దండుకునేందుకేనా..
మేడారం జాతర పనుల్లో అదనపు ప్రతిపాదనలు
కాంట్రాక్టర్ల కోసమే ఇంజనీర్ల నివేదికలు
అవసరం లేకున్నా కొత్తగా పైప్‌లైన్లు, ఇన్‌ఫిల్టరేషన్ బావులు
ఈ-టెండర్ల దాఖలుకు నేడు చివరి రోజు
వరంగల్ : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర పనులు.. భక్తుల సౌకర్యం కోసం కాకుండా కాంట్రాక్టర్ల మేలు కోసమే అన్నట్లు ప్రతిపాద నలు రూపొందించినట్లు విమర్శలు వస్తున్నాయి. అతిపెద్ద గిరిజన ఉత్సవంగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనుల కోసం రూ.101 కోట్ల నిధులు కూడా విడుదల చేసింది. ప్రభుత్వ శాఖల వారీగా పనులను గుర్తించి.. వాటిని చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అరుుతే ఈ పనుల గుర్తింపు పూర్తిగా కాంట్రాక్టర్లకు లబ్ధి కలిగే తీరుగా సాగిందని, నిధులను ఖర్చు చేయడం ఒక్కటే లక్ష్యంగా అధికారులు పనులను రూపొందించినట్లు విమర్శలు వస్తున్నాయి. గతంలో చేసిన పనులనే మళ్లీ కొత్తగా ప్రతిపాదనల్లో పెట్టడం ఈ విమర్శలకు బలం చేకూరుతోంది.
భక్తులకు తాగునీరు అందించేందుకు 2002 జాతర నుంచి పనులు చేపడుతున్నారు. ఇప్పటికే వేల కిలోమీటర్ల మేరకు తాగునీటి పైపు లైన్లు వేశారు. ఇలా పనులు పూర్తి చేసిన ప్రాంతంలోనే మళ్లీ కొత్తగా పైపులైన్లు నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మేడారం జాతరకు వచ్చే భక్తుల తాగునీటి అవసరాలను తీర్చేందుకు గ్రామీణ తాగునీటి సరఫరా(ఆర్‌డబ్ల్యూఎస్), సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ(ఐటీడీఏ), సాగునీటి శాఖలు జంపన్నవాగులో ఇప్పటికే 21 చిన్నబావు(ఇన్‌ఫిల్టరేషన్)లను ఏర్పాటు చేశాయి. భక్తులకు తాగునీటితో పాటు స్నానఘట్టాల్లోని షవర్‌లకు నీటిని అందించేందుకు వీటిని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ శాఖలు సరఫరా చేసే నీరు శుద్ధి చేసినది కాకపోవడంతో జాతరకు వచ్చే భక్తులు సొంతంగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మేడారంలో 2012, 2014 జాతరలో భక్తులకు తాగునీటి పరంగా ఎలాంటి ఇబ్బందులూ రాలేదు. భక్తులకు శుద్ధిచేసిన తాగునీటిని సరఫరా చేసే విషయాన్ని పక్కనబెట్టి అవసరం లేకున్నా కొత్తగా పైప్‌లైన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయడంపై ఆరోపణలు వస్తున్నాయి. ఆర్‌డబ్ల్యూఎస్ విభాగం నీటి శుద్ధి ప్రక్రియను ఆలోచించకుండా ప్రతిజాతరకు కొత్తగా వందల కిలో మీటర్ల పొడవున పైప్‌లైన్లు ఎవరి కోసం నిర్మిస్తున్నారో అర్థంకావడం లేదు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల సహకారంతో కొందరు కాంట్రాక్టర్లు... పాత లైన్లను మరమ్మతులు చేసి, కొత్తగా ఏర్పాటు చేసినట్లు చూపిస్తూ ప్రభుత్వ నిధులను కాజేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
నేడు టెండర్లు
మేడారం జాతర ఏర్పాట్ల కోసం గ్రామీణ నీటి సరఫరా(ఆర్‌డబ్ల్యూఎస్) విభాగం కొత్తగా నాలుగు ఇన్‌ఫిల్టరేషన్ బావులను నిర్మిస్తోంది. వీటి కోసం రూ.28 లక్షలు కేటాయించింది. ఇప్పటికే నిర్మించిన పైపులైన్లకు, కొత్తగా నిర్మించబోయే పైపులైన్ల సామర్థ్యానికి సరిపోయే స్థాయిలో ఇన్‌ఫిల్టరేషన్ బావులు ఉన్నాయి. అయినా కొత్తగా ఇన్‌ఫిల్టరేషన్ బావులను తవ్వేందుకు అధికారులు ప్రతిపాదనలు తయారు చేయడం విమర్శలకు తావిస్తోంది. అలాగే తాగునీటి సరఫరా పైపులైన్ల ఏర్పాటు, నిర్వహణ కోసం రూ.4 కోట్లు కేటాయించారు. తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.4 కోట్లు ఖర్చు చేయనున్నారు. జాతరకు వచ్చే వీఐపీల కోసం రూ.60 లక్షల వ్యయంతో వెస్ట్రన్ టైపు టాయిలెట్లు నిర్మిస్తారు. సుమారు రూ.8.50 కోట్లతో చేపట్టే ఈ 29 పనులకు ఆర్‌డబ్ల్యూఎస్ విభాగం ఈ-ప్రొక్యూర్‌మెంట్ పద్ధతిలో టెండరు ప్రక్రియ చేపట్టింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో రూ.2 కోట్ల వ్యయంతో రోడ్లకు ప్రత్యేక మరమ్మతులు చేపట్టనున్నారు. రెండు శాఖలకు సంబంధించిన పనులకు ఈ-ప్రొక్యూర్‌మెంట్ టెండరు ప్రక్రియ దాఖలు సోమవారంతో ముగియనుంది. ఏ పనులు ఎవరు చేపట్టాలన్నది రెండుమూడు రోజుల్లో అధికారికంగా తేలనుంది. కాగా, ఈ పనుల చేసే విషయంలో కాంట్రాక్టర్ల మధ్య ఇప్పటికే అంతర్గతంగా ఒప్పందాలు కుదిరినట్టు ప్రచారం జరుగుతోంది.