మంగళవారం ఉదయం 11 గంటలకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్ హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్‌కు చేరుకున్నారు.
ఉదయం 11:26 గంటలకు సతీసమేతంగా గవర్నర్ దంపతులు భద్రకాళి ఆలయంలో పూజలు చేశారు.
మధ్యాహ్నం 3.40 గంటలకు దుగ్గొండి మండలం ముద్దు నూరు పెద్ద చెరువులో పూడికతీత పనులు పరిశీలించారు.
సాయంత్రం 4:05 గంటలకు నల్లబెల్లి మండలం శనిగరం చెరువులో చేపట్టిన పూడికతీత పనులు పరిశీలించారు.
సాయంత్రం 5:45 గంటలకు వెంకటాపురం మండలం పాలంపేటలోని రామప్ప ఆలయంలో పూజలు చేశారు. శిల్ప సంపద గురించి తెలుసుకున్నారు.
రాత్రి 8:30 గంటలకు ఖిలా వరంగల్‌లోని కోట, కాకతీయ తోరణాలను ఆసక్తిగా తిలకించారు.
వర్షాకాలంలోగా ‘మిషన్ కాకతీయ’ పనులు పూర్తి చేయూలని అధికారులకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సూచించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం జిల్లాలో పర్యటించారు. మిషన్ కాకతీయలో చేపడుతున్న చెరువుల పూడికతీత పనులు పరిశీలించారు. భద్రకాళి, రామప్ప ఆలయాల్లో పూజలు చేశారు. ఖిలా వరంగల్‌లో సౌండ్, లైటింగ్ షో వీక్షించారు.
సాక్షి, హన్మకొండ : మిషన్ కాకతీయలో భాగంగా దుగ్గొండి మండలం ముద్దనూరు గ్రామంలోని పెద్ద చెరువులో చేపట్టిన పూడికతీత పనులను మంగళవారం మధ్యాహ్నం గవర్నర్ నరసింహన్ పర్యవేక్షించారు. పూడికమట్టి తీసుకెళ్లేందుకు వచ్చిన స్థానిక రైతులు వేములపల్లి మల్లయ్య, జక్కుల నర్సయ్యతో మాట్లాడారు. పూడికమట్టిని పొలంలో వేయడం వల్ల భూసారం పెరుగుతుందని, పెట్టుబడి వ్యయం తగ్గుతుందని రైతులు సూచించారు. అనంతరం చెరువు సమీపంలోఏర్పాటు చేసిన సభలో గ్రామస్తులనుద్దేశించి ప్రసంగించారు.
ఇంత పెద్దచెరువు నీరులేక ఎండిపోవడం బాధకరమన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం మిషన్ కాకతీయ పనుల్లో ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. చెరువులను కాపాడుకుంటేనే రాష్ట్రం పచ్చగా వర్ధిల్లుతుందన్నారు. అక్కడి నుంచి నల్లబెల్లి మండలం శనిగరం చెరువులో చేపట్టిన పూడికతీత పనులు పరిశీలించారు. పనుల్లో నాణ్యత లోపించకుండా వర్షకాలం మొదలయ్యేలోగా చెరువు పూడికతీత పనులు పూర్తికావాలని ఆయన ఆదేశించారు.
రామప్ప శిల్ప సంపద అద్భుతం
వెంకటాపురం మండలం పాలంపేటలోని రామప్ప చెరువు గట్టుపై నుంచి చెరువు అందాలు తిలకించారు. అనంతరం రామప్ప ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో ఉన్న శిల్పాలకు సంబంధించిన వివరాలను స్థానికగైడ్ విజయ్ చెప్తుంటే ఆసక్తిగా విన్నారు. మదనిక విగ్రహాలు చెక్కడంలో నాటి శిల్పులు కనబరిచిన నైపుణ్యాన్ని చూస్తూ గవర్నర్ దంపతులు ఆశ్చర్యపోయారు.
ఆలయ గోడలపై ఉన్న శిల్పకళ గురించి గవర్నర్ దంపతులు కొద్దిసేపు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి రామప్ప అనే పేరు ఎందుకు వచ్చిందంటూ గవర్నర్ ప్రశ్నించి, అందుకు సంబంధించిన చారిత్రక వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ చైర్మన్ ప్రొఫెసర్ పాండురంగారావు ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన నీళ్లలో తేలియాడే ఇటుకలు, ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన సాండ్‌బాక్స్ టెక్నాలజీలతోపాటు కామేశ్వర, కాటేశ్వరాలయం పునర్ నిర్మాణ పనుల గురించి గవర్నర్‌కు వివరించారు. అనంతరం వరంగల్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.
భద్రకాళి, ఖిల్లా సందర్శన
వరంగల్ నగరంలో ఉన్న భద్రకాళి గుడిని గవర్నర్ దంపతులు ఈఎస్‌ఎల్ నరసింహన్, ఆయ న సతీమణి విమలా నరసింహన్ ఉద యం దర్శించుకున్నారు. భద్రకాళి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోకులంలో ఉన్న ఆవులకు అరటి పళ్లు నైవేధ్యంగా అందించారు. ఈ సందర్భంగా వరంగల్ తాగునీటి అవసరాలు తీరుస్తున్న భద్రకాళి చెరువుకు సంబంధించిన వివరాలపై కలెక్టర్ వాకాటి కరుణను వాకాబు చేశారు.
చెరువును రక్షించాలంటూ కలెక్టర్‌కు సూచించారు. అనంతరం రాత్రి 8:30 గంటలకు ఖిలా వరంగల్‌కు చేరుకున్నారు. మొదటగా కుష్‌మహాల్‌ను సందర్శించారు. అనంతరం కోట మధ్యలో ఉన్న కాకతీయ కీర్తి తోరణాలను ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా పురావస్తు, పర్యాటకశాఖల అధికారులు ప్రత్యేకంగా మ్యూజికల్ లైట్‌షోను ఏర్పాటు చేశారు. దాదాపు గంటపాటు ఆయన కోటలో గడిపారు.
ఘన స్వాగతం
గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహాన్‌కు జిల్లా అధికార యంత్రాంగం ఘన స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం 11:00 గంటలకు గవర్నర్ దంపతులు హరితా కాకతీయ హోటల్‌కు చేరుకోగానే కలెక్టర్ కరుణ, డీజీపీ మల్లారెడ్డి, ఎస్పీ అంబర్ కిశోర్ ఝా, జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ పుష్ఫగుచ్చాలతో ఘన స్వాగతం పలికారు. కాకతీయ హోటల్‌లో అల్పాహారం తీసుకున్న అనంతరం ఉదయం 11:25 నిమిషాలకు జిల్లా పర్యనటకు బయల్దేరి వెళ్లారు. టూరిజం అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ క్రిస్టియానా మధ్యాహ్నన భోజన విరామ సమయంలో గవర్నర్ దంపతులను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు.
కూలిన సభావేదిక
ముద్దనూరు గ్రామంలోని పెద్ద చెరువు వద్ద ఏర్పాటు చేసిన సభాస్థలి గవర్నర్ రావడానికి 15 నిమిషాల ముందు బలంగా వీచిన గాలికి కూలింది. దానితో అధికారులు హుటాహుటిన తిరిగి వేదికను ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడ్డారు.
కాంగ్రెస్ నేతలకు నో అపాయింట్‌మెంట్
వరంగల్ : జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిసేందుకు జిల్లా కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. వీరు ముందస్తుగా ఎలా అనుమతి తీసుకోక పోవడంతో గవర్నర్ వ్యక్తిగత వ్యవహారాల అధికారులు, సిబ్బంది నిరాకరించినట్లు సమాచారం. రాష్ట్రంలోని ప్రభుత్వ పాలన, జిల్లాలో అభివృద్ధి పనుల విషయమై గవర్నర్‌ను కలిసేం దుకు ప్రయత్నించినట్లు డీసీసీ నేతలు తెలిపారు.
నేడు వేయిస్తంభాల ఆలయ సందర్శన
హన్మకొండ కల్చరల్ : రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు బుధవారం ఉదయం 8 గంటలకు హన్మకొండలోని చారిత్రాత్మక శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయాన్ని సందర్శించనున్నారు. ఆయన రాకనుపురస్కరించుకుని దేవాదాయశాఖ డీసీ తాళ్లూరి రమేష్‌బాబు సూచనల మేరకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశామని, కాకతీయ శిల్పాల ఛాయ చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశామని ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు.