బంధాలన్నీ దూరమాయే.. ఆఖరి మజిలీలో అనాథలా.. | Transgender Help To Orphan Dead Body | Sakshi
Sakshi News home page

బంధాలన్నీ దూరమాయే.. ఆఖరి మజిలీలో అనాథలా..

Apr 4 2023 9:13 AM | Updated on Apr 4 2023 9:36 AM

Transgender Help To Orphan Dead Body  - Sakshi

కాకినాడ క్రైం: నవమాసాలూ మోసి, కని పెంచిన కొడుకులున్నారు.. అయినవారందరూ ఉన్నారు.. అయినా ఆఖరి మజిలీలో ఆ తల్లిని పట్టించుకోలేదు. కడసారి చూపు కూడా వద్దనుకున్నారు.. దీంతో అన్నీ తానే అయి ఓ ట్రాన్స్‌జెండర్‌ ఆ పిచ్చితల్లికి అంతిమ సంస్కారం చేసింది. వివరాలివీ.. కాకినాడ పర్లోవపేటలోని రాజీవ్‌ గృహకల్ప ఫ్లాట్‌ నంబర్‌–8లో యల్ల ప్రభావతి (50) నివాసం ఉంటోంది. ఆమెకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కొన్నేళ్ల క్రితం కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడు. చిన్న కుమారుడు దుర్గాప్రసాద్‌ దంపతులకు ఏడేళ్ల కుమారుడు లక్కీ ఉన్నాడు.

భర్త బాధ్యతా రాహిత్యాన్ని భరించలేక దుర్గాప్రసాద్‌ భార్య లక్ష్మి మరొకరితో వెళ్లిపోయింది. అప్పటి నుంచీ మనవడు లక్కీ, కొడుకు దుర్గాప్రసాద్‌తో కలిసి ప్రభావతి జీవిస్తోంది. ఈ నేపథ్యంలో పది రోజుల క్రితం దుర్గాప్రసాద్‌ కూడా వారిని వదిలిపెట్టి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. మనవడు లక్కీ అంటే ప్రభావతికి ప్రాణం. మనవడికి ఏ లోటూ రానిచ్చేది కాదు. తాను తిన్నా తినకపోయినా తనకు వచ్చే వైఎస్సార్‌ వితంతు పెన్షన్‌తో ఉన్నంతలోనే ఆ పసివాడిని కంటికి రెప్పలా చూసుకునేది. ఇది చూసి చుట్టుపక్కల వారు అబ్బురపడేవారు.

ఇదిలా ఉండగా, గత నెల 30వ తేదీన కోడలు లక్ష్మి ఉన్నట్టుండి వచ్చింది. ఇంట్లోని పలు సామగ్రిని తనవంటూ తీసుకువెళ్లిపోబోయింది. అయితే తమ వద్ద చేసిన అప్పు తీర్చి సామాన్లు తీసుకెళ్లమంటూ ఆమెను చుట్టుపక్కల వారు నిలువరించారు. దీంతో తీవ్ర ఆగ్రహంతో అత్త ప్రభావతితో లక్ష్మి గొడవ పడింది. కావాలనే అప్పుల వాళ్లను పిలిచావంటూ మండిపడింది. తగిన శాస్తి చేస్తానని బెదిరింది. తను కన్న కొడుకు లక్కీని తనకు ఇచ్చేయమంటూ పట్టుబట్టింది. బలవంతంగా తీసుకెళ్లిపోతుంటే ప్రభావతి ఏడుస్తూ కాళ్లావేళ్లా పడింది.

చుట్టుపక్కల వారు అడ్డుకునే ప్రయత్నం చేసినా, తన కొడుకునే తీసుకువెళ్తున్నానంటూ లక్కీని తీసుకుని లక్ష్మి వెళ్లిపోయింది. మనవడిపై బెంగతో ఏడుస్తున్న ప్రభావతిని ఇరుగు పొరుగు వారు రాత్రి ఓదార్చి పడుకోమని చెప్పి వెళ్లారు. ఉదయం చూసేసరికి ప్రభావతి ఇంట్లో విగతజీవిగా కనిపించింది. పక్కనే ఉన్న గ్లాసులో మామిడి కాయలు మగ్గించే కాల్షియం కార్బయిడ్‌ ద్రావణాన్ని గుర్తించారు. ఆమె మృతి విషయం ఆ ప్రాంతంలో అందరికీ తెలిసినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. సమాచారం ఇచ్చినా సమీపంలోని బంధువులూ రాలేదు.

అదే ఫ్లాట్‌ సమీపంలో ట్రాన్స్‌జెండర్‌ కావ్య నివాసం ఉంటోంది. ప్రభావతి దుస్థితి గమనించి చలించిపోయింది. జరిగిందంతా హైదరాబాద్‌లో ఉంటున్న సర్వీస్‌ హార్ట్‌ ఆర్గనైజేషన్‌ వ్యవస్థాపకుడు ఆనంద్‌కు ఫోన్‌లో వివరించి, సహాయం కోసం అర్థించింది. ఆయన సూచనల మేరకు ప్రభావతి మృతదేహాన్ని కాకినాడ పోర్టు పోలీస్‌ స్టేషన్‌కు అంబులెన్సులో తీసుకెళ్లింది. ప్రభావతి మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జీజీహెచ్‌కు తరలించాలని సూచించారు. వారి సూచనల మేరకు ప్రభావతి మృతదేహాన్ని కావ్య జీజీహెచ్‌ మార్చురీకి తరలించింది.

తల్లి మరణంపై కుమారుడికి పోలీసులు సమాచారం ఇచ్చినా రాలేనని చెప్పాడు. సమీప బంధువులు, రక్త సంబంధీకుల రాక కోసం ఎదురు చూశారు. ఏ ఒక్కరూ రాకపోవడంతో ఫోరెన్సిక్‌ వైద్యులు ప్రభావతి మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించారు. ఆమె మృతదేహాన్ని అంబులెన్స్‌ డ్రైవర్‌ సాయంతో కాకినాడ బస్టాండు వద్ద ఉన్న శ్మశాన వాటికకు కావ్య తరలించింది. ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి అంబేద్కర్‌ సాయంతో ప్రభావతి మృతదేహాన్ని ఖననం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement