అమ్మ పాలులో ఎన్నో రకాల పోషకాలు | I milk a wide variety of nutrients | Sakshi
Sakshi News home page

అమ్మ పాలులో ఎన్నో రకాల పోషకాలు

Published Sun, Aug 4 2013 11:49 PM | Last Updated on Mon, May 28 2018 4:09 PM

అమ్మ పాలులో ఎన్నో రకాల పోషకాలు - Sakshi

అమ్మ పాలులో ఎన్నో రకాల పోషకాలు

 తల్లిపాలలో ఎన్నో రకాల పోషకాలు, యాంటీబాడీస్, పెరుగుదలకు దోహదపడే అనేకమైన సంక్లిష్ట అంశాలు ఉంటాయి. ఈ పెరుగుదలకు దోహదపడే అంశాలు అటు బిడ్డ భౌతికంగా పెరగడంతో పాటు, మానసిక వికాసానికీ... ఇలా రెండు రకాల ఎదుగుదలకు ఉపయోగపడతాయి. వాటి గొప్పదనాన్ని వివరించాలంటే ఒక్కటే ఒక్కమాట... తల్లిపాలకు బదులు ఇవ్వడానికి  మార్కెట్లో చాలా రకాలైన ఫార్ములా ఫీడ్స్ ఉన్నాయి. కానీ అవేవీ తల్లిపాలకు సాటిరావు. స్వాభావికమైన తల్లిపాలు ఇచ్చే  పోషకాలు, రక్షణలో వందోవంతు కూడా ఇవ్వలేవు. ఆగష్టు 1 నుంచి 7 వరకు జరిగే  తల్లిపాల వారోత్సవాల సందర్భంగా వాటి గొప్పదనాన్ని అర్థం చేసుకుని, అవగాహన కల్పించుకోడానికి ఉపయోగపడేదే ఈ కథనం.
 
 తల్లిపాలపై పెరిగే పిల్లలు మిగతా వారితో పోలిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు. భౌతికంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎదుగుతారు. రోగాలను స్వాభావికంగానే సమర్థంగా ఎదుర్కొంటారు. తల్లిపాలలో లెక్కకు మించి పోషకాలు ఉన్నా... మన అధ్యయనానికి అందేవి సుమారు 400 రకాల వేర్వేరు పోషకాలు మాత్రమే. వాటన్నింటినీ కృత్రిమంగా తయారు చేయడం అస్సలు సాధ్యం కాదు. కృత్రిమంగా తయారుచేసే ఫార్ములా పాలేవీ తల్లిపాలకు అస్సలు సాటిరావు.
 
 ప్రధాన అంశాలేమిటంటే...

 నీరు: ఈ పాలలో ఎక్కువ భాగం నీరు ఉంటుంది.
 
 ప్రోటీన్లు: పాలలో 75 శాతం వరకు ప్రోటీన్లు ఉంటాయి. ఈ ప్రొటీన్లు నైట్రోజన్‌ను కలిగి ఉంటాయి. ఇక నైట్రోజన్ లేకుండా ఉండే పోషకాలు సైతం ఉంటాయి. యూరియా, న్యూక్లియోటైడ్స్, పెప్టైడ్స్, ఫ్రీ అమైనో ఆసిడ్స్, డీఎన్‌ఏలు వంటి చాలా రకాలైన పదార్థాలు ఉంటాయి.
 
 కొవ్వులు: శరీరానికి అవసరమైన కొవ్వు పదార్థాలు (ఎసెన్షియల్ ఫాటీ యాసిడ్స్)తో పాటు సుదీర్ఘమైన గొలుసుల్లా ఉండే లాంగ్ చైన్ పాలీ అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ కూడా ఉంటాయి.
 
 పిండిపదార్థాలు: ఇందులో కార్బోహైడ్రేట్స్ అని ఇంగ్లిష్‌లో పిలిచే పిండిపదార్థాలు కూడా ఉంటాయి. ల్యాక్టోజ్ అన్నది తల్లిపాలలో ఉండే ప్రధాన కార్బోహైడ్రేట్.
 
 ఇతర పోషకాలు: పైన పేర్కొన్న ప్రధాన అంశాలతో పాటు చాలా రకాల ఖనిజలవణాలు, విటమిన్లు, చాలా అరుదుగా లభ్యమయ్యే కొన్ని విలువైన మూలకాలు కూడా ఉంటాయి.
 
 పాలిచ్చే తల్లికి కొన్ని సూచనలు

 మీరు పాలిచ్చే బిడ్డ తల్లా? అయితే ఈ సూచనలు పాటించండి. ఇవి ఇటు తల్లికీ, అటు బిడ్డకూ మేలు చేస్తాయి.
 
 తల్లి తినే ఆహారాన్ని బట్టి బిడ్డకు పట్టే పాల రుచి (ఫ్లేవర్) కూడా మారుతూ కొత్త రుచిని సంతరించుకుంటుంటుంది. అప్పుడు బిడ్డ మరింతగా ఆస్వాదిస్తూ తల్లిపాలను ఇష్టంగా తాగుతుంటాడు. అందుకే తల్లి రకరకాల కాయధాన్యాలు (హోల్‌గ్రెయిన్స్), పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తినాలి. అయితే ఇక్కడొక చిన్న జాగ్రత్త పాటించాలి. తల్లి తినే పండ్లు, కూరగాయలు వంటి వాటిని బాగా కడిగాకే తినాలి. లేకపోతే వాటిపై ఉండే క్రిమిసంహారక రసాయనాలు తల్లిలోకి, అక్కడినుంచి బిడ్డకు ఇచ్చే పాలలోకీ ప్రవేశించి, బిడ్డ ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపుతాయి. అందుకే వాటిని బాగా కడిగాక మాత్రమే తినాలని గుర్తుంచుకోండి.
 
 పాలిచ్చే తల్లి ఎక్కువగా నీళ్లు తాగాలి. కానీ చాలామంది పెద్దలు తల్లిని ఎక్కువగా నీళ్లు తాగనివ్వరు. తల్లి నీళ్లు ఎక్కువ తాగితే బిడ్డకు జలుబు చేస్తుందంటూ ఆమెను తక్కువ నీళ్లు తాగేలా కట్టడి చేస్తుంటారు. తల్లి ఎక్కువ నీళ్లు తాగితే బిడ్డకు జలుబు చేస్తుందనడం అపోహ మాత్రమే. తల్లికి ఎక్కువగా పాలు ఊరి, బిడ్డకు సరిపడా పాలు పడాలంటే నీళ్లు ఎక్కువగా తాగాల్సిందే. అందుకే దాహమైనా కాకపోయినా తల్లి నీళ్లు తాగుతుండాలి. తల్లి ఎన్ని నీళ్లు తాగాలంటే... ఆమెకు మూత్రం పసుపు రంగులో రానట్లుగా ఉండేలా చూసుకోవాలి.
 
 తల్లిపాలలో బిడ్డకు మేలు చేసే ఐరన్ ఎక్కువగా ఉండటానికి బీన్స్, వేరుశనగ పల్లీలు, అలచందలు, తృణధాన్యాలు, డ్రైఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని విటమిన్-సితో ఇచ్చే పండ్లతో కలిపి తీసుకోవడం మంచిది. అంటే నిమ్మజాతిపండ్లు, స్ట్రాబెర్రీస్ వంటివి.
 
 తల్లిపాలలో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటానికి గుడ్లు, పాలు, పాల ఉత్పాదనలు, బఠాణీలు, నట్స్ వంటివి తీసుకోవాలి.
 
 క్యాల్షియమ్ బాగా సమకూరేలా బాగా ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు, సోయామిల్క్, పెరుగు, టోఫూ వంటి ఆహారపదార్థాలు పుష్కలంగా తీసుకోవాలి.
 
 విటమిన్ బి12తో పాటు విటమిన్ డి పుష్కలంగా లభించడానికి వీలుగా పాలు, పాల ఉత్పాదనలతో పాటు మాంసాహారం తీసుకోవాలి. అవి తీసుకోని వారు డాక్టర్ సలహా మేరకు మాత్రమే విటమిన్ బి12, విటమిన్-డి సప్లిమెంట్స్ మాత్రల రూపంలో తీసుకోవాలి.
 
 పాలిచ్చే తల్లి తీసుకోకూడని ఆహారాలు :
 కెఫిన్ ఉండే పదార్థాలు: పాలిచ్చే సమయంలో కెఫిన్ పుష్కలంగా ఉండే కాఫీలు, కూల్‌డ్రింక్స్ తీసుకోకపోవడమే మంచిది. ఒకవేళ తీసుకోవాలనిపిస్తే మాత్రం చాలా పరిమితంగా రోజూ రెండు కప్పులకు మించనివ్వవద్దు.
 
 సముద్రపు చేపలు: చేపలు మంచి పౌష్టికాహారమే అయినా... కొన్ని రకాల సముద్రపు చేపల్లో మెర్క్యులరీ పాళ్లు ఎక్కువగా ఉంటాయి. ఈ మెర్క్యులరీ బిడ్డలో నాడీవ్యవస్థ ఎదుగుదలపై దుష్ర్పభావం చూపుతుంది. పైగా కొన్ని రకాల సముద్రపు చేపలు తీసుకున్న తర్వాత పట్టే పాలు బిడ్డకు అలర్జీ కలిగించవచ్చు. అందుకే బిడ్డకు పాలుపట్టే సమయంలో సముద్రపు చేపలను ఆహారంగా స్వీకరించకపోవడమే మంచిది.
 
 బిడ్డకు పట్టే పాలు... తల్లికీ చేస్తాయి మేలు
 బిడ్డకు పాలు పట్టడం అటు తల్లికీ అనేక రకాలుగా మేలు చేస్తుంది. బిడ్డకు పాలు పడుతుండటం వల్ల తల్లికి కలిగే ప్రయోజనాల్లో కొన్ని...
 
 పాలిచ్చే తల్లుల్లో ఆక్సిటోసిస్ అనే రసాయనం స్రవించి అది ప్రసవం తర్వాత అయ్యే రక్తస్రావాన్ని బాగా తగ్గిస్తుంది. అంతేకాదు... ప్రసవం తర్వాత గర్భసంచి ఆరోగ్యకరంగా ముడుచుకుపోయేలా చేస్తుంది.
 
 పాలిచ్చే తల్లుల బరువు స్వాభావికంగా తగ్గుతుంది. అంటే పాలు ఇస్తున్నంత కాలం  వాళ్లు లావెక్కరు. ఇది వారిలోని సౌందర్యాన్ని ఇనుమడింపజేసే అంశంతో పాటు బరువు పెరగకపోవడం వల్ల బరువు రిస్క్ ఫ్యాక్టర్‌గా గల అనేక జబ్బుల నుంచి రక్షణ లభిస్తుంది.
 
 పాలిచ్చే తల్లుల్లో పాలు పడుతున్నంతకాలం ప్రకృతి సిద్ధంగానే గర్భధారణ జరగకుండా రక్షణ ఉంటుంది. అంటే పాలు పట్టడం ఒకరకంగా గర్భనిరోధకంగా పనిచేస్తుంది. (అయితే అంతమాత్రాన అసలే గర్భధారణ జరగదని చెప్పలేం. కాబట్టి ఆ టైమ్‌లో సెక్స్‌లో పాల్గొనదలచిన దంపతులు గర్భనిరోధక సాధనాలను వాడాల్సిందే).
 
 పాలిచ్చే తల్లులకు అనేక రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ ఉంటుంది.
 
 పాలిచ్చే తల్లులకు డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువ.
 
 పాలివ్వడం వల్ల ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు, మానసిక రుగ్మతలకు గురయ్యే అవకాశాలు చాలా తక్కువ  
 
 పాలిచ్చే తల్లుల్లో మేను కూడా ప్రకాశవంతంగా, ఆకర్షణీయంగా మారుతుంది.
 
 పాలివ్వకపోతే ప్రమాదమే...
 బిడ్డకు తల్లి పాలు పట్టకపోవడం వల్ల తల్లికి చాలారకాల నష్టాలు జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటిలో కొన్ని...
 
  బిడ్డకు పాలు పట్టని తల్లులకు మూత్రకోశ ఇన్ఫెక్షన్స్ (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్) వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ
 
  మెనోపాజ్ పూర్తయ్యాక (లేదా కొన్ని సందర్భాల్లో మెనోపాజ్ రాకముందే) చాలా రకాల క్యాన్సర్లు, ముఖ్యంగా ఒవేరియన్ క్యాన్సర్‌కు అవకాశాలు ఎక్కువ.
 
  ఎముకలు పెళుసుగా మారి, తేలిగ్గా విరిగిపోయే ఆస్టియోపోరోసిస్ జబ్బు వచ్చేందుకు అవకాశాలు చాలా చాలా ఎక్కువ.
 
 తల్లిపాలతో బిడ్డకు కలిగే ప్రయోజనాలు
 తల్లిపాలతో అటు బిడ్డకూ, ఇటు తల్లికీ, మరోవైపు సమాజానికీ... ఇలా ఎన్నో రకాలుగా మేలు చేకూరుతుంది. బిడ్డకు ఎన్నో జబ్బులు రావు లేదా డయాబెటిస్ వంటి కొన్ని భవిష్యత్తులో రావాల్సిన జబ్బులు చాలా ఆలస్యమవుతాయి. ఇక తల్లి పాలు తాగే పిల్లలతో పోలిస్తే, తల్లి పాలపై లేని పిల్లల్లో చాలా రకాల జబ్బులు కనిపిస్తాయి. అవి...
 
 జీర్ణకోశ సమస్యలు: తల్లిపాలు స్వాభావికంగా ఉండటం వల్ల అవి జీర్ణకోశానికి ఇబ్బంది కలిగించకుండా జీర్ణమవుతాయి. కానీ ఫార్ములా పాలు/ పోతపాలు వంటివి జీర్ణకోశ ఇబ్బందులను కలిగిస్తాయి.
 
 ఆస్తమా: తల్లిపాలు బిడ్డకు సరిపడకపోవడం అంటూ ఉండదు. కానీ పోతపాలుగా ఇచ్చే యానిమల్ మిల్క్ చాలావరకు బిడ్డకు సరిపడకపోవడానికి అవకాశాలు ఎక్కువ. అందుకే పోతపాలపై పెరిగే పిల్లల్లో ఆస్తమా వంటి జబ్బులు, ఎగ్జిమా వంటి రుగ్మతలు ఎక్కువగా కనిపిస్తాయి. వీటితోపాటు తల్లిపాలపై పెరిగే బిడ్డలకు శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ.
 
 బిడ్డకు చెవి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు తక్కువ.
 
 తల్లిపాలపై పెరిగే పిల్లల్లో స్థూలకాయం వచ్చే అవకాశాలు చాలా తక్కువ. పోతపాలపై పెరిగే పిల్లల్లో చిన్నప్పుడే స్థూలకాయం వచ్చే అవకాశాలు ఎక్కువ.
 
 తల్లిపాలపై పెరిగే పిల్లల్లో చిన్నప్పుడు క్యాన్సర్లు (ఛైల్డ్‌హుడ్ క్యాన్సర్లు) వచ్చే  అవకాశాలు చాలా తక్కువ.
 
 నెక్రొటైజింగ్ ఎంటెరోకొలైటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలూ తక్కువే.
 
 ఒక్కమాటలో చెప్పాలంటే తల్లిపాలపై పెరిగే పిల్లలు చాలా తక్కువగా జబ్బు పడతారు. ఫలితంగా వారి రక్షణ కోసం, వారి ఆరోగ్యం కోసం తల్లిదండ్రులు ఖర్చు చేయాల్సిన డబ్బు చాలా చాలా తక్కువ. కాబట్టి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడానికి తల్లిపాలు పట్టడం చాలా అవసరమని ప్రతి తల్లీ, ప్రతి కుటుంబమూ గుర్తెరగాలి.
 
 నిర్వహణ: యాసీన్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement