
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ, వడ్డీమాఫీ పూర్తికాలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. దీనికి సంబంధించి వివిధ జిల్లాల నుంచి తెప్పించిన రైతుల జాబితాను శుక్రవారం ఆయన శాసనసభ స్పీకర్ మధుసూదనాచారికి అందించారు. అనంతరం మాట్లాడుతూ రుణమాఫీ సకాలంలో చేయకపోవడంతో, రైతులపై వడ్డీభారం పడిందన్నారు.
రైతులకు వడ్డీమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు శాసనసభలోనే హామీ ఇచ్చారని, అయితే ఇంకా అమలుచేయకుండా మాటతప్పారని విమర్శించారు. వడ్డీ మాఫీ, రుణ మాఫీ జరగలేదని రైతులు ఇచ్చిన దరఖాస్తులను స్పీకర్‌కు అందించామన్నారు. వడ్డీ భారం రైతులపై పడలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం పచ్చి అబద్ధమని ఉత్తమ్ పేర్కొన్నారు. వడ్డీ మాఫీ కాలేదని బ్యాంకర్లు ఇచ్చిన స్టేట్‌మెంట్లను కూడా స్పీకర్‌కు అందించామన్నారు.
50 రోజులైనా శాసనసభను నడిపిద్దామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ అర్ధాంతరంగా సభను ఎందుకు వాయిదా వేసుకున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్షపార్టీలకు అవకాశం ఇవ్వకుండా, కేవలం టీఆర్‌ఎస్ వాళ్ల గొప్పలను చెప్పుకోవడానికే సభను పరిమితం చేశారని ఆరోపించారు. తాము ఇచ్చిన వివరాలను ప్రభుత్వానికి పంపిస్తామంటూ స్పీకర్ హామీ ఇచ్చారన్నారు.