ఓటు ఎవరికి పడిందో తెలుసుకోవచ్చు
కలెక్టర్ లోకేష్‌కుమార్
ఖమ్మం జెడ్పీసెంటర్: ఓటు ఎవరికి పడిందో తెలుసుకోవచ్చని కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ అన్నారు. జిల్లాకు రాష్ట్ర ఎన్నికల సంఘం నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన 40 వీవీపీఏటీ(ఓటు వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్) మిషన్లు పంపిందని కలెక్టర్ తెలిపారు. టీఎన్‌జీఓ ఫంక్షన్ హాల్‌లో సోమవారం యంత్రాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటు వేసిన తరువాత, రశీదు వస్తుందని, ఏడు సెకన్ల తర్వాత మళ్లీ యంత్రంలోకి వెళ్తుందని చెప్పారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఉపయోగించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి రావాల్సి ఉందన్నారు. అనంతరం మాక్ పోలింగ్ నిర్వహించారు. జేసీ దివ్య, ఏజేసీ బాబూరావు, నగరపాలక కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
నియమావళిని అమలు చేయాలి
ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ డీఎస్.లోకేష్‌కుమార్ అన్నారు. సోమవారం ప్రజ్ఞా సమావేశ మందిరంలో నిర్వహించిన రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలింగ్ స్లిప్పులను రాజ కీయ పార్టీల ప్రతినిధులకు ఇవ్వొద్దన్నారు. స్లిప్పుల పంపిణీకి వెళ్లిన సమయంలో ఇంటికి తాళం వేసి ఉంటే ఆ వివరాలను లిఖితపూర్వకంగా అందజేయాలన్నారు. రేపటిలోగా స్లిప్పుల పంపిణీ పూర్తి చేయాలన్నారు. అనంతరం బ్యాలెట్ పేపర్‌ను పరిశీలించారు.