
సాక్షి, మహబూబాబాద్ : ఓటు వేశారా అంటే నోటితో సమాధానం చెప్పనక్కర్లేదు... సిరా గుర్తు ఉన్న వేలుని చూపిస్తే చాలు... సిరాచుక్కకు... ఓటుకు ఉన్న సంబంధం అలాంటిది. ఓటు వేసిన బాధ్యత కలిగిన పౌరునిగా మనల్ని సమాజంలో నిలబెట్టే ఆ సిరా ఎక్కడ తయారవుతుందో తెలుసా...? కర్ణాటకలోని మైసూర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని రంగులు వార్నిష్ పరిశ్రమ దీన్ని ఉత్పత్తి చేస్తుంది. మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలకు ఇక్కడి నుంచే సిరా సరఫరా అవుతుంది. దీన్ని 29 దేశాలకు సరఫరా చేస్తున్నారు. ఇతర వస్తువుల మాదిరిగా సిరాకు ఖరీదు కూడా పెరిగిపోయింది. గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ధర రెట్టింపు అయింది. పది మిల్లీలీటర్ల సిరా సీసా ధర రూ.64 ఉండగా దాని ధర రూ. 145 వరకు చేరుకుంది. ముడి సరుకుల ధర పెరగడమే దీనికి కారణమని తెలుస్తుంది.
2014 ఎన్నికలతో పోలిస్తే ఓటర్ల సంఖ్య పెరిగింది.1962 సార్వత్రిక ఎన్నికల నుంచి మైసూర్ పెయింట్స్ వార్నిష్ కర్మాగారం ఉత్పత్తి చేస్తున్న చెరిగిపోని సిరానే వినియోగిస్తున్నారు. ఈసారి కూడా అక్కడ నుంచే సిరాను సరఫరా చేయనున్నట్లు సమాచారం.1937లో అప్పటి మైసూర్ మహారాజు నాల్మడి కృష్ణరాజు వడియార్ ఈ సిరా తయారీ కర్మాగారాన్ని స్థాపించారు. అప్పటి దీని పేరు మైసూర్ లాక్ అండ్ పెయింట్స్ వర్క్స్.1989లో దాని పేరును మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ సంస్థగా మార్చారు. స్వాతంత్య్రానికి ముందు వరకు మైసూర్ రాజుల స్వాధీనంలో ఉండేది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ పరమైంది.తొలుత సీళ్లు వేసేందుకు కావాల్సిన లక్క తయారీకి ఈ పరిశ్రమను స్థాపించారు.
చెట్ల నుంచి వచ్చే జిగురు తెచ్చి దానికి ఇతర అటవీ ఉత్పత్తులను కలిపి లక్కగా మార్చి రాజముద్రను వేసేందుకు ఉపయోగించేవారు. జిగురు సరఫరా తగ్గిపోవడంతో లక్కకు బదులుగా చెట్ల పసరు ఆధారంగా పెయింట్ల తయారీని ప్రారంభించారు. 1962లో ఒక ఓటరు పలుమార్లు వేయకుండా నివారించేందుకు చెరిగిపోని సిరాను ఉత్పత్తిచేయాలని కేంద్రం నిర్ణయించింది. నేషనల్ ఫిజికల్ లాబోరేటరీస్ ఫార్ములాతో సిరా ఉత్పత్తి బాధ్యతను ఆ కర్మాగారానికి అప్పగించారు. దక్షిణాఫ్రికా, నైజీరియా, నేపాల్, కెనడా, కాంబోడియా లాంటి ఇతర దేశాల్లోనూ ఈ సిరానే వినియోగిస్తున్నారు. ఈ సిరా ఎందుకు చెరగదంటే...మొదట్లో ఓటు వేసిన వ్యక్తికి ఎడమ చేతి వేలిపై సిరా చుక్కను పెట్టేవారు. 2006 ఫిబ్రవరి నుంచి ఓటర్ల ఎడమ చేతి వేలి గోరుపై సిరాను గీతగా పెడుతున్నారు.సిరాలో 7–25శాతం సిల్వర్ నైట్రేట్ ఉన్నందున వెంటనే చెరిగిపోదు.ఈ సిరా నేరేడు పండు రంగులో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment