
చికిత్స పొందుతున్న వీఆర్‌ఓ ఆదినారాయణ
పర్ణశాల భద్రాద్రి : మండలంలోని నారాయణరావుపేట వీఆర్‌ఓగా విధులు నిర్వహిస్తున్న రేసు ఆదినారాయణ యాసిడ్ తాగి సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్నాడనే కారణంతో తహసీల్దార్ హరిచంద్ నాలుగు రోజులు క్రితం మెమో ఇవ్వడంతో పాటు జీతం నిలిపివేశారు. దీంతో మనస్తాపం చెందిన ఆదినారాయణ ఇంట్లో వున్న యాసిడ్ తాగాడు.
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆదినారాయణ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. తహసీల్దార్‌తో పాటు డీటీ, ఆర్‌ఐలు వేధించడం వల్లనే ఆదినారాయణ ఆత్మహత్యాయత్నం చేసినట్లు కుటుంబ సభ్యులు, వీఆర్‌ఓల సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు.
ఈ విషయమై తహసీల్దార్ హరిచంద్‌ను వివరణ కోరగా ఆదినారాయణ ఒక్కడికే కాదు విధులు సరిగా నిర్వహించని ఏడుగురు వీఆర్‌ఓలకు మెమోలు ఇచ్చామన్నారు. ఎంత హెచ్చరించినా పద్ధతి మారకపోవడంతో మెమో ఇచ్చామని తెలిపారు. ఇప్పటి వరకు అతను మెమోను తీసుకోలేదన్నారు.
వేధింపులకు గురిచేయడం అవాస్తవం అన్నారు. భద్రాచలంలో చికిత్స పొందుతున్న వీఆర్‌ఓ దగ్గరకు సిబ్బంది వెళ్లడంతో తహసీల్దార్ కార్యాలయం ఖాళీ అయింది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఇబ్బంది పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment