సాక్షి, హైదరాబాద్: పౌష్టికాహారమైన చేపల వినియోగాన్ని పెంచేందుకు జాతీయ చేపల అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీబీ) నిరంతరం కృషి చేస్తోందని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఐఏఎస్ అధికారి రాణికుముదిని తెలిపారు. శరీరానికి కావాల్సిన ఆవశ్యక ప్రొటీన్లను అందించే చేపలు మెరుగైన ఆహారమన్నారు. వీటిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, చేపల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు పలు అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు.
చేపలు తింటే ముళ్లు గొంతులో ఇరుక్కుంటాయని, ఇతర అపోహలు ప్రజల్లో ఉన్నాయని.. ఇలాంటి వాటిని పోగొట్టేందుకు జాతీయ స్థాయిలో పలు ఫిష్ ఫెస్టివల్స్‌ను నిర్వహిస్తునట్లు పేర్కొన్నారు. 2018 జూలైలో విశాఖపట్నంలో తొలిసారిగా ఫిష్ ఫెస్టివల్ నిర్వహించామని, దీనికి అద్భుతమైన స్పందన వచ్చిందని చెప్పారు. ఈ ఏడాది తొలి ఫిష్ ఫెస్టివల్‌ను హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందులో పాల్గొనే వారికి స్టాల్స్ కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.
మాంసం విక్రయాలు 93 శాతం..
తెలంగాణలో చేపల వినియోగం మొదటి నుంచి తక్కువగానే ఉందని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. చికెన్, మటన్ వినియోగం ఏకంగా 93 శాతం ఉందన్నారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనిలో భాగంగానే రూ. 50 కోట్ల విలువైన పరికరాలు పంపిణీ చేసిందన్నారు. ముళ్లు లేని చేపల మాంసాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసిందని వెల్లడించారు. నగరంలో 15 మొబైల్ ట్రక్కుల్లో డీ బోనింగ్ (ముళ్లు, చర్మం తొలగించినవి) చేపలను విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇవి సఫలీకృతం కాగానే రాష్ట్రమంతా విస్తరిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment