గోదావరిఖని : నగరం నడిబొడ్డున పోచమ్మ మైదానంలో వివాదాస్పదంగా మారిన స్థలంపై సోమవారం విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. జిల్లా విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ వెంకటరెడ్డి ఆదేశాల మేరకు విచారణ జరుపుతున్నట్లు విజిలెన్స్ సీఐ ఎస్.సుధాకర్‌రావు, కానిస్టేబుల్ రాజన్న తెలిపారు. వివాదాస్పదంగా మారిన స్థలం సింగరేణి సంస్థదా, ప్రభుత్వానిదా అనే దానిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన టౌన్‌ప్లానింగ్ అధికారులను వివాదాస్పద స్థలం గురించి ఆరా తీశారు. స్థలం వద్దకు వెళ్లి హద్దుల విషయంపై ప్రశ్నించారు. మొత్తం 39 గుంటల స్థలంలో 11 గుంటలు రోడ్డు కోసం కేటాయించగా, మిగతా 28 గుంటలు పట్టాదారులకు కేటాయించినట్లు టౌన్‌ప్లానింగ్ అధికారులు వివరించారు. అయితే నగరం నడిబొడ్డున ఉన్న ఈ స్థలంపై అభ్యంతరాలు ఏమైనా వచ్చాయా..? వివాదాస్పదంగా మారిన స్థలం 39 గుంటలేనా..? ఇంకా ఎక్కువగా ఉందా..? అని ఆరా తీశారు. కాంగ్రెస్ నాయకుడు గుమ్మడి కుమారస్వామి ఈ వివాదంపై విజిలెన్స్ అధికారులకు వివరాలు వెల్లడించారు.
కార్పొరేషన్ అధికారుల బంధువుల పేరుపై ఈ స్థలంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, వాటి ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని తెలిపారు. దీంతో పూర్తి వివరాలను వారు నమోదు చేసుకున్నారు. స్థానికులు జోక్యం చేసుకొని అసలు ఈ స్థలం సింగరేణిదని, 40 ఏళ్ల క్రితం నుంచి ఇక్కడ కూరగాయలు అమ్మేవారని, చిన్న చిన్న వ్యాపార సంస్థలు ఉండేవని తెలిపారు. అధికారులు సమగ్రంగా దర్యాప్తు జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని కోరారు.
వివాదాస్పదంగా మారిన స్థలంలో నిర్మించిన ప్రహరీని అధికారులు ఫొటోలు తీసుకున్నారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయంలో సదరు స్థలానికి సంబంధించిన ఫైళ్లను తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న పత్రాలను పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. నిర్మాణాల కోసం అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసిన అధికారుల పేర్లు, వారి హోదాలను సేకరించారు. దీంతో ఈ వివాదం ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని కార్పొరేషన్ అధికారులు వణుకుతున్నారు.
‘ఖని’లో భూ వివాదంపై విజిలెన్స్ విచారణ
Published Tue, Dec 2 2014 3:23 AM | Last Updated on Sat, Sep 2 2017 5:28 PM
Advertisement
Advertisement