orphan dead bodies
-
బంధాలన్నీ దూరమాయే.. ఆఖరి మజిలీలో అనాథలా..
కాకినాడ క్రైం: నవమాసాలూ మోసి, కని పెంచిన కొడుకులున్నారు.. అయినవారందరూ ఉన్నారు.. అయినా ఆఖరి మజిలీలో ఆ తల్లిని పట్టించుకోలేదు. కడసారి చూపు కూడా వద్దనుకున్నారు.. దీంతో అన్నీ తానే అయి ఓ ట్రాన్స్‌జెండర్ ఆ పిచ్చితల్లికి అంతిమ సంస్కారం చేసింది. వివరాలివీ.. కాకినాడ పర్లోవపేటలోని రాజీవ్ గృహకల్ప ఫ్లాట్ నంబర్–8లో యల్ల ప్రభావతి (50) నివాసం ఉంటోంది. ఆమెకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కొన్నేళ్ల క్రితం కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడు. చిన్న కుమారుడు దుర్గాప్రసాద్ దంపతులకు ఏడేళ్ల కుమారుడు లక్కీ ఉన్నాడు. భర్త బాధ్యతా రాహిత్యాన్ని భరించలేక దుర్గాప్రసాద్ భార్య లక్ష్మి మరొకరితో వెళ్లిపోయింది. అప్పటి నుంచీ మనవడు లక్కీ, కొడుకు దుర్గాప్రసాద్‌తో కలిసి ప్రభావతి జీవిస్తోంది. ఈ నేపథ్యంలో పది రోజుల క్రితం దుర్గాప్రసాద్ కూడా వారిని వదిలిపెట్టి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. మనవడు లక్కీ అంటే ప్రభావతికి ప్రాణం. మనవడికి ఏ లోటూ రానిచ్చేది కాదు. తాను తిన్నా తినకపోయినా తనకు వచ్చే వైఎస్సార్ వితంతు పెన్షన్‌తో ఉన్నంతలోనే ఆ పసివాడిని కంటికి రెప్పలా చూసుకునేది. ఇది చూసి చుట్టుపక్కల వారు అబ్బురపడేవారు. ఇదిలా ఉండగా, గత నెల 30వ తేదీన కోడలు లక్ష్మి ఉన్నట్టుండి వచ్చింది. ఇంట్లోని పలు సామగ్రిని తనవంటూ తీసుకువెళ్లిపోబోయింది. అయితే తమ వద్ద చేసిన అప్పు తీర్చి సామాన్లు తీసుకెళ్లమంటూ ఆమెను చుట్టుపక్కల వారు నిలువరించారు. దీంతో తీవ్ర ఆగ్రహంతో అత్త ప్రభావతితో లక్ష్మి గొడవ పడింది. కావాలనే అప్పుల వాళ్లను పిలిచావంటూ మండిపడింది. తగిన శాస్తి చేస్తానని బెదిరింది. తను కన్న కొడుకు లక్కీని తనకు ఇచ్చేయమంటూ పట్టుబట్టింది. బలవంతంగా తీసుకెళ్లిపోతుంటే ప్రభావతి ఏడుస్తూ కాళ్లావేళ్లా పడింది. చుట్టుపక్కల వారు అడ్డుకునే ప్రయత్నం చేసినా, తన కొడుకునే తీసుకువెళ్తున్నానంటూ లక్కీని తీసుకుని లక్ష్మి వెళ్లిపోయింది. మనవడిపై బెంగతో ఏడుస్తున్న ప్రభావతిని ఇరుగు పొరుగు వారు రాత్రి ఓదార్చి పడుకోమని చెప్పి వెళ్లారు. ఉదయం చూసేసరికి ప్రభావతి ఇంట్లో విగతజీవిగా కనిపించింది. పక్కనే ఉన్న గ్లాసులో మామిడి కాయలు మగ్గించే కాల్షియం కార్బయిడ్ ద్రావణాన్ని గుర్తించారు. ఆమె మృతి విషయం ఆ ప్రాంతంలో అందరికీ తెలిసినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. సమాచారం ఇచ్చినా సమీపంలోని బంధువులూ రాలేదు. అదే ఫ్లాట్ సమీపంలో ట్రాన్స్‌జెండర్ కావ్య నివాసం ఉంటోంది. ప్రభావతి దుస్థితి గమనించి చలించిపోయింది. జరిగిందంతా హైదరాబాద్‌లో ఉంటున్న సర్వీస్ హార్ట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు ఆనంద్‌కు ఫోన్లో వివరించి, సహాయం కోసం అర్థించింది. ఆయన సూచనల మేరకు ప్రభావతి మృతదేహాన్ని కాకినాడ పోర్టు పోలీస్ స్టేషన్‌కు అంబులెన్సులో తీసుకెళ్లింది. ప్రభావతి మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జీజీహెచ్‌కు తరలించాలని సూచించారు. వారి సూచనల మేరకు ప్రభావతి మృతదేహాన్ని కావ్య జీజీహెచ్ మార్చురీకి తరలించింది. తల్లి మరణంపై కుమారుడికి పోలీసులు సమాచారం ఇచ్చినా రాలేనని చెప్పాడు. సమీప బంధువులు, రక్త సంబంధీకుల రాక కోసం ఎదురు చూశారు. ఏ ఒక్కరూ రాకపోవడంతో ఫోరెన్సిక్ వైద్యులు ప్రభావతి మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించారు. ఆమె మృతదేహాన్ని అంబులెన్స్ డ్రైవర్ సాయంతో కాకినాడ బస్టాండు వద్ద ఉన్న శ్మశాన వాటికకు కావ్య తరలించింది. ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి అంబేద్కర్ సాయంతో ప్రభావతి మృతదేహాన్ని ఖననం చేసింది. -
కరోనా.. కడచూపుకు రాని బంధువులు
సాక్షి, పెద్దపల్లి : కరోనా వైరస్ భయం పెద్దపల్లి జిల్లాలో మహా విషాదాన్ని నింపింది. ధర్మారం మండలం నందిమేడారంలో కొసరి రాజవ్వ (55 ) అనారోగ్యంతో మృతి చెందారు. అయితే ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఎవరూ రాలేదు. దీంతో కడసారి చూపుకు నోచుకోక అనాథ శవంలా మారింది. సంతానం లేని రాజవ్వ భర్త అంజయ్య 2 నెలల క్రితం చనిపోయారు. అప్పటి నుంచి మానసిక ఆందోళనలో ఉన్న రాజవ్వ నిన్న ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని గ్రామస్తులు ఆమె బంధువులకు సమాచారం ఇచ్చారు. అయితే కరోనా భయంతో ఎవరు రాజవ్వ మృతదేహాన్ని చూడటానికి రాలేకపోయారు. 24 గంటలు గడిచిన ఎవరు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో చివరకు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది రాజవ్వ శవాన్ని ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి చెత్తను తరలించే రిక్షాలో అంతిమయాత్రకు తరలించి దహన సంస్కారాలు నిర్వహించారు. కరోనా ప్రభావంతో రాజవ్వ శవం అనాథగా తరలిపోవడం చూసి గ్రామస్థులు కంటతడి పెట్టారు. ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దని అభిప్రాయపడ్డారు. -
అందరూ ఉన్నా..అనాథలే!
చీరాల అర్బన్: వారి ఊరు తెలియదు..పేరు తెలియదు..ఎక్కడో రాష్ట్రం కాని రాష్ట్రం..బతుకు పోరులో పయనమైన వారు కొందరైతే..చిన్నా చితక ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగించే వారు మరికొందరు. కిక్కిరిసిన రైళ్లలో వేళాడుతూ ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా మరణించిన వారి చిరునామా తెలియదు. కొద్ది రోజుల తర్వాత అందరూ ఉన్నా అనాథ శవంలా కాలిపోతున్నారు. ఇటువంటి సంఘటనలు నిత్యకృత్యం. జీవితాన్ని కొందరు అందంగా తీర్చిదిద్దుకుంటారు. తల్లిదండ్రులు, భార్య, పిల్లలతో కలిసి కుటుంబాన్ని ఏర్పరుచుకుంటాం. బంధాలు, అనుబంధాలను పెంచుకుని వాటిని చిన్న చిన్న పొరపాట్ల కారణంగా నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా రైలులో ప్రయాణించే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోక పోవడం, కిక్కిరిసిన రైళ్లలో వేళాడుతూ ప్రయాణాలు చేసే వారు ఎక్కువ మంది మరణిస్తున్నారు. విజయవాడ–చెన్నై రైలు మార్గంలో నిత్యం ఎన్నో రైళ్ల రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రధాన రైలు మార్గంలో ఇతర రాష్ట్రాలను కలుపుతూ రైలు మార్గం ఉంది. ఈ మార్గంలో సూపర్‌ఫాస్ట్ రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు వెళ్తుంటాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు జనరల్ బోగీల్లో ఫుట్‌పాత్‌పై కూర్చొని ప్రయాణిస్తూంటారు. ఈ నేపథ్యంలో కొందరు అలా ప్రయాణిస్తూ రైలు నుంచి జారి పడి మృత్యువాత పడుతున్నారు. ఇలా మృతి చెందిన వారి వివరాలు లభించవు. ఎటువంటి ఆధారాలు లభించక పోవడంతో గుర్తుతెలియని మృతదేహాలుగా కేసులు నమోదవుతున్నాయి. చీరాల ప్రభుత్వ రైల్వే పోలీసుస్టేషన్ పరిధి స్టువార్టుపురం నుంచి ఉప్పుగుండూరు రైల్వేస్టేషన్ వరకు ఉంది. ఈ పరిసర ప్రాంతాల్లో రైలు నుంచి జారిపడి మృతి చెందిన వారు చాలా మంది ఉన్నారు. 2019 మార్చి నుంచి 2020 మార్చి వరకు చీరాల జీఆర్పీ పరిధిలో మొత్తం 24 మంది రైలు నుంచి జారిపడి మృతి చెందగా వీరి వివరాలు లభించక పోవడంతో గుర్తుతెలియని మృతదేహాలుగా కేసులు నమోదు చేశారు. ప్రయాణికులు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం లేదు. దూర ప్రాంతాలకు రైలులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందుతున్నారు. ఇటీవల అస్సోం, జార్ఖండ్, డెహ్రడూన్ వంటి ప్రాంతాలకు చెందిన వారు జారిపడి మృతి చెందారు. ఇలా మరణించిన వారిలో కొందరి వద్ద దొరికిన చిన్న చిన్న ఆధారాలతో మృతదేహాలను వారి ఇళ్లకు చేర్చేందకు జీఆర్పీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. శరీరం బాగానే ఉంటే వారి ఫొటోలను పరిసర ప్రాంతాల పోలీసుస్టేషన్లకు పంపుతుంటారు. కొన్ని మృతదేహాలు ఛిద్రమై గుర్తుపట్ట లేనంతగా మారతాయి. ఆత్మహత్యలు చేసుకొనే వారు, పట్టాలు దాటుతూ రైలు ఢీకొని మృతి చెందిన వారి మృతదేహాలు కూడా ఒక్కోసారి ఛిద్రమై పోవడంతో వారు స్థానికులైనా గుర్తుపట్టడం ఇబ్బందిగా ఉంటుంది. దీంతో అనాథ శవాలుగా మిగిలిపోతున్నారు. రైలు ప్రమాదాల్లో మృతి చెందిన వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలిస్తుంటారు. రైలు ప్రమాదాల్లో మరణించిన వారి శరీరం రెండు, మూడు రోజులకే కుళ్లిపోతుంది. పోస్టుమార్టం చేసినా వాటిని భద్రపరిచేందుకు చీరాల ఏరియా వైద్యశాలలో ఫ్రీజర్ బాక్సులు లేకపోవడంతో వాటిని మార్చురీలోనే ఉంచుతున్నారు. మూడు రోజులు దాటినా వారి తరఫున ఎవరూ రాకపోవడంతో జీఆర్పీ పోలీసులే వాటిని ఖననం చేయిస్తున్నారు. అందరూ ఉన్నా అనాథ శవాలుగా భూమిలో కలిసిపోతున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోక పోవడంతో ఇటువంటి ప్రమాదాలు జరుగుతుంటాయని జీఆర్పీ పోలీసులు చెబుతున్నారు. ఆత్మహత్య సరైన నిర్ణయం కాదు కష్టాలను అధిగమించలేక, సమస్యలకు పరిష్కార మార్గం దొరకలేదనో ఎక్కువ మంది రైలు కిందపడి మరణిస్తున్నారు. ఈ తరహా ఆత్మహత్యలు అధికంగానే జరిగాయి. ఇక విద్యార్థుల విషయానికొస్తే చిన్న విషయానికి కూడా ఆత్మహత్యలకు పాల్పడటంతో కన్న వారికి కడుపుకోత మిగులుతోంది. ప్రేమ విఫలమైందనో, ప్రేమ పెళ్లికి కన్న వారు అంగీకరించ లేదనో రైలు కిందపడి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. చీరాల రైల్వేస్టేషన్‌లోని ప్రభుత్వ రైల్వే పోలీసుస్టేషన్లో 2019లో మొత్తం రైలు ఢీకొని, జారిపడి మృతి చెందిన వారు చాలా మందే ఉన్నారు. వీరిలో ఎక్కవ మందిని గుర్తించగా మరికొందరు వివరాలు ఇప్పటికీ తెలియదు. జేబులో దొరికే ఆధార్ కార్డు సాయంతో కొందరి చిరునామా దొరికింది. మరికొందరు శరీరాలు ఛిద్రమై పోవడంతో వారి ముఖం కూడా కనిపించక అనాథ శవాలుగా మిగిలిపోయారు. -
అనాథ శవాల రేటు పెంచేద్దాం..!
లబ్బీపేట (విజయవాడ తూర్పు) : నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయడంలో విఫలమైన ప్రభుత్వం, చివరికి అనాథ శవాల రేటు పెంచి ఆ వచ్చిన సొమ్ముతో రోగులకు వైద్యం చేయాలని చూడటం విస్మయానికి గురి చేస్తోంది. అంతేకాదు ప్రభుత్వాస్పత్రిలో శిక్షణ కోసం వచ్చే విద్యార్థుల ఫీజులను సైతం రెట్టింపు చేయాలని నిర్ణయం తీసుకోవడంపై పలువురు సీనియర్ ప్రొఫెసర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేసి పనులు చేయాలే కాని, ఇక్కడే ఆదాయ వనరులను వెతకడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. శవాల రేటు పెంచేద్దాం.. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన అనాథ శవాలను ప్రవేటు వైద్య కళాశాలల వారు వైద్య విద్యార్థుల పరీక్షల కోసం తీసుకెళ్తుంటారు. అందుకు గాను ప్రభుత్వాస్పత్రి అభివృద్ధి నిధులకు రూ.15 వేలు చెల్లిస్తుంటారు. ప్రస్తుతం ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం, ఖర్చులకు సైతం డబ్బులు లేకపోవడంతో ఇకపై ఒక్కో అనా«థ శవాన్ని రూ.25 వేలకు అమ్మాలని గురువారం జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. శవాలను అమ్మి ఆ వచ్చిన సొమ్ముతో పేదలకు వైద్యం చేయాల్సిన దుస్థితి తలెత్తడంపై మండిపడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా నిధులు పెంచేందుకు, ఆస్పత్రిలోనే ఆదాయ వనరులు చూడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పిల్లల ఫీజులూ పెంచుదాం.. ప్రయివేట్ ఇనిస్టిట్యూషన్స్‌లో శిక్షణ పొందుతున్న నర్శింగ్, ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ విద్యార్థులు శిక్షణ కోసం ప్రభుత్వాస్పత్రికి వస్తుంటారు. అలా వచ్చిన వారు ఒక్కొక్కరూ రూ.వెయ్యి చెల్లిస్తుంటారు. ప్రస్తుతం ఆ మొత్తాన్ని రూ.2 వేలు చేయాలని కమిటీ నిర్ణయించింది. అంతేకాదు ప్రయివేట్ ఆస్పత్రులకు çప్రభుత్వ గుర్తింపు కోసం గవర్నమెంట్ డాక్టర్లు ఇన్స్పెక్షన్ చేయాల్సి ఉంది. అందుకు గాను హెచ్డీఎస్కు రూ.30 వేలు చెల్లిస్తారు. ప్రభుత్వాస్పత్రి ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా దాన్ని రూ.50 వేలు చేయాలని కలెక్టర్ ఆదేశించడం విశేషం. అంతేకాదు షాపింగ్ కాంప్లెక్స్ కట్టి, షాపులు అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం పెంచుకోవడంతోపాటు, ప్రయివేట్ మెడికల్ షాపుల ఏర్పాటుకు అనుమతి ఇచ్చే విధంగా హెచ్‌డీఎస్‌లో చర్చించడం గమనార్హం. ఆస్పత్రి పయనమెటో.. పేదలకు వైద్యం చేసే ప్రభుత్వాస్పత్రిని సైతం వ్యాపారమయంగా చేసేలా నిర్ణయాలు తీసుకోవడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. అనాథ శవాల రేట్లు పెంచేయడం, ప్రయివేట్ వ్యక్తులతో మందుల వ్యాపారం, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం వంటి నిర్ణయాలు సరి కాదని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వమే హెచ్డీఎస్కు నిధులు సమకూర్చాలని పలువురు వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈఈపై ఆగ్రహం.. వైద్య, ఆరోగ్య శాఖ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ప్రవీణ్రాజ్పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీవు సరైన సమయంలో పనులు పూర్తి చేయడం లేదు..’ అని కలెక్టర్ అంటే, అనుకున్న సమయానికి పూర్తి చేస్తున్నామని ఈఈ బదులిచ్చారు. దీంతో చిర్రెత్తిన కలెక్టర్ నువ్వు ఇక్కడ పనికి రావని పేర్కొనడంతో, తాను కూడా బదిలీకి ప్రయత్నిస్తున్నానని ఈఈ సమాధానం చెప్పడం విశేషం. -
ఆసుప్రతిలో ఆత్మల ఘోష!
ప్రభుత్వాసుపత్రులలో అవినీతికి హద్దే లేకుండాపోతోంది. రోగుల వద్ద వసూళ్లు, పాలనా పరమైన విభాగాల్లో అక్రమాలు వెలుగులోకి రావటం చూశాం.. తాజాగా గుర్తు తెలియని మృతదేహాలను కూడా అక్రమార్కులు వదలటం లేదు. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి పంపించిన శవాలపై గద్దల్లా వాలి పీక్కుతుంటున్నారు. శవాలపై ఉండే బంగారు, వెండి వస్తువులను మాయం చేస్తున్నారు. సాక్షి, అమరావతి బ్యూరో : పోస్టుమార్టం కోసం గవర్నమెంట్ ఆస్పత్రికి వచ్చిన శవాలకు సంబంధించిన వస్తువులను ఏడాదికోసారి ప్రభుత్వానికి అప్పజెప్పాల్సి ఉంది. అయితే, విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారులు మాత్రం నిబంధనలకు పాతరేసి ఏళ్ల తరబడి వాటిని ఆసుపత్రిలోనే ఉంచేస్తున్నారు. దీంతో వాటిని ఎవరికి వారు రకరకాల మార్గాల్లో దోచేస్తున్నారు. జరిగేది ఇలా... జిల్లాలో ఎక్కడైనా గుర్తుతెలియని శవాలు పడి ఉంటే పోలీసులు ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలిస్తారు. సుమారు ఐదారేళ్లుగా దాదాపు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో 200 వరకు (కేవలం) గుర్తుతెలియని శవాలకు పోస్ట్‌మార్టం జరిగిందని అంచనా. వాటిపై విలువైన బంగారు, వెండి వస్తువులతో పాటు నగదు ఉన్నా తీసి ఉంచుతారు. వాటిని ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో ఉన్న అధికారి పర్యవేక్షణలో భద్రపరుస్తారు. ప్రస్తుతం ఆసుపత్రిలో దాదాపు 88 బ్యాగుల్లో గుర్తు తెలియని శవాలకు సంబంధించిన వస్తువులు భద్రపరిచి ఉన్నట్లు సమాచారం. నిబంధనలివీ.. గుర్తుతెలియని శవాలకు సంబంధించిన వస్తువులను ప్రతి ఆరు నెలలు లేదా ఏడాదిలోపు పరిశీలించాలి. జాతీయ బ్యాంకులలో బంగారు వస్తువులు తూకం కట్టే అప్రైజర్‌ను పిలిపించి ఆయా వస్తువుల విలువ తేల్చాలి. ఆపై ప్రభుత్వ ఖజానా కార్యాలయానికి అప్పగించాలి. ఖజానా అధికారులు ఆ వస్తువులను లెక్కకట్టి వేలం ద్వారా రెవెన్యూగా మార్చుకోవాలి. ఆ వివరాలు పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేయాలి. కానీ ఎక్కడా ఈ నిబంధనలు అమలు కావటం లేదు. కొన్నేళ్లుగా వస్తువులను ప్రభుత్వ ఖజానాకు అప్పగించటం లేదని తెలుస్తోంది. జరుగుతోంది ఇదీ.. ప్రభుత్వాసుపత్రులలో భద్రపరిచిన బంగారు, వెండి వస్తువులను కిందిస్థాయి ఉద్యోగులు కాజేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గుర్తు తెలియని శవాలు కాబట్టి ఆ వస్తువుల గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. దీంతో ఉద్యోగులు సంబంధిత బ్యాగులు ఓపెన్ చేసి విలువైన బంగారు వస్తువులను తీసేసి వాటి స్థానంలో రోల్డ్ గోల్డ్‌వి ఉంచుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలోనే కాదు ప్రతి ఆసుపత్రిలో ఇదే తంతు జరుగుతోందని పలువురు ఉద్యోగులు బాహాటంగానే చెబుతున్నారు. గుర్తుతెలియని శవానికి పోస్ట్‌మార్టం చేసే సమయంలో వస్తువులు తీసేటప్పుడు వైద్యులు ఎల్లో మెటల్‌గా బంగారు వస్తువులు, వైట్ మెటల్‌గా వెండి వస్తువులను చూపిస్తారు. ఎన్ని గ్రాములు, వాటి విలువ ఎంత అన్నవి నమోదు చేయరు. దీంతో విలువైన వస్తువులు తీసేసినా ఎవరికీ తెలీదు. అదే అదునుగా కొందరు విలువైన వస్తువులు మాయం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలా చేస్తే చర్యలు తీసుకుంటాం.. ఆసుపత్రిలో వస్తువులు తీయడం జరగకపోవచ్చు. ఈ విషయం నాకు తెలియదు. అలా చేస్తే మాత్రం చర్యలు తీసుకుంటాం.– చక్రధర్, విజయవాడ ప్రభుత్వాసుపత్రి,సూపరింటెండెంట్ -
ముంబైలో 811 అనాధ శవాలు
ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) పరిధిలోని వివిధ ఆస్పత్రుల శవాల గదుల్లో 811 అనాధ శవాలు పడి ఉన్నట్లు తెలిసింది. వాటికి సంబంధించిన వారెవరూ పోలీసుస్టేషన్లకు రాకపోవడంతో అలాగే మూలుగుతున్నాయి. కాగా, ఉప నగరాలల్లో కూడా అనాధ శవాలు ఎక్కువగా ఉన్నాయి. వాటిలో మలాడ్-బోరివలి ప్రాంతాల్లో అనాధ శవాలు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జేజే ఆసుపత్రి పోస్టుమార్టం కేంద్రంలో 168, జుహూలోని కూపర్ ఆసుపత్రి పోస్టుమార్టం కేంద్రంలో 198, ఘాట్కోవర్లోని రాజావాడి ఆసుపత్రి పోస్టుమార్టం కేంద్రంలో 190, బోరివలిలోని భగవతి ఆసుపత్రి పోస్టుమార్టం కేంద్రంలో 212, గోరేగావ్‌లోని సిద్ధార్ద ఆసుపత్రి పోస్టుమార్టం కేంద్రంలో 43 అనాధ శవాలు పడి ఉన్నట్లు రాష్ట్ర నేర పరిశోధన విభాగం గణాంకాలు చెబుతున్నాయి. అదే విధంగా 2015లో మహారాష్ట్ర వ్యాప్తంగా 6,185 అనాధ శవాలను గుర్తించగా.. కేవలం ముంబైలో 1,043 శవాలు ఉన్నాయి.