సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు పొందడం కోసం ఓటరుగా నమోదు చేసుకోవడానికి గడువు శుక్రవారంతో ముగిసింది. ఓటర్ల జాబితా రెండో సవరణ కార్యక్రమంలో భాగంగా గత నెల 12న తుది ఓటర్ల జాబితాను ప్రచురించిన విషయం తెలిసిందే. తుది జాబితాలో ఓటర్ల సంఖ్య 2,73,18,603 ఉండగా ఆ తర్వాతి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు కొత్త ఓటర్ల నమోదు కోసం 3,50,962 మంది దరఖాస్తు చేసుకున్నారు. కొత్త దరఖాస్తుల్లో ఇప్పటివరకు 1,53,115 దరఖాస్తులను స్వీకరించి ఓటర్ల జాబితాలో స్థానం కల్పించారు. 13,326 దరఖాస్తులను తిరస్కరించగా 1,84,521 దరఖాస్తులపై విచారణ పెండింగ్‌లో ఉంది.
దీంతో శుక్రవారానికి రాష్ట్ర ఓటర్ల సంఖ్య 2,74,53,358కు పెరిగింది. ఇందులో వికలాంగ ఓటర్లు 6,39,276 మంది ఉన్నారు. పెండింగ్ దర ఖాస్తుల పరిష్కారం పూర్తయ్యాక మొత్తం ఓటర్ల సంఖ్య పెరగనుంది. కొత్త దరఖాస్తుల పరిశీలన ముగిశాక ఈ నెల 19న జాబితా రెండో అనుబంధాన్ని ప్రచురించనున్నారు. శాసనసభ ఎన్నికల్లో దీన్నే వినియోగించనున్నారు. బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓ) ఓటరు నమోదు దరఖాస్తులను తిరస్కరిస్తే వరుసగా రిటర్నింగ్ అధికారులకు పునఃపరిశీలన కోసం దరఖాస్తు చేసుకోవాలని సీఈఓ రజత్‌కుమార్ సూచించారు. ఆ తర్వాత కూడా తిరస్కరిస్తే జిల్లా ఎన్నికల అధికారులు, ఆ తర్వాత తనకు 19వ తేదీ వరకు పునఃపరిశీలన కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment