ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు గాలం
డబ్బులు పంచుతుండగా పట్టుకున్న
ఐక్యకూటమి నాయకులు
వ్యక్తిని చితకబాది పోలీసులకు అప్పగింత
అచ్చంపేట రూరల్ : అచ్చంపేట నగరపంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు ఓ వ్యక్తి డబ్బులు పంచుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా ఐక్యకూటమి నాయకులు పట్టుకున్నారు. గురువారం సాయంత్రం పట్టణంలోని తొమ్మిదో వార్డులో ఐక్యకూటమి అభ్యర్థి సుగుణమ్మ తరపున ఆర్టీసీ డిపో పక్కన డీకే అరుణ, కూటమి నాయకులు ప్రచారం చేశారు. ఓటర్లను డబ్బులతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుండగా ఆ వ్యక్తిని కూటమి నాయకులు పట్టుకుని చితకబాదారు. ఇది చూసిన మరో ముగ్గురు వ్యక్తులు పారిపోయారని తెలిపారు.
పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తి నుంచి నగదు, టీఆర్‌ఎస్ అభ్యర్థికి సంబంధించిన కరపత్రాలను స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో కూటమి కార్యకర్తలు ఆ వ్యక్తిపై దాడిచేసి చితకబాదారు. అతికష్టం మీద ఆ వ్యక్తిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యేలు రాములు, వంశీకృష్ణ, నాయకులు బక్కని నర్సింహ, జెడ్పీటీసీ ధర్మానాయక్, మాజీ ఎంపీపీ రామనాథం తదితరులు ర్యాలీగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేస్తాం : డీఎస్పీ
డబ్బులు పంచుతున్న వ్యక్తి కల్వకుర్తి నియోజకవర్గం మాడ్గులకు చెందిన కృష్ణారెడ్డిగా గుర్తించామని డీఎస్పీ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. అతనిపై కేసు నమోదు చేస్తామన్నారు. అచ్చంపేట లాడ్జింగ్, ప్రైవేటు ప్రదేశాలలో ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు.