
సాక్షి, పెద్దపల్లి : కరోనా వైరస్ భయం పెద్దపల్లి జిల్లాలో మహా విషాదాన్ని నింపింది. ధర్మారం మండలం నందిమేడారంలో కొసరి రాజవ్వ (55 ) అనారోగ్యంతో మృతి చెందారు. అయితే ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఎవరూ రాలేదు. దీంతో కడసారి చూపుకు నోచుకోక అనాథ శవంలా మారింది. సంతానం లేని రాజవ్వ భర్త అంజయ్య 2 నెలల క్రితం చనిపోయారు. అప్పటి నుంచి మానసిక ఆందోళనలో ఉన్న రాజవ్వ నిన్న ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని గ్రామస్తులు ఆమె బంధువులకు సమాచారం ఇచ్చారు. అయితే కరోనా భయంతో ఎవరు రాజవ్వ మృతదేహాన్ని చూడటానికి రాలేకపోయారు. 24 గంటలు గడిచిన ఎవరు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో చివరకు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది రాజవ్వ శవాన్ని ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి చెత్తను తరలించే రిక్షాలో అంతిమయాత్రకు తరలించి దహన సంస్కారాలు నిర్వహించారు. కరోనా ప్రభావంతో రాజవ్వ శవం అనాథగా తరలిపోవడం చూసి గ్రామస్థులు కంటతడి పెట్టారు. ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment