
పోలీసులకు సవాల్ విసురుతున్న ‘ఉల్లంఘనులు’
శంషాబాద్ రూరల్ (రాజేంద్రనగర్): శంషాబాద్ పట్టణానికి చెందిన రమేష్ నిత్యం ద్విచక్రవాహనంపై తన అవసరాల నిమిత్తం స్థానికంగా తిరుగుతుంటాడు. ఇటీవల బెంగళూరు జాతీయ రహదారిని దాటే క్రమంలో అతడు హెల్మెట్ ధరించని కారణంగా పలుమార్లు ట్రాఫిక్ చలాన్లు చెల్లించాల్సి వచ్చింది. ఈ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి తన మదిలో ఓ ఆలోచన తట్టింది. వాహనానికి వెనక ఉన్న నంబర్ ప్లేటుపై ఒక అంకెను తొలగించాడు. ఇంకేముంది.. ఇప్పుడు తలపై హెల్మెట్ లేకున్నా దర్జాగా రోడ్లపై నిబంధనలు ఉల్లంఘిస్తూ తిరుగుతున్నాడు. ఇది ఒక రమేష్ విషయమే కాదు. శంషాబాద్ పట్టణంలో నిత్యం చాలామంది వాహనదారులు ఇదే తరహాలో ట్రాఫిక్ నిబంధనలపై నీళ్లు చల్లుతూ చలాన్ల నుంచి తప్పించుకుంటున్నారు.
ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి. నాలుగుచక్రాల వాహనదారులు సీటు బెల్టు ధరించాలి. డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్‌లో మాట్లాడకూడదు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ట్రాఫిక్ పోలీసులు గుర్తించి చలాన్లు విధిస్తుంటారు. శంషాబాద్ పట్టణంలో బెంగళూరు జాతీయ రహదారిపై రెండు చోట్ల ప్రధాన కూడళ్ల వద్ద వాహనాలను పోలీసులు నియంత్రిస్తుంటారు. దీంతోపాటు ఇక్కడ నిత్యం ట్రాఫిక్ పోలీసులు నిబంధనలను ఉల్లంఘించే వారిపై నిఘా వేస్తుంటారు. ఇందులోభాగంగా.. ట్రాఫిక్ సిబ్బంది చేతిలో ఉన్న కెమెరాతో ఉల్లంఘనుల వాహనాల ఫొటోలను తీసి వాటి ఆధారంగా చలాన్లు విధిస్తున్నారు. అయితే, చలాన్లను తప్పించుకునేందుకు, తమ వాహనాల వివరాలు తెలియకుండా.. అక్రమార్కులు నంబర్ ప్లేట్లపై అంకెలను తొలగించి లేదా తారుమారు చేసి యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఈనేపథ్యంలో దర్జాగా తప్పించుకుంటున్నారు. దీంతో ఉల్లంఘనదారులకు విధించే చలాన్లను వాహనదారుల చిరునామాలకు పంపించలేకపోతున్నారు.
వాహనదారుల పాట్లు
పట్టణంలోని పలు కాలనీలకు చెందిన వాహనదారులు వివిధ పనుల నిమిత్తం ప్రధాన వీధుల్లో వా హనాలపై తిరుగుతుంటారు.ముఖ్యంగా పట్టణం జాతీయ రహదారికి రెండు వైపులా ఉండడం.. ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్‌స్టేషన్, కూరగాయల మార్కెట్‌కు వెళ్లే వారు జాతీయ రహదారి దాటాల్సి ఉంటుంది. ఏ చిన్న పని ఉన్నా ద్విచక్రవాహనాన్ని వినియోగించక తప్పడం లేదు. కొద్దిదూరం కోసం హెల్మెట్ పెట్టుకోవడం ఎందుకని చాలామంది మామూలుగానే వాహనంపై వెళ్తున్నారు. జాతీయ రహదారిపై ప్రధాన కూడళ్ల వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఇలాంటి వారి ఫొటోలు తీసి చలాన్లు విధిస్తున్నారు. వీటితో విసిగిపోతున్న వాహనదారులు చలాన్ల నుంచి తప్పించుకోవడానికి కొత్తదారులు వెతుకుతున్నారు. నంబరు ప్లేట్లపై అంకె లేదా అక్షరం తొలగించడం.. పూర్తిగా నంబర్ కనిపించకుండా ప్లేట్లుపై స్టిక్కర్లు అతికించడం, నంబరు ప్లేటును మడతపెట్టడం తదితర పనులు చేస్తున్నారు.
నిందితులను గుర్తించడం కష్టమే..
ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి వాహనదారులు నంబరు ప్లేట్లపై మార్పులు చేస్తుండగా.. వీరి ముసుగులో నేరస్తులు తప్పించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏదైనా నేరం చేయడానికి వాహనాలపై వచ్చిన నిందితులు ఇలాగే నంబర్లు కనిపించకుండా జాగ్రత్త పడితే.. ఆయా కేసులను ఛేదించడం పోలీసులకు ఇక సవాల్‌గానే మారుతుంది. అయితే, వాహ నాల నంబర్ ప్లేట్లపై అంకెలు, అక్షరాలు తొలగించిన వాహనదారులు నిత్యం పోలీసుల ఎదుటే తిరుగుతున్నా వారు దృష్టిసారించడం లేదనే ఆరోపణలు వినిపిఉ్తన్నాయి. మరోవైపు శంషాబాద్ పట్టణంలో పార్కిగ్ సమస్య జఠిలంగా మారింది. నో పార్కింగ్ ఏరియాలో, ప్రధాన వీధుల వెంబడి నిలిపే వాహనాల ఫొటోలను సేకరించి పోలీసులు చలాన్లు విధిస్తుండగా.. నంబర్లు సరిగా లేని వాహ నదారులు యథేచ్ఛగా తప్పించుకుంటున్నారు.
వాహనాన్ని సీజ్ చేస్తాం
వాహనాలకు నంబరు ప్లే ట్లు నిబంధనల మేరకు ఉండాలి. నంబర్ ప్లేట్లపై అంకెలు, అక్షరాలు తొల గించిన వాహనదారులను గుర్తించి చర్యలు తీసుకుంటున్నాం. తనిఖీల్లో వాహనాలు పట్టుబడితే సీజ్ చేస్తాం. నిబంధనల మేరకు నడుచుకోకపోతే చర్యలు తప్పవు. – జి.నారాయణరెడ్డి,ట్రాఫిక్ సీఐ, శంషాబాద్
Comments
Please login to add a commentAdd a comment