
సాక్షి సిటీబ్యూరో: గతేడాది పోలిస్తే ఈసారి అక్టోబర్ రెండో వారం నుంచే కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. పోయినసారి ఆన్ సీజన్ (ఫిబ్రవరి నుంచి అక్టోబర్) నెలలో కూరగాయల ధరలు మండిపోయాయి. ఈ ఏడాది సెప్టెంబర్ చివరివారం నుంచే నగరానికి శివారు జిల్లాల నుంచి కూరగాయల దిగుమతులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో దాదాపు అన్ని కూరగాయల ధరలు రూ.40 లోపే ఉన్నాయి. రాబోయే రోజుల్లో ధరలు మరింతగా తగ్గుతాయని మార్కెట్ అధికారులు చెబుతున్నారు.
శివారు జిల్లాల నుంచే 80 శాతం
సాధరణంగా ఆన్ సీజన్‌లో నగర మార్కెట్‌కు ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి అవుతాయి. అన్ సీజన్‌లో నగర ప్రజల కూరగాయల అవసరాలు తీర్చిడానికి కమిషన్ ఏజెంట్లు ఇతర రాష్ట్రాలపై అధారపడాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్, వికారాబాద్‌ల నుంచి ఎక్కువ మోతాదులో నగరంలోని బోయిన్‌పల్లి, గుడిమల్కాపూర్, ఎల్‌బీనగర్‌తో పాటు ఇతర మార్కెట్‌కు రోజుకు 70 నుంచి 80 శాతం వివిధ రకాల కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రల నుంచే కూరగాయల దిమతులు ఉండేవి. ప్రస్తుతం నగర శివారుతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి కూడా కూరగాయల దిగుమతులు పెరగడంతో ధరలు తగ్గాయి.
నిలకడగా ధరలు
ఈ ఏడాది అక్టోబర్ ప్రారంభం నుంచే కూరగాయల ధరలు నిలకడగా ఉన్నాయి. ఇందుకు కారణం గ్రేటర్ శివారు ప్రాంతాల నుంచి నగర మార్కెట్‌కు రోజు దాదాపు అన్ని రకాల కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. గతంలో శివారు ప్రాంతాల నుంచి రోజూ కూరగాయల దిగుమతులు ఉండేవి కావు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి మార్కెట్లకు రాని కూరగాయలను కమిషన్ ఏజెంట్లు దిగుమతి చేసేవారు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యే కూరగాయల ధరలు ఎక్కువగా ఉండడంతో ధరలు నిలకడగా ఉండేవి కావని వ్యాపారులు చెబుతున్నారు.
రాబోయే రోజుల్లో మరింత తగ్గుతాయి
తెలంగాణ వ్యాప్తంగా నీటి లభ్యత ఎక్కువగా ఉండడంతో రైతులు ఎక్కువగా కూరగాయలు పండిస్తున్నారు. ప్రత్యేకంగా రంగారెడ్డి, వికారాబాద్, మెదక్ జిల్లాల రైతులు ఈ ఏడాది జూలై నుంచే కూరగాయలను సాగు చేస్తున్నారు. దీంతో సెప్టెంబర్ చివరి వారం నుంచే పంట చేతికొచ్చింది. ఈ కారణంగానే ఈ ఏడాది కూరగాయల ధరలుసెప్టెంబర్ నుంచి తగ్గడం ప్రారంభమయ్యాయి. –కె.శ్రీధర్, స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి,గుడిమల్కాపూర్ మార్కెట్
Comments
Please login to add a commentAdd a comment