వెంకయ్య @ 84 .. కేసీఆర్‌@ 52 | Vice President venkaiah naidu visits medaram jatara | Sakshi
Sakshi News home page

మొక్కుల మేడారం

Published Sat, Feb 3 2018 2:26 AM | Last Updated on Sat, Feb 3 2018 2:27 AM

Vice President venkaiah naidu visits medaram jatara - Sakshi

సమ్మక్క గద్దె మొక్కుతున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: గిరిజన జాతర మేడారం జన సంద్రంగా మారింది. లక్షలాది మంది భక్తులు వన దేవతలను దర్శించుకునేందుకు బారులు తీరారు. సమ్మక్క తల్లి గురువారం రాత్రి గద్దెలకు చేరడంతో.. సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్ద రాజులు అంతా గద్దెలపై ఉండడంతో భక్తులు పోటె త్తారు. దీంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ఇక శుక్రవారం భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, సీఎం కేసీఆర్‌ సమ్మక్క–సారలమ్మను దర్శించుకున్నారు.

తొలుత ఉప రాష్ట్రపతి.. తర్వాత సీఎం
ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు శుక్రవారం ఉదయం ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారానికి వచ్చా రు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం పూజారులు వాయిద్యాల మధ్య స్వాగతం పలకగా గద్దెల వద్దకు చేరుకుని వన దేవతలను దర్శించుకున్నారు. తర్వాత కొంతసేపు విశ్రాంతి తీసుకుని.. జాతరను పరి శీలించి తిరుగుప్రయాణమయ్యారు. మధ్యాహ్నం మరో హెలికాప్టర్‌లో సీఎం కేసీఆర్, భార్య çశోభా రాణి, కుమార్తె, ఎంపీ కవిత, మనవడు హిమాన్షుతో కలసి మేడారానికి వచ్చారు. బంగారం (బెల్లం) మొక్కు చెల్లించి, కొబ్బరికాయ కొట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడి తిరుగు ప్రయాణమయ్యారు.

పోటెత్తిన భక్తులు
సమ్మక్క తల్లి గద్దెలపైకి చేరినప్పటి నుంచి విరామం లేకుండా దర్శనం కొనసాగుతోంది. భక్తులతో రెండు క్యూలైన్లు పూర్తిగా నిండిపోయి రోడ్డు మీదకు చేరుకున్నాయి. దాంతో జాతరలో ఒకవైపు ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఆర్టీసీ బస్‌స్టేషన్, జంపన్న వాగు, గద్దెల పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ఉప రాష్ట్రపతి, ముఖ్యమంత్రి సహా ప్రముఖులు రావడంతో.. పలుమార్లు దర్శనం క్యూలైన్లను నిలిపేశారు. దీనికితోడు క్యూలైన్లపై పందిళ్లు తక్కువ ఎత్తులో ఏర్పాటు చేయడం, తాగునీరు అందుబాటులో లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. కొందరు అస్వస్థతకు గురికావడం, స్పృహ తప్పి పడిపోవడంతో వైద్య శిబిరాలకు తరలించి చికిత్స అందించారు.

పర్యవేక్షణ లోపంతో ఇబ్బంది
జాతర విధులు నిర్వహిస్తున్న పోలీసులు, అధికారుల మధ్య సమన్వయలోపం, తగిన పర్యవేక్షణ లోపించడంతో భక్తులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పలు కూడళ్ల వద్ద ఎదురెదురుగా వచ్చే భక్తులతో కిక్కిరిసి స్తంభించిపోయింది. అస్వస్థతకు లోనైనవారిని తరలించేందుకు వచ్చిన 108 వాహనాలకు పోలీసులు దారి చూపించలేకపోయారు.

నేడు సమ్మక్క వన ప్రవేశం
జాతర చివరి రోజైన శనివారం సమ్మక్క తల్లి వన ప్రవేశం చేయనుంది. సమ్మక్క పూజారులు, వడ్డెలు గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి సమ్మక్కను చిలకలగుట్టకు తీసుకెళ్తారు. ఇదే సమయంలో సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు తీసుకువెళతారు. దీనితో నాలుగు రోజుల మేడారం మహా జాతర లాంఛనంగా ముగుస్తుంది.

వెంకయ్య @ 84 .. కేసీఆర్‌@ 52
మేడారంలో వన దేవతలను దర్శించు కున్న అనంతరం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌.. బంగారం (బెల్లం) తులాభారం మొక్కులు చెల్లించు కున్నారు. వెంకయ్యనాయుడు 84 కిలోల బరువు, కేసీఆర్‌ 52 కిలోల బరువు తూగగా.. వారి బరువు మేరకు బంగారం (బెల్లం) సమర్పించుకున్నారు.

  - సమ్మక్కకు నమస్కరిస్తున్న ఎంపీ కల్వకుంట్ల కవిత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement