మృతదేహాల కోసం నిరీక్షణ | Waiting for DeadBodies | Sakshi
Sakshi News home page

మృతదేహాల కోసం నిరీక్షణ

Published Fri, Mar 4 2016 2:55 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

సాక్షి పత్రిలో వచ్చిన ఫొటోలను చూస్తున్న మృతుల కుటుంబీకులు - Sakshi

సాక్షి పత్రిలో వచ్చిన ఫొటోలను చూస్తున్న మృతుల కుటుంబీకులు

బంధువులకు అప్పగింతపై హైడ్రామా
భద్రాచలం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బొట్టెంతోగు ఎన్‌కౌంటర్ లో మృతిచెందిన ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలు ఖమ్మం జిల్లా భద్రాచలం ఏరియా ఆస్పత్రిలోనే ఉన్నాయి. ఎన్‌కౌంటర్ జరిగి గురువారం నాటికి మూడు రోజులైనా మృతదేహాలను బంధువులకు అప్పగించే విషయమై హైడ్రామా కొనసాగుతోంది. ఈ ఎన్‌కౌంటర్‌పై మానవ హక్కుల సంఘం కోర్టును ఆశ్రయించింది. దీంతో మృతదేహాలను వారి బంధువులకు అప్పగించే విషయంలో పోలీసులు ఆచితూచి అడుగులేస్తున్నారు. ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతిచెందగా..

ఇప్పటికే ధనసరి సారక్క, సోనీ మృతదేహాలను వారి బంధువులు తీసుకెళ్లారు. కొత్తకుండ సృజన, మడకం బండి మృతదేహాల కోసం వచ్చిన వారి బంధువులు భద్రాచలం ఏరియా ఆస్పత్రి మార్చురీ వద్దే పడిగాపులు కాస్తున్నారు. కాగా, హైకోర్టు ఉత్తర్వులకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి తగిన ఆదేశాలు లేకపోవటంతో మృతదేహాలను అప్పగించలేదని ఏఎస్పీ భాస్కరన్ తెలిపారు. మరోవైపు మృతుల్లో ఒకరైన మడకం బండి తూర్పుగోదావరి జిల్లా గొల్లగుప్ప గ్రామానికి చెందిన వాడని గుర్తించినప్పటికీ గురువారం కథ అడ్డం తిరిగింది.

మడకం బండి తమ కొడుకని ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా బాసగూడెం మండలం బట్టిగూడెంనకు చెందిన పద్దల లక్మా, ఇతర కుటుంబ సభ్యులు వచ్చారు. బండి తాము పెంచుకున్న కొడుకని గొల్లగుప్పకు చెందిన మడకం నందయ్య ఆధారాలు చూపిస్తుండగా, లక్మా కూడా అతను తమ కుమారుడేనని చెబుతుండటంతో పోలీసులు తర్జన భర్జన పడుతున్నారు. కాగా, మృతిచెందిన మహిళా మావోయిస్టు మడివి దేవి ఛత్తీస్‌గఢ్‌లోని పామేడు మండలం మిట్టగూడెం గ్రామానికి చెందినది కాగా, ఛత్తీస్‌గఢ్‌కే చెందిన నూప రామి ఊసూరు మండలం నర్సాపురానికి చెందినట్లుగా గుర్తించారు.
 
మృతదేహాల అప్పగింతను రికార్డు చేయాలి
పోలీసులకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారి మృతదేహాలను వారి బంధువులకు అప్పగించే ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేయాలని గురువారం హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మృతదేహాలను తీసుకునేందుకు ఎవరూ రాకపోతే తగు సౌకర్యాలున్న ఆసుపత్రిలో భద్రపరచాలని పేర్కొంటూ తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.

ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మృతదేహాలకు ఉస్మానియా ఆస్పత్రిలో రీపోస్టుమార్టం చేయించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ పౌర హక్కుల కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ గడ్డం హైకోర్టులో పిల్ దాఖలు చేసిన వియం తెలిసిందే.

గురువారం ఈ పిల్ విచారణ సందర్భంగా అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు స్పందిస్తూ మృతదేహాలను భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో భద్రపరిచామని, ఇద్దరి మృతదేహాలను అప్పగించామని తెలిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది రఘునాథ్ మాట్లాడుతూ.. మృతదేహాలకు రీ పోస్టుమార్టం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ రీ పోస్టుమార్టం విషయంలో ఛత్తీస్‌గఢ్ హైకోర్టును ఆశ్రయించాలని పేర్కొంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement