సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : రెవెన్యూ మండలాల పునర్విభజనపై జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) అదర్‌సిన్హా నేతృత్వంలో కొత్త రెవెన్యూ డివిజన్లు/ మండలాలపై కలెక్టర్లు సమర్పించిన ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చించింది. ఈ క్రమంలోనే మన జిల్లాలో నూతనంగా మరో 12 పట్టణ రెవెన్యూ మండలాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ రఘునందన్‌రావు ప్రభుత్వానికి ప్రతిపాదించారు.
నగరీకరణ నేపథ్యంలో శివారు ప్రాంతాలు శరవేగంగా విస్తరించడం, ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం వలసలు కూడా పెరిగిపోవడమేగాకుండా.. భూముల విలువలు కూడా అనూహ్యంగా పెరిగినందున పట్టణ ప్రాంతాల్లో మండలాలను పున ర్వ్యస్థీకరించాల్సిన అవసరముందని తేల్చిచెప్పారు. 2007 నుంచి రెవెన్యూ డివిజన్లు/ అర్బన్ మండలాలను పెంచాలనే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నప్పటికీ, 2013, జూన్‌లో కేవలం రాజేంద్రనగర్, మల్కాజిగిరి రెవెన్యూ డివిజన్లను మాత్రమే ఏర్పాటుచేసి.. కొత్త మండలాలను ఏర్పాటు చే యలేదనే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో నూతనంగా 12 అర్బన్ రెవెన్యూ మండలాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
ఇప్పటికే జిల్లాలో 37 రెవెన్యూ మండలాలున్నాయని, ఈ మండలాల్లో పరిధి విస్తారంగా ఉండడంతో సిబ్బందిపై పనిభారం పెరిగిందని, ప్రభుత్వ భూముల పరిరక్షణ కూడా కష్టంగా మారినందున అదనపు సిబ్బంది అవసరమనే విషయాన్ని సర్కారు దృష్టికి తీసుకెళ్లింది. అధికారంలోకి వస్తే రెవెన్యూ డివిజన్లు, మండలాలను పునర్విభజిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన నేపథ్యంలో.. తాజాగా డివిజన్లు/ మండలాల పునర్వ్యస్థీకరణపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. భవిష్యత్తులో ఏర్పడే జిల్లాల భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా న్యూ మండలాల ఏర్పాటు ఉంటుందని రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.
ప్రస్తుతం మండలం- ప్రతిపాదిత మండలాలు
మల్కాజిగిరి- మల్కాజ్‌గిరి, అల్వాల్
కుత్బుల్లాపూర్- కుత్బుల్లాపూర్, దొమ్మరపోచంపల్లి
శామీర్‌పేట- శామీర్‌పేట, జవహర్‌నగర్
ఉప్పల్ - ఉప్పల్, కాప్రా
శంషాబాద్ - శంషాబాద్, పెద్దషాపూర్
బాలానగర్ - బాలానగర్, కూకట్‌పల్లి
హయత్‌నగర్- హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్
సరూర్‌నగర్ - సరూర్‌నగర్, మీర్‌పేట్
శేరిలింగంపల్లి- శేరిలింగంపల్లి,మదాపూర్/కొండాపూర్
రాజేంద్రనగర్- రాజేంద్రనగర్, నార్సింగి
తెరపైకి 12 రెవె‘న్యూ’మండలాలు!
Published Sun, May 31 2015 2:26 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement