
హయత్‌నగర్‌లో మాట్లాడుతున్న విజయశాంతి. చిత్రంలో దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
హయత్‌నగర్: గారడీ మాటలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ప్రజా సమస్యలను గాలికొదిలేసి ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ధ్వజమెత్తారు. మరోసారి ఆయన అధికారం కోసం బూటకపు మాటలు చెబుతున్నారని, ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేని కేసీఆర్‌కు ప్రజలను ఓట్లడిగేందుకు సిగ్గుండాలని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్‌నగర్, వనస్థలిపురం, హస్తినాపురం, లింగోజిగూడ తదితర ప్రాంతాల్లో స్థానిక కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డితో కలసి ఆమె రోడ్ షోలో పాల్గొన్నారు.
బంజారాకాలనీలో ప్రజలనుద్దేశించి ఆమె మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో కొట్లాడితే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. కేసీఆర్‌పై నమ్మకంతో అధికారం అప్పగిస్తే ప్రజలకిచ్చిన వాగ్దానాలను పక్కబెట్టి తన కుటుంబ సభ్యులకు పదవులు కట్టబెట్టుకున్నారన్నారు. గత గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు జీహెచ్‌ఎంసీనీ అప్పగిస్తే నగరాన్ని మద్యంలో ముంచి యువకులకు, విద్యార్థులను మత్తుకు బానిసలను చేశారన్నారు. నల్లదనాన్ని బయటికి తెస్తానని చెప్పిన మోదీ నిర్ణయాల వల్ల నల్లదనం మరింత పేరుకుపోయే పరిస్థితి వచ్చిందని ఆమె విమర్శించారు.
కథలు చెప్పేందుకు మళ్లొస్తున్నాడు
కేసీఆర్ మరోసారి ప్రజలను మోసం చేసేందుకు పిట్టల కథలు చెప్పేందుకు వస్తున్నారని, ఆయన్ను నమ్మవద్దని విజయశాంతి కోరారు. మార్పు కోసం ఈసారి టీఆర్‌ఎస్‌ను ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు, పించన్లు, డ్వాక్రా మహిళలకు మేలు జరిగే అనేక సంక్షేమ పథకాలు అమల్లోకి వస్తాయన్నారు. కార్యక్రమంలో మహాకూటమి నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment