సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ శనివారం ఢిల్లీలోని లోక కల్యాణ్ మార్గ్‌లో ‘చేంజ్ వితిన్’పేరుతో బాలీవుడ్ సెలబ్రిటీలను కలిసిన విషయం తెలిసిందే.కార్యక్రమానికి షారూఖ్ ఖాన్, అమీర్‌ఖాన్, కంగనా రనౌత్, జాక్వలిన్ ఫెర్నాండెజ్ సహా పలువురు సినీ, టీవీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ విషయాన్ని మోదీ ట్విట్టర్‌లో సైతం పంచుకున్నారు. అయితే మోదీ హిందీ ప్రముఖులనే కలవడంపై మెగాస్టార్ చిరంజీవి కోడలు, సీఎస్‌ఆర్ అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల అసహనం వ్యక్తం చేశారు.
కార్యక్రమానికి దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి ఒక్క కళాకారుడికీ ఆహ్వానం అందకపోవడంపై అభ్యంతరం తెలిపారు. దక్షిణాది చిత్ర పరిశ్రమను ప్రధాని పట్టించుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. ‘ప్రధాని మోదీ గారు..దక్షిణాదిలో మేం మిమ్మల్ని ఆరాధిస్తున్నాం.మీరు మా ప్రధానిగా ఉన్నందుకు గర్విస్తున్నాం. సాంస్కృతిక ప్రముఖ వ్యక్తులుగా హిందీ కళాకారులనే చూపి, దక్షిణ భారత చిత్ర పరిశ్రమ వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లుగా మేం భావించాం. బాధతో వ్యక్తం చేస్తున్న నా భావనలను సరైన మనస్సుతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను’ అని ఉపాసన ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment