
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కొత్త చైర్మన్‌గా టీఆర్‌ఎస్ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ప్రతాప్‌రెడ్డి ఈ పదవిలో కొనసాగుతారని, కొత్త చైర్మన్ తన విధులు నిర్వహించేందుకు వీలుగా ఆయనకు కార్యాలయం, వాహనాలు, సిబ్బంది, ఇతర సౌకర్యాలు కల్పించాల్సిందిగా పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతాప్‌రెడ్డి నియామకం నేపథ్యంలో ఆయన బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో అటవీ సంపదను పరిరక్షించడంతో పాటు, పచ్చదనం పెంపుదలకు కృషి చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ సూచించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బూరుగుపల్లికి చెందిన వంటేరు ప్రతాప్‌రెడ్డి సుదీర్ఘంగా గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో కాంగ్రెస్‌ను వీడి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.