సోనియా జన్మదినం సందర్భంగా గాంధీభవన్‌లో కేక్ కట్ చేస్తున్న ఉత్తమ్. చిత్రంలో వీహెచ్, గూడూరు తదితరులు
సాక్షి, హైదరాబాద్: ఆరు దశాబ్దాల తెలంగాణ కలను సాకారం చేసిన మహనీయురాలు సోని యాగాంధీ అని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి కొనియాడారు. ఆదివారం గాంధీభవన్‌లో యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి కేక్ కట్ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సోని యాగాంధీకి భారత ప్రధాన మంత్రి పదవిని చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ తృణప్రాయంగా భావించి త్యాగం చేశారని గుర్తు చేశారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని తెలిపారు. యూపీఏ అధికారంలో ఉన్న కాలంలో చైర్‌పర్సన్‌గా చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. గ్రామీణ పేద ప్రజలకు ఉపాధి అందించాలనే జాతీయ ఉపాధిహామీ పథకం, ఆకలి చావుల నివారణకు ఆహార భద్రతా చట్టం, ప్రజలకు ప్రభుత్వాల మధ్య పారదర్శకత, జవాబుదారీతనం కోసం సమాచారహక్కు చట్టం తీసుకువచ్చారని వివరించారు. సమాజంలోని ప్రతి పేదవారికి చదువు అందించాలని విద్యాహక్కు చట్టాలతో పాటు, మరెన్నో చారిత్రాత్మక చట్టాలను చేయడంలో సోనియాగాంధీ కృషి మరవలేనిదని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వీహెచ్, టీపీసీసీ కోశాధికారి గూడురు నారాయణరెడ్డి ,అధికార ప్రతి నిధులు నిరంజన్, ఇందిరా శోభన్ పాల్గొన్నారు.
ఏఐసీసీలో సోనియా జన్మదిన వేడుకలు
సాక్షి, న్యూఢిల్లీ: రాజీవ్ సద్భావన యాత్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ 72వ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, యాత్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అంతకు ముందు వారు సోనియా గాంధీని ఆమె నివాసంలో కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నేతలు ఆమె సేవలను కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో సోనియాగాంధీదే కీలక పాత్ర అని పొంగులేటి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment