‘కూలి’న బతుకులు.. | "Until kulina .. | Sakshi
Sakshi News home page

‘కూలి’న బతుకులు..

Published Sun, Jan 4 2015 4:19 AM | Last Updated on Sat, Sep 2 2017 7:10 PM

‘కూలి’న బతుకులు..

‘కూలి’న బతుకులు..

పొట్టచేత పట్టుకొని వలసబాట పట్టారు.. రాష్ట్ర కాని రాష్ట్రం అయినా.. కడుపునింపుకుందామని కర్ణాటకకు వెళ్లారు. ఉర్సులో ఒకరు టిఫిన్ సెంటర్ పెట్టారు. మరొకరు స్వీట్‌హౌస్‌లో పనిచేస్తున్నారు. ఎంతోకొంత సంపాదించి కుటుంబానికి ఆసరాగా ఉందామనుకున్న వారి జీవితాలు శిథిలాల్లో కలిసిపోయాయి. వాటర్‌ట్యాంకు కుప్పకూలి వారి ప్రాణాలు హరించింది. టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్న మహిళ గర్భవతి కావడంతో ఆ ఇంట్లో రోదనలు మిన్నంటాయి.
 
మాగనూర్/గట్టు: రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు వారివి. చిరువ్యాపారంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఓ మహిళ, యజమాని వద్ద జీతం కుదిరి అమ్మానాన్నలకు చేదోడువాదోడుగా ఉంటున్న మరో యువకుడు శనివారం కర్ణాటకలోని యాపల్‌దిన్నె జంగిల్‌సాబ్ ఉర్సు ఉత్సవాల్లో వాటర్ ట్యాంకు కూలి దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన ఐదుగురిలో జిల్లావాసులు ఇద్దరు ఉన్నారు.

యాపల్‌దిన్నె గ్రామంలో ఏటా జరిగే జంగిల్‌సాబ్ ఉర్సు ఉత్సవాలకు వేలాది మంది భక్తులు హాజరై తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలో చిరువ్యాపారులు దుకాణాలను ఏర్పాటుచేసి పిల్లల ఆట వస్తువులు, తినుబండారాలు, గాజులు తదితర వాటిని విక్రయిస్తూ పొట్టపోసుకుంటారు. ఈ క్రమంలో జిల్లాకు చెందిన ఉసేన్(23) స్థానికంగా మిఠాయి దుకాణంలో జీతం కుదిరాడు. మరో మహిళ షాజాహాన్(25) అక్కడే జాతరలో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తోంది.

ఇదిలాఉండగా, శనివారం ఉదయం కొందరు నీళ్లు తీసుకురావడానికి, మరికొందరు స్నానాలు చేసేందుకు సమీపంలో ఉన్న వాటర్‌ట్యాంక్ వద్దకు వెళ్లారు. ఇంతలో ట్యాంకు ఢమాల్.. అని పె...ద్దశబ్దం చేస్తూ కూలిపోడంతో అక్కడే ఉన్న ఉసేన్, షాజాహాన్‌తో పాటు మరో ముగ్గురు వీరేష్(25), దుర్గప్ప(55), జోమెల్(40) శిథిలాల కిందపడి అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

అమ్మానాన్నకు తోడుగా..
గట్టు మండలకేంద్రానికి చెందిన తెలుగు ఊసేన్‌ది నిరుపేద కుటుంబం. తండ్రి డబ్బా మల్లయ్య తన కొడుకును గ్రామానికి చెందిన మిఠాయి దుకాణం యజమానురాలు రమాదేవి వద్ద జీతం కుదిర్చి తన భార్యతో కలిసి గార్లపాడుకు వలసవెళ్లారు. ఉదయం స్నానం చేసి తాగునీళ్లు తీసుకురావడానికి వెళ్లిన తెలుగు ఊసేన్ వాటర్‌ట్యాంకు కూలడంతో మృత్యువాతపడ్డారు. తోటి మిఠాయి దుకాణం వారు మృతదేహాన్ని గట్టుకు తీసుకొచ్చి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

భర్త, పిల్లల పోషణ కోసం..
మరో మృతురాలు గద్వాల మండలం జమ్మీచెడు గ్రామానికి చెందిన షాజహాన్  నిండు గర్భిణి. తన భర్త యూసుఫ్ చేయి విరగడంతో అన్నీ తానై టిఫిన్ సెంటర్‌ను నిర్వహిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. చాలాఏళ్ల క్రితం ఎమ్మిగనూరుకు వలస వెళ్లారు. అక్కడి నుంచి జాతరలు, ఉర్సులకు వెళ్తూ అక్కడే టిఫిన్ సెంటర్‌ను నిర్వహించేవారు. ఈ క్రమంలోనే యాపల్‌దిన్నె ఉర్సుకు వెళ్లారు.

ముగ్గురు పిల్లలు షబానా, షాన్‌వాజ్, ఖలీల్ పోషణ బాధ్యతలను తన భుజాలపైనే వేసుకుంది. స్థానిక జంగిల్‌సాబ్ ఉర్సు ఉత్సవాల్లో టిఫిన్ సెంటర్‌ను నిర్వహిస్తున్న షాజహాన్ తాగునీళ్లు తీసుకొచ్చేందుకు సమీపంలో ఉన్న వాటర్‌ట్యాంకు వద్దకు వెళ్లింది. ట్యాంకు కూలడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

ప్రమాదానికి కారణాలివే..
యాపల్‌దిన్నెలో ప్రమాదానికి కారణమైన వాటర్ ట్యాంక్ ను ఇటీవలే నిర్మించి.. క్యూరింగ్ సరిగాచేయలేదు. సిమెంట్ తక్కువగా, ఇసుక ఎక్కువగా వేసి నిర్మించడంతో నీటి సామర్థ్యాన్ని తట్టుకోలేకపోయింది. ఈ ట్యాంకు నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.3.20లక్షలు మంజూరుచేయగా, అందులో కాంట్రాక్టర్ కక్కుర్తిపడి కేవలం రూ.90 వేలల్లోనే ట్యాంకును నిర్మించినట్లు స్థానికులు చెప్పారు. వారం రోజుల క్రితం నిర్మించిన ట్యాంకు నీళ్లు నింపకుండానే కూలిపోయిందని వాపోయారు.   
 
సమీక్షించిన కలెక్టర్
శనివారం జిల్లాకేంద్రంలో జరుగుతున్న విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ యాపల్‌దిన్నె ఘటనను ప్రస్తావిస్తూ మృతుల్లో జిల్లావాసులు ఉన్నందున సహాయక చర్యల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి బృందాన్ని పంపించాలని కలెక్టర్ జీడీ ప్రియదర్శినిని కోరారు. స్పందించిన ఆమె అప్పటికే గద్వాల ఆర్డీఓ అబ్దుల్‌హామీద్‌ను సంఘటనస్థలానికి వెళ్లాల్సిందిగా ఆదేశించారు.

ఆయన రాయిచూర్ ప్రభుత్వాసుపత్రికి చేరుకుని మృతదేహాలను వారి స్వగ్రామాలకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటుచేశారు. అలాగే గట్టు మండల కోఆప్షన్ సభ్యుడు మన్నెసాబ్, ఎస్‌ఎంసీ చైర్మన్ తిమ్మయ్య, టీఆర్‌ఎస్ నేత రామకృష్ణారెడ్డి యాపల్‌దిన్నెకు వెళ్లి సహాయకచర్యల్లో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement