ఉప్పల్ చౌరస్తాలో స్తంభించిన ట్రాఫిక్
ఉప్పల్: ముందుచూపు లేకుండా ప్రభుత్వ యంత్రాంగాలు తీసుకుంటున్న చర్యలు వాహనదారులకు నరకం చూపిస్తున్నాయి. ఉప్పల్ రింగు రోడ్డు నుంచి నల్ల చెరువు వరకు రహదారి విస్తరణ ప్రతిపాదనలు ఆచరణలోకి రాలేదు. దీనికితోడు గడిచిన నాలుగు రోజులుగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి మట్టి సాంద్రత పరీక్షల కోసం ఉన్న అరకొర రహదారినీ ‘ఆక్రమించేశారు’. బోడుప్పల్ సిగ్నల్, ఉప్పల్ నల్ల చెరువు కట్ట, ఆదిత్య ఆస్పత్రి ఎదుట రోడ్డుపై పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేసి ఈ పనులు ప్రారంభించారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయకుండానే పనులు చేపట్టడంతో ట్రాఫిక్ ఇబ్బందులు మరింత పెరిగాయి. దీంతో వాహనదారులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్–నారపల్లి వరకు ఎలివేటెడ్ కారిడార్ (దాదాపు 6.25 కి.మీ) రోడ్డు ఏర్పాటు చేయడానికి రూ.658 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఉప్పల్ రహదారి వెడల్పు పనులకు శ్రీకారం చుట్టి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు కొన్ని భవనాలు మాత్రమే కూల్చివేశారు.
ఇప్పటికీ గ్రామకంఠం పరిధిలోనున్న నిర్మాణాలకు, స్థలాలకు ధరను నిర్ణయించలేకపోయారు. పట్టాదారులతో సరిసమానంగా నష్టపరిహారం చెల్లించాలని నిర్వాసితులు ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఉప్పల్ రోడ్డును అభివృద్ధి చేసే దిశలో అధికారులు రెండేళ్ల క్రితమే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించినా కొలిక్కి రాలేదు. అంబర్‌పేట్ కమేళా నుంచి రామంతాపూర్ వరకు, ఉప్పల్ చౌరస్తా నుంచి నారపల్లి వరకు రోడ్డు వెడల్పు పనులకు సన్నాహాలు చేసిన వెంటనే అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు. అలీకేఫ్ నుంచి ఉప్పల్ మెట్రోస్టేషన్ వరకు, అక్కడి నుంచి నల్ల చెరువు వరకు 150 ఫీట్ల సమాంతర రోడ్డును అభివృద్ధి చేయాలని నిర్ణయించినా పనులు ప్రారంభించలేదు. ఉప్పల్–నల్ల చెరువు రోడ్డు వెడల్పు జరుగుతున్న సమయంలో హబ్సిగూడ నుంచి వచ్చే వారికోసం సర్వే ఆఫ్ ఇండియా, చిలుకానగర్ మీదుగా బోడుప్పల్ కమాన్ వరకు రోడ్డును అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. వీటితో పాటు ప్రధాన రహదారులు, బైపాస్ రోడ్లపై దృష్టి సారించినప్పటికీ... ఏ ఒక్కటీ ఆచరణకు నోచుకోకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘ప్రత్యామ్నాయ మార్గాలపై వారం రోజులుగా సర్వే జరుగుతోంది. మరో 10 రోజుల్లో పూర్తవుతుంద’ని ఉప్పల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ మెహ్రా వివరణ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment