
'బీసీ కులాలను తొలగించటం అన్యాయం'
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం 26 బీసీ కులాలను తొలగించటం అన్యాయమని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు (వీహెచ్) మండిపడ్డారు. గురువారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. కొన్ని బీసీ కులాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయంటూ తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విభేదాల వల్ల రెండు రాష్ట్రాల మధ్య కొన్ని బీసీ కులాలు నలిగిపోతున్నాయని వీహెచ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నిబంధనల ప్రకారమే కేసీఆర్ సర్కార్ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ను అమలు చేయాలని వీహెచ్ అన్నారు.