
నేలకొరిగిన అరుణ శిఖరం
చిట్యాల/నకిరేకల్ : ప్రజా సేవకుడు, కమ్యూనిస్టు కురవృద్ధుడు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే, నర్రా రాఘవరెడ్డి (91) కన్నుమూశారు. చిట్యాల మండలం వట్టిర్తికి చెందిన నర్రా రాఘవరెడ్డి గురువారం నార్కట్‌పల్లి కామినేని వైద్యశాలలో తుది శ్వాస విడిచారు. కొన్నేళ్లుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. స్వగ్రామమైన వట్టిమర్తిలోని తన ఇంటి వద్ద కాలం గడుపుతున్నారు 20 రోజుల క్రితం తన ఇంట్లో బాతురూంలో జారి పడడంలో కాలుకు దెబ్బతాకడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను 20 రోజుల క్రితం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం 10రోజుల క్రితమే స్వగ్రామమైన వట్టిమర్తికి తీసుకువచ్చారు. గురువారం ఉదయం 10:30గంటల సమయంలో తిరిగి నర్రా రాఘవరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో నార్కట్‌పల్లిలోని కామినేని వైద్యశాలకు తరలించారు. ఐసీయూలో ఉంచి వైద్యులు నర్రా రాఘవరెడ్డికి చికిత్సను అందించారు. షుగర్ లెవల్ ఎక్కువ కావడం, ఊపిరితిత్తులు పనిచేయకపోవడంతో శ్వాస తీసుకోలేక సాయంత్రం 6 :15 గంటల సమయంలో ప్రాణాలు వదిలారు.
జిల్లా కార్యాలయానికి తరలింపు..
నల్లగొండ టౌన్ : రాఘవరెడ్డి భౌతికకాయాన్ని గురువారం రాత్రి 8 గంటలకు సీపీఎం పార్టీ జిల్లా కార్యాలయానికి తీసుకువచ్చి ప్రజల సందర్శనార్థం ఉంచారు. రాఘవరెడ్డి కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సుంకరి మల్లేష్‌గౌడ్, పుల్లెంల వెంకటనారాయణగౌడ్, డాక్టర్ చెరకు సుధాకర్, రాఘవరెడ్డి సహచరుడు దశరథకుమార్, పార్టీ జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహారెడ్డి, అనంతరామశర్మ, మల్లు నాగార్జున్‌రెడ్డి, గోపి, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, పాలడుగు ప్రభావతి, మల్లు లక్ష్మీ, పాలడుగు నాగార్జున, తిప్పర్తి ఎంపీపీ పాశం రాంరెడ్డి, రవినాయక్, ఎండీ సలీం, అవుట రవీందర్, సయ్యద్ హాషం, టి.నర్సిరెడ్డి తదితరులు పుష్పగుచ్చాలను నివాళులర్పించారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ నీతికి, నిజాయితీకి మారు పేరుగా నిలిచిన మహానీయుడని కొనియాడారు. డాక్టర్ చెరకు సుధాకర్ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎమ్మెల్యేగా ఆరుసార్లు పనిచేశారని చెప్పారు. సుంకరి మల్లేష్‌గౌడ్ మాట్లాడుతూ రాఘవరెడ్డి ప్రజా సమస్యలపై నిరంతరం ఉద్యమించిన నాయకుడని కొనియాడారు. రాఘవరెడ్డి సహచరుడు దశరథకుమార్ మాట్లాడుతూ రాఘవరెడ్డి ఎన్నికల ప్రచారంలో ఆయన పిట్టలదొర, గొల్ల సుద్దులు చెప్పేవారని, తాను పాటలు పాడేవాడినని గుర్తు చేసుకున్నారు.
నేడు మధ్యాహ్నం వట్టిమర్తిలో అంత్యక్రియలు...
నర్రా రాఘవరెడ్డి అంత్యక్రియలను శుక్రవారం మధ్యాహ్నం చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహారెడ్డి తెలిపారు. గురువారం రాత్రి పార్టీలో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాఘవరెడ్డి వృతి పట్ల జిల్లా పార్టీ తీవ్ర ప్రగాఢ సంతాపాన్ని తెలిపిందన్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల వరకు పార్థీవ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచి అనంతరం నకిరేకల్ కేంద్రానికి తరలిస్తామన్నారు. అక్కడి నుంచి వట్టిమర్తి గ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలి పారు. అంత్యక్రియలకు తమ్మినేని వీరభద్రం, రాఘవులుతోపాటు ఇతర రాష్ట్ర నాయకులు హాజరవుతారన్నారు. ఈ నెల 12వ తేదీ వరకు సంతాప దినాలను పాటించి గ్రామ గ్రామాన సంతాప సభలు నిర్వహిస్తామని తెలిపారు.