మా లక్ష్యం అదే: కేటీఆర్
హైదరాబాద్: స్వచ్ఛ భారత్‌పై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ‘స్వచ్ఛ సర్వేక్షన్-వావ్ హైదరాబాద్' కార్యక్రమం ఏర్పాటు చేశారు. కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయలు ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర మంత్రులు కేటీఆర్, పద్మారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీ సీతారామ్‌నాయక్, ఎమ్మెల్యేలు గోపీనాథ్, తీగల కృష్ణారెడ్డి, లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, కిషన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కమిషనర్ జనార్దన్‌రెడ్డి, స్వచ్ఛ భారత్ అంబాసిడర్ పుల్లెల గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీ-ఐటీసీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి.
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని 'స్వచ్చ్‌గ్రహి' కావాలని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారత్‌ను పూర్తిగా మార్చాలని యత్నిస్తున్నారని వెంకయ్య నాయుడు తెలిపారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని రాజకీయ, ప్రభుత్వ కార్యక్రమం చేయొద్దని ప్రధాని సూచించారని ఆయన వెల్లడించారు. స్వచ్ఛ భారత్‌ను ప్రజా ఉద్యమంలా చేపట్టాలన్నారు.
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏ కార్యక్రమం విజయవంతం కాదని అన్నారు. దేశంలోని టాప్ నగరాల్లో హైదరాబాద్ ఉండాలన్నదే తమ లక్ష్యం అని కేటీఆర్ స్పష్టం చేశారు.