సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తామని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. రుణమాఫీపై తాము ఇచ్చిన హామీ అమలు సాధ్యంకాదంటూ సీఎం కేసీఆర్ పేర్కొనడాన్ని ఆయన తప్పుబట్టారు. తనను నమ్మిన ప్రజలను దగా చేయడం కేసీఆర్‌కు అలవాటని, ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు.
ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ట్రాక్ రికార్డ్ కాంగ్రెస్‌కు ఉందని.. ఉచిత విద్యుత్‌ను సాధ్యం చేసి చూపింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తుంచుకోవాలని సూచించారు. కేసీఆర్ నాలుగేళ్ల పాలన అంశంపై ఉత్తమ్ శుక్రవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఏడాది రాష్ట్ర బడ్జెట్ రూ.1.96 లక్షల కోట్లకు చేరుతుందని, అందులో రైతుల కోసం రూ.40 వేల కోట్లు ఖర్చు చేయలేమా? అని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక దేశమంతా వ్యవసాయ రుణమాఫీ జరుగుతుందని.. కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్రంలో రుణమాఫీ చేస్తామని చెప్పారు. నాలుగేళ్ల కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ఉత్తమ్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ‘శక్తి’యాప్
పార్టీలో బూత్ స్థాయి కార్యకర్తలతో నేరుగా అనుసంధానం అయ్యేందుకు వీలుగా శక్తి యాప్‌ను కాంగ్రెస్ అందుబాటులోకి తెచ్చింది. దీనిపై శుక్రవారం ఉత్తమ్, భట్టి విక్రమార్క, ఏఐసీసీ డేటా అనలిస్ట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి తదితరులు గాంధీభవన్లో సమావేశమై చర్చించారు. టీ పీసీసీ తరఫున ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిని డేటా అనలిస్ట్ హెడ్‌గా నియమించారు.
ఈ నెల 30వ తేదీ వరకు బూత్ లెవెల్ నాయకులు, కార్యకర్తలు శక్తి యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని ఈ సందర్భంగా ఉత్తమ్ సూచించారు. శక్తి యాప్ ద్వారా నాలుగున్నర లక్షల మందిని క్రియాశీల సైన్యంగా తయారు చేయాలన్నది రాహుల్‌గాంధీ ఆలోచన అని తెలిపారు.
7996179961 నంబర్‌కు ఓటర్ ఐడీ నంబర్‌ను ఎస్సెమ్మెస్ చేస్తే.. శక్తి యాప్‌తో అనుసంధానం అవుతారని ప్రవీణ్ చక్రవర్తి వివరించారు. కాంగ్రెస్ తరఫున ఏ ఎన్నికల్లో పోటీ చేయాలన్నా... శక్తి యాప్‌లో రిజిస్టర్ కావడం తప్పనిసరి అని సూచించారు. నాయకులతో కార్యకర్తలు నేరుగా అనుసంధానం అయ్యేందుకు శక్తి తోడ్పడుతుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా పేర్కొన్నారు.
‘ఆజాద్’ ప్రచారంపై కుంతియా అసంతృప్తి
రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్న కుంతియాను తొలగించి, గులాం నబీ ఆజాద్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై సమావేశంలో కుంతియా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. పార్టీలోని కొందరు కావాలనే ఈ ప్రచారం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కుంతియా సూచించినట్టు సమాచారం.
రంజాన్ అనంతరం తిరిగి బస్సుయాత్ర
నాలుగో విడత బస్సు యాత్ర అంశంపైనా శుక్రవారం గాంధీభవన్‌లో కీలక సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియాతో పాటు ఉత్తమ్, భట్టి, జానారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రంజాన్ అనంతరం వారం పాటు నాలుగో విడత బస్సుయాత్రను నిర్వహించాలని... గతానికి భిన్నంగా రోజుకు రెండు నియోజకవర్గాల్లో పర్యటించి, సభలు పెట్టాలని నిర్ణయించారు.
ఈ విడత బస్సు యాత్రలో పాల్గొనేందుకు వస్తానని రాహుల్‌గాంధీ చెప్పారని, ఆయన ఈ నెలాఖరున వచ్చే అవకాశముందని ఉత్తమ్ వెల్లడించారు. రాహుల్ అమెరికా నుంచి వచ్చాక తేదీలపై స్పష్టత వస్తుందన్నారు. 12న పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఇవ్వాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment