
టీటీడీ సభ్యుడిగా వీరయ్య ప్రమాణస్వీకారం
సాక్షి, తిరుమల: టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలోని గరుడాళ్వారు సన్నిధిలో ఆయన చేత తిరుమల జేఈవో కేఎస్. శ్రీనివాసరాజు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ర ంగనాయక మండపంలో ఆయన్ను వేద పండితులు ఆశీర్వదించారు.
చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, జేఈవో శ్రీనివాసరాజు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాటాడుతూ టీటీడీ సభ్యుడు కావడం పూర్వజన్మ సుకృతమన్నారు. సామాన్య భక్తులకు సేవ చేసేందుకు కృషి చేస్తానన్నారు. తెలుగు రాష్ట్రాలతో కూడిన కొత్త ధర్మకర్తల మండలిలో తనకు అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.