
సాక్షి, హైదరాబాద్: మేడారం సమ్మక్క-సారాలమ్మ జాతర ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో శనివారం జరిగిన ఈ సమీక్షలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, చందూలాల్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతర నిర్వహణ, సౌకర్యాలు, భక్తులకు కల్పిస్తున్న వసతులు తదితర అంశాలపై చర్చ జరిగింది. జాతరకు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు కోటి మందికిపైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కడియం సూచించారు. పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు శ్రద్ధ వహించాలన్నారు. ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో జాతరను పర్యవేక్షించాలని పేర్కొన్నారు.
కాగా వచ్చే ఏడాది జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు మేడారం జాతర జరుగునుంది. 31 వ తేదీ తొలిరోజు సారలమ్మను మేడారం గద్దెల వద్దకు తీసుకు వస్తారు. ఫిబ్రవరి 1 న రెండో రోజు సమ్మక్క దేవతను చిలుకలగుట్ట నుంచి గద్దెలపైకి తీసుకువస్తారు. ఫిబ్రవరి 2న భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. 3న(శనివారం) అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment