జ్యోతినగర్: అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులను చూసేందుకు రామగుండం వచ్చిన నరిష్మారెడ్డి అనే యువతి కరోనా కాటుకు బలైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ‘అమ్మా.. నువ్వు అమెరికాలో ఉన్నా బతికే దానివి.. మమ్మల్ని చూడటానికి వచ్చి కరోనాకు బలైపోయావా తల్లీ..’ అంటూ తల్లడిల్లిపోతున్నారు.
పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ (రామగుండం)లోని కృష్ణానగర్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్‌కు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు నరిష్మారెడ్డి (27) అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి అక్కడే నాలుగేళ్లుగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఆమెకు పెళ్లి సంబంధాలు చూడటానికి తల్లిదండ్రులు రామగుండం పిలిపించారు. దీంతో ఆమె నెల కిందట ఇక్కడికి వచ్చింది. అయితే ఆమె 20 రోజుల క్రితం అనారోగ్యం బారిన పడింది. కరోనా టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమెతోపాటు తల్లికీ పాజిటివ్‌రాగా, ఇద్దరూ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.
వారం కిందట మరోసారి టెస్ట్ చేయించుకోగా నరిష్మారెడ్డికి నెగెటివ్ వచ్చింది. అయినా ఆరోగ్యం మాత్రం కుదుటపడలేదు. దీంతో ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. మంగళవారం రాత్రి ఆమె మృతిచెందింది. మంచి ఉద్యోగంతో అమెరికాలో క్షేమంగా ఉన్న కూతురు ఇక్కడికి వచ్చి ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment