పేరుకే 'ఫాస్ట్'... స్లోగా నడుస్తోంది
హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన ఫాస్ట్ పథకం స్లోగా నడుస్తోందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఎద్దేవా చేశారు. 'ఫాస్ట్' పథకాన్ని సూపర్ ఫాస్ట్గా నడపాలని ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద చిన్నారెడ్డి మాట్లాడుతూ...దాదాపు 15 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి సంబంధించిన ప్రశ్నపై సభలో మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 40 వేల మంది విద్యార్థులు, అదే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు చెందిన 18 వేల మంది విద్యార్థులు వివిధ కోర్సులు చేస్తున్నారు. పేద విద్యార్థులు పెద్ద చదువులు చదవాలనే సదాశయంతో మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్నీ తీసుకు వచ్చారని చిన్నారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. 1956 ప్రామాణికంగా తీసుకుంటే రూ.15 లక్షలపైగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని తెలిపారు.
విద్యా సంవత్సరం మొదలై 6 నెలలు గడుస్తున్నా ఫీజుల చెల్లింపులపై ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటి వరకు స్పందన లేదని అన్నారు. ఇంకా 4 నెలలే మిగిలి ఉండటంతో ఫీజులు వస్తాయో లేదో అని యాజమాన్యాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయని.... ఈ నేపథ్యంలో యాజమాన్యం విద్యార్థులను కాలేజీలకు రానివ్వడం లేదన్నారు.