
సాక్షి, హైదరాబాద్: అర్హులైన అర్చకులు, ఆలయ ఉద్యోగులందరికి త్వరలోనే వేతనాలు చెల్లిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాలపై మంగళవారం సచివాలయంలో దేవాదాయశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమయ్యారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ, కొన్ని సాంకేతిక కారణాలవల్లే 131 ఆలయాలకు సంబంధించిన 6బీ, 6సీ, 6డీ కేటగిరి కింద ఉన్న అర్చకులు, ఆలయ ఉద్యోగుల డాటా ఇంకా ఆన్‌లైన్ చేయలేదన్నారు.
ఈ 131 ఆలయాల్లో పనిచేస్తున్న వారితోపాటు, అర్హతలు ఉన్నా, లిస్ట్‌లో తమ పేరు లేదని కొంతమంది నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వారి సమస్యల పరిశీలనకు ఓ కమిటీని నియమిస్తున్నట్లు చెప్పారు. 1,903 మందికి రివైజ్డ్ వేతనాలు వారి ఖాతాల్లో వేయడం జరుగుతుందన్నారు. 1,500 మందికి ఈ నెలాఖరులోగా జమ చేయడం జరుగుతుందన్నారు.
ఆందోళన తాత్కాలిక వాయిదా
గత 15రోజులుగా అర్చక, ఉద్యోగులు చేస్తున్న ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. దేవాలయాల్లో ఆర్జిత సేవలను బుధవారం నుంచి ప్రారంభిస్తామని అర్చక, ఉద్యోగుల జేఏసీ చైర్మన్ గంగు భానుమూర్తి వెల్లడించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇచ్చిన హామీతో జేఏసీకి సంతృప్తి కలగడంతో ఈ ఆందోళన విరమిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment