కూరగాయల ఔట్‌లెట్లు | Vegetable outlets | Sakshi
Sakshi News home page

కూరగాయల ఔట్‌లెట్లు

Published Sun, Jun 21 2015 12:42 AM | Last Updated on Sat, Jul 6 2019 3:18 PM

Vegetable outlets

- ఈ నెల 23 నుంచి ప్రారంభం
- కాలనీలు, కార్యాలయాల్లో అందుబాటులోకి..
- ధరల నియంత్రణకు చర్యలు
- రంగంలోకి మార్కెటింగ్ శాఖ
సాక్షి, సిటీబ్యూరో:
కూరగాయల ధరలను నేల మీదికిదించే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. అసలు ధరకే అన్నిరకాల కూరగాయలను వినియోగదారుడికి అందుబాటులో ఉంచాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. పెద్దమొత్తంలో సరుకు సేకరించి... నగరం నలుమూలకు సరఫరా చేసి... కొరత లేకుండా చూడటం ద్వారా ధరలకు కళ్లెం వేయాలని భావిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, కాలనీలు, అపార్టుమెంట్లు, ట్రాఫిక్ ఇబ్బంది లేని కూడళ్లలో పెద్దసంఖ్యలో కూరగాయల ఔట్‌లెట్ల ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి వీటిని ప్రారంభించేందుకు అధికారులు ముహూర్తం ఖరారు చేశారు. నగరంలో కూరగాయల ధరలపై ‘ధర దగా’ శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే.

దీనికి స్పందించిన మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ధరల నియంత్రణకు చర్యలు చేపట్టారు. తాజా కూరగాయలను హోల్‌సేల్ ధరకే అందుబాటులో ఉంచడం ద్వారా రిటైల్ వ్యాపారుల అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు వినియోగదారులకు ఊరట కలిగించవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ‘మన కూరగాయల’ పథకం కింద 20 వాహనాల ద్వారా వివిధ ప్రాంతాల్లో తాజా కూరగాయలను హోల్‌సేల్ రేట్లకే అందిస్తున్న అధికారులు... ఇకపై నగరంలోని అన్ని రైతుబజార్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, కాలనీలు, అపార్టుమెంట్లు, కూడళ్లలో  ఔట్‌లెట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర వర్గాల వారు విధులు ముగించుకొని సాయంత్రం ఇంటికి వెళ్లే తరుణంలో ఈ ఔట్‌లెట్స్‌లో కొనుగోలు చే స్తారని... దీంతో అన్ని రకాల కూరగాయలను అందుబాటులో ఉంచాలని యోచిస్తున్నారు. దీని వల్ల వారికి సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది కాబట్టి ఈ ఔట్‌లెట్లకు మంచి ఆదరణ ఉంటుందని అంచనా వేస్తున్నారు.   సచివాలయం, బీఆర్‌కె భవన్, ఏజీ ఆఫీస్, మణికొండ, నేరెడ్‌మెట్, డిఫెన్స్ కాలనీ, వనస్థలిపురం సహారా ఎస్టేట్స్, కూకట్‌పల్లిలోని భవ్యాస్ ఆనంద్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్, జనప్రియ అపార్టుమెంట్స్ తదితర ప్రాంతాల్లో మంగళవారం నుంచి వీటిని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
 
భారీగా సేకరణ
నగరంలో కూరగాయల కొరత లేకుండా చూసేందుకు పెద్ద మొత్తంలో సరుకు సేకరించాలని మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ అధికారులను ఆదేశించారు. టమోటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయల ధరలు పెరగకుండా నియంత్రించాలని సూచించారు. వర్షం లేదా మరే అనునుకూల పరిస్థితి ఎదురై ఒక్కరోజు కూరగాయల సరఫరా తగ్గినా.. రిటైల్ వ్యాపారులు యథేచ్ఛగా ధరలు పెంచి దోపిడీకి పాల్పడుతున్నారు. అందుకే ఎక్కువగా వినియోగించే టమోటా, మిర్చి, ఉల్లి ధరలు పెరగకుండా చూస్తే మిగతా కూరగాయల ధరలన్నీ అదుపులో ఉంటాయని అధికారుల యోచన.

ఇందులో భాగంగా మహారాష్ట్ర నుంచి ఉల్లి,  నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలు, మదనపల్లి నుంచి టమోటా, కర్నూలు, గుంటూరు ప్రాంతాల నుంచి పచ్చిమిర్చి పెద్దమొత్తంలో సేకరించేందుకు అధికారులు చర్యలకు ఉపక్రమించారు. నగరమంతటా ఔట్‌లెట్స్ ప్రారంభించి ప్రజలకు తాజా కూరగాయలు అందుబాటులో ఉంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డెరైక్టర్ వై.జె.పద్మహర్ష తెలిపారు. ప్రస్తుతం నగరంలో ఎన్ని ఔట్‌లెట్స్ పెట్టాలి..?  స్థానికంగా ఎంత మేర ఉత్పత్తి అవుతోంది? ఇతర ప్రాంతాల నుంచి ఏమేరకు సరుకు దిగుమతి చేసుకోవాలి..? వంటివాటిపై లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే గుర్తించిన కొన్ని ప్రాంతాల్లో వచ్చే మంగళవారం కొత్త ఔట్‌లెట్స్‌ను ప్రారంభిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement