సిరిసిల్ల / కోల్‌సిటీ (రామగుండం) : ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోనా ఎన్నెన్నో కలలూ... ఎన్నెన్నో కథలూ...’ అంటూ ఓ సినీకవి ప్రేమ మాధుర్యంలోని అర్థాన్ని పాట రూపంలో ‘ప్రేమలేఖ’ను రాశాడు. అనుభవించే వారికి మాత్రమే ప్రేమలో ఉన్న మాధుర్యం అర్థమవుతుంది. ఫిబ్రవరి 14 ‘వాలెంటైన్స్ డే’ సందర్భంగా..
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్ల ప్రేమాలయంగా వర్ధిల్లుతోంది. దశాబ్దకాలంగా 30 జంటలు ఒక్కటయ్యాయి. వరకట్నాలు లేకుండా.. ఆదర్శ పెళ్లిళ్లు చేసుకున్నారు. అక్కడ కొట్లాటలు.. గొడవలు.. ‘పరువు’ హత్యలు కనిపించవు.
పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం...
మాది ఖమ్మం జిల్లా ఇల్లందు. మెదక్ జిల్లా సంగారెడ్డిలోని ఎంఎన్‌ఆర్ మెడికల్ కాలేజీలో 2006లో లావణ్యకు, నాకు సీటు వచ్చింది. కాలేజీలోనే ఒకరికొరం పరిచయమయ్యాం. మా పరిచయం ప్రేమగా మారింది. మా ప్రేమను సిన్సియర్‌గా మా పేరెంట్స్‌కు చెప్పాం. ఇద్దరం డాక్టర్లమయ్యాక.. 2012 నవంబర్ 29న పెద్దల సమక్షమంలో పెళ్లి చేసుకున్నాం. నాలుగేళ్ల క్రితం మాకు బాబు గౌతంచంద్ర పుట్టడంతో రెండు కుటుంబాలు చాలా హ్యాపీగా ఉన్నాయి.
– డాక్టర్ మహేందర్, డాక్టర్ లావణ్య, గోదావరిఖని
మనసుపడ్డాం.. ఏకమయ్యాం
మాది కులాంతర వివాహం. తెలియకుండా ప్రేమలో పడ్డాం. మాటలు కలిసి పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమను నిలబెట్టుకునేందుకు పెళ్లి చేసుకున్నాం. తొలుత ఇంట్లో వాళ్లు అభ్యంతరం చెప్పినా.. వారి మనసు మార్చి ఏకమయ్యాం.
– ముచ్చర్ల శ్రీనివాస్– అనిత దంపతులు
ఒకరినొకరం అర్థం చేసుకున్నాం..
మామధ్య పరిచయం ప్రేమగా మారింది. ప్రేమపెళ్లి చేసుకుని ఏకమయ్యాం. పరస్పర అవగాహనతో జీవిస్తున్నాం. ఒకరినొకరం అర్థం చేసుకున్నాం. ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవడం సంతోషాన్నిచ్చింది. స్థిరపడి పెళ్లి చేసుకోవాలి.
– కుమ్మరి దిలీప్– శైలజ దంపతులు
పెద్దలు ఆమోదిస్తేనే.. సంతోషం
ప్రేమ పెళ్లిళ్లకు పెద్దల ఆమోదం పొందితేనే బాగుంటుంది. ఇల్లు విడిచిపోవడం.. కష్టపడి ఇంటికి చేరడం బాగుండదు. అయిన వారి మధ్య ఆప్యాయంగా జీవించాలన్నదే మా లక్ష్యం. ఇన్నేళ్ల జీవితంలో పొరపొచ్చలు వచ్చినా.. కలిసి జీవించడం ఆనందంగా ఉంది.
– వెల్గం నవీన్– సంధ్య దంపతులు
ప్రేమ కానుకలు
కరీంనగర్‌ఎడ్యుకేషన్: ప్రేమికుల రోజున ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తం చేసేందుకు ఫ్యాన్సీ ఐటమ్స్ ఇచ్చి పుచ్చుకునేవారు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. జువెల్లరి ఐటమ్స్ పట్ల మక్కువ చూపిస్తున్నారు. లాకెట్, చేతి ఉంగరాలు, లవ్ ఆకారంలో ఉండే వెండి వస్తువులపై దృష్టి సారించి వాటిని అందజేస్తూ తమ ప్రేమను చాటుతున్నారు.
– విజయేందర్‌రాజు, షాప్ నిర్వాహకుడు, కరీంనగర్
Comments
Please login to add a commentAdd a comment