సాక్షి, సిటీబ్యూరో: వచ్చేనెల 7వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో పాల్గొనేందుకు మహానగర ప్రజలకు ఇంటింటికీ ఓటరు స్లిప్‌లు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమం మంగళవారం నుంచి ప్రారంభించనున్నారు. వాస్తవానికి సోమవారమే ఈ ప్రక్రియ ప్రారంభమై డిసెంబర్ ఒకటో తేదీ నాటికి పూర్తి చేయాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ నిర్ణయించారు. ఒకరోజు ఆలస్యంగా ప్రారంభిస్తున్నందున డిసెంబర్ 2 నాటికి పూర్తి చేస్తామంటున్నారు. కానీ నగరంలో ఇప్పటి దాకా జరిగిన ఓటర్ల జాబితా సర్వే, కొత్త ఓటర్ల నమోదు తదితర అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటే నిర్ణీత వ్యవధిలోగా ఈ పంపిణీ ప్రక్రియ పూర్తి చేయగలరా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఆయా కార్యక్రమాల సందర్భాల్లో బూత్ లెవల్ అధికారులు(బీఎల్‌ఓ) ఇంటింటికీ వెళ్లకుండా ఎక్కడోచోట కూర్చొని ఇష్టానుసారం చేయడం శారు. దీనివల్లే ఓటరు జాబితా తప్పులకుప్పగా మారిందనే ఆరోపణలున్నాయి. ఒకే ఇంట్లో పదుల సంఖ్యలో ఓట్లు, ఒక్కరికే ఐదారు ప్రాంతాల్లో ఓట్లు నమోదు ఇందుకు నిదర్శనంగా విమర్శకులు చెబుతున్నారు.
రోజుకు 180 స్లిప్‌ల పంపిణీ
జీహెచ్‌ఎంసీలోని బీఎల్‌ఓలు, నగరంలోని ఓటర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే రోజుకు ఒక్కో బీఎల్‌ఓ 180 ఓటరు స్లిప్‌లను పంపిణీ చేయాలి. ఒక్కో ఇంట్లో సగటున నలుగురు ఓటర్లు ఉన్నా రోజుకు కనీసం 45 ఇళ్లు తిరగాలి. సగటున గంటకు ఐదు ఇళ్లు తిరగ్గలరనుకున్నా రోజుకు 9 గంటల పాటు వారు ఇదే పనిలో ఉండాలి. ఇది సాధ్యమేనా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అపార్ట్‌మెంట్లలో ఉండే ఫ్లాట్లలో పంపిణీ కంటే ఇండిపెండెంట్ ఇళ్లకు వెళ్లేందుకు సమయం పడుతుంది. ఒక ఇంటికి, ఇంకో ఇంటికీ మధ్య దూరం ఉంటుంది. అంతేకాకుండా వెళ్లగానే హడావుడిగా పంపిణీ చేయడం సాధ్యం కాదు. జాబితా మేరకు సదరు ఇళ్లలో ఉన్న ఓటర్లలో కనీసం ఒక్కరైనా ఉన్నట్లు నిర్థారించుకున్నాకే వాటిని ఇవ్వాలి. పంపిణీ చేసినట్లు సంతకం తీసుకోవాలి. ఈ తతంగమంతా నిర్ణీత వ్యవధిలో చేయడం సాధ్యం కాదు. ప్రస్తుతం ఉన్న బీఎల్‌ఓలకు తోడు అదనంగా మరింత మందిని నియమిస్తేనే ఇది సాధ్యమన్న అభిప్రాయాలున్నాయి. పోలింగ్ శాతం పెంచేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ, సక్రమంగా పోల్‌స్లిప్‌లు పంపిణీ కాకపోతే ఎన్నికల విభాగానికి చెడ్డపేరు వచ్చే ప్రమాదముంది.
ఓటర్లు ఇళ్లలో లేకుంటే..
సిబ్బంది ఇళ్లకు వెళ్లిన సమయంలో లేనివారి పోల్ స్లిప్‌లు పోలింగ్ రోజున సంబంధిత పోలింగ్ కేంద్రం వద్ద అందుబాటులో ఉంచుతారు. వారితోపాటు చిరునామాలో లేనివారివి, డూప్లికేట్లుగా భావించివారివి అందుబాటులో ఉంచుతారు. అక్కడ తగిన ఆధారం చూపి పోల్‌స్లిప్ పొందవచ్చు. పోల్‌స్లిప్ లేకపోయినా ఎన్నికల సంఘం పేర్కొన్న 12 రకాల్లో ఏదైనా గుర్తింపు పత్రం చూపినా ఓటరు జాబితాలో పేరుంటే ఓటు వేయవచ్చు.
ఒక్కో స్లిప్‌కు 99 పైసలు
పోల్‌స్లిప్‌ల ముద్రణకు ఒక్కోదానికి 99 పైసలు ధర ఖరారు చేశారు. స్లిప్‌పై ఓటరు ఫొటోతో పాటు వెనుకవైపు పోలింగ్ కేంద్రం దారి తెలిపే మ్యాప్ ఉంటుంది.
మేడ్చల్ జిల్లాలో ఓటర్లు 22.14 లక్షలు
సాక్షి,మేడ్చల్ జిల్లా: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలల్లో మంగళవారం నుంచి ఓటర్లకు స్లిప్స్ పంపిణీ చేసేందుకు జిల్లా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఆదివారం నుంచే పంపిణీ చేయాలని భావించినా సాఫ్ట్‌వేర్ సాంకేతిక లోపంతో స్లిççప్స్ డౌన్‌లోడ్ కాలేదు. జిల్లాలో మొత్తం 22,14,754 మంది ఓటర్లు ఉండగా ఓటు నమోదు కోసం 2,194 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఓటర్ల స్లిప్‌లు కూడా బూత్ లెవల్‌లో బీఎల్‌ఓ అధ్వర్యంలో నలుగురు సభ్యుల బృందం పంపిణీ చేసే« విధంగా జిల్లా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. పంపిణీ సక్రమంగా సాగేందుకు జిల్లా స్థాయిలో కలెక్టర్ ఎంవీరెడ్డి నోడల్ అధికారిని నియమించారు. ఎన్నికల విభాగానికి చెందిన అధికారులు కూడా పంపిణీపై తగిన చర్యలు తీసుకునేలా జిల్లా ఎన్నికల సంఘం కార్యాచరణ రూపొందించింది.
ఇంటింటికీ పంపిణీ చేస్తాం: దానకిశోర్
డిసెంబర్ 2వ తేదీలోగా ఓటర్లందరికీ పోల్‌స్లిప్‌లు పంచేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని గ్రేటర్ ఎన్నికల అధికారి దానకిశోర్ తెలిపారు. వారం రోజులుగా సంబంధిత సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని, రాజకీయ పార్టీల వారికి బూత్ లెవల్ ఏజెంట్లను ఈ కార్యక్రమంలో పాల్గొనమని చెప్పామన్నారు. పోల్‌స్లిప్‌ల పంపిణీని ఏరోజుకారోజు పర్యవేక్షించేందుకు అధికారులను నియమించామన్నారు. పరిస్థితిని సమీక్షిస్తూ తగిన చర్యలు చేపట్టేందుకు హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధుల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేకంగా ఇద్దరు నోడల్ అధికారులును నియమించామని, వారితోపాటు జిల్లా మొత్తం పరిస్థితిని అడిషనల్ కమిషనర్ (ఎన్నికలు) పర్యవేక్షిస్తారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment