడు రోజులపాటు జరగనున్న ఈ సమావేశంలో.. భద్రతపరంగా దేశం ఎదుర్కొంటున్న వివిధ అంశాలపై చర్చలు జరిపి, వాటి పరిష్కారానికి అనుసరించాల్సిన విధానాలపై ఒక కార్యాచరణను రూపొందిస్తారు. అంతకుముందు రాజ్‌నాథ్ అకాడమీలో సర్దార్ పటేల్ విగ్రహం వద్ద, ఇండియన్ పోలీస్ సర్వీస్‌కు చెందిన అమరవీరుల స్మారకం వద్ద పూలమాలను ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రులు కిరెన్ రిజిజు, హన్‌సరాజ్ గంగారామ్ అహిర్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్ రుషి, అకాడమీ డెరైక్టర్ అరుణ బహుగుణ, భద్రత, నిఘా సంస్థలకు చెందిన సీనియర్ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Advertisement
Advertisement