రోటీ.. కపడా... ఔర్ ఇంటర్నెట్ | War of the net | Sakshi
Sakshi News home page

రోటీ.. కపడా... ఔర్ ఇంటర్నెట్

Published Sun, Apr 19 2015 12:52 AM | Last Updated on Fri, Jul 27 2018 1:22 PM

రోటీ.. కపడా... ఔర్ ఇంటర్నెట్ - Sakshi

రోటీ.. కపడా... ఔర్ ఇంటర్నెట్

నెట్ వార్..
 
ఉచితం పేరిట కంపెనీల ఆధిపత్య యత్నాలు.. తమ సైట్లు, యాప్స్‌నే వాడేలా టెలికం సంస్థలతో ఒప్పందాలు
 
ఫేస్‌బుక్ సారథ్యంలో ‘ఇంటర్నెట్.ఆర్గ్’ ఉచిత సేవలు ఇలా కొన్నిటినే ఇవ్వడంపై మండిపడ్డ నెటిజన్లు సమాన సేవల కోసం ‘నెట పూర్తి న్యూట్రాలిటీ ఇక్కడ అసాధ్యమంటున్న నిపుణులు గుత్తాధిపత్యానికి మాత్రం అవకాశమివ్వరాదని సూచనలు
 
ఇపుడో పెద్ద యుద్ధం జరుగుతోంది. ఆన్‌లైనే యుద్ధభూమిగా జరుగుతున్న ఈ పోరాటంలో ప్రధాన ఆయుధం సోషల్ నెట్‌వర్కింగే. పేరుకు వేళ్లపై లెక్కపెట్టే సంఖ్యలోనే ఉన్నా... చేతినిండా డబ్బు, బలమైన లాబీయింగ్, అంతర్జాతీయ దిగ్గజాల మద్దతు ఉన్న టెలికామ్ కంపెనీలు ఈ యుద్ధంలో ఒకవైపున్నాయి. అపరిమితంగా ఉన్న ఇంటర్నెట్ వాడకందార్లు సామాజిక మాధ్యమాలనే వేదికగా చేసుకుని మరోవైపు నిలబడ్డారు. ‘నెట్ న్యూట్రాలిటీ’ లేదా ‘అందరికీ సమాన ఇంటర్నెట్’గా పిలుస్తున్న ఈ యుద్ధం ఫలితమే దేశంలో ఇంటర్నెట్ భవిష్యత్తును నిర్ణయించబోతోంది.
 
మంథా రమణమూర్తి
ఫేస్‌బుక్‌పై పోరాటానికి ఆ ఫేస్‌బుక్కే వేదికైంది. వాట్సాప్‌ను విమర్శిస్తూ అందులోనే గ్రూపులు తయారయ్యాయి. అక్కడే వేల మెసేజ్‌లు రూపుదిద్దుకుని అవన్నీ లక్షలకొద్దీ ఈ-మెయిళ్లుగా మారుతున్నాయి. గడిచిన వారం రోజుల్లోనే టెలికం రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్)కి దాదాపు 8 లక్షల మంది నెటిజన్లు ఈ-మెయిళ్లు పంపారు. ఇంటర్నెట్‌ను ఏ కొద్ది వెబ్‌సైట్లకో లేదా యాప్స్‌కో పరిమితం చేసే ప్రయత్నాలకు మద్దతివ్వవద్దని, స్వేచ్ఛాయుత నెట్ వాడకానికి వీలు కల్పించే ‘నెట్ న్యూట్రాలిటీ’కి మద్దతివ్వాలని కోరారు. అనూహ్యంగా వెల్లువెత్తిన ఈ స్పందనకు టెలికం కంపెనీలు, ట్రాయ్ వంటి సంస్థలే కాదు... నెట్ న్యూట్రాలిటీ ఉద్యమకారులు కూడా ఆశ్చర్యపోయారు. ప్రభుత్వం కూడా ఓ కమిటీని వేసి ఈ సంగతి తేల్చాలని కోరింది.

ఏమిటి.. ఎందుకు?

నెట్ న్యూట్రాలిటీ అంటే ఇంటర్నెట్ వాడకందార్లందరికీ ఒకే రకమైన స్పీడు, ఒకే రకమైన డౌన్‌లోడింగ్ సామర్థ్యంతో సేవలందించడం. చెల్లించే డబ్బుల ఆధారంగా కొందరికి వేగంగా, కొందరికి స్లోగా... కొందరికి అపరిమితంగా, కొందరికి పరిమిత సామర్థ్యంతో వివక్షాపూరిత సేవలందించడం న్యూట్రాలిటీకి వ్యతిరేకం. అమెరికాలో కొన్ని సంస్థలు ఇలాంటి సేవలందిస్తుండటంతో వాటికి వ్యతిరేకంగా నెట్‌న్యూట్రాలిటీ పోరాటం ఆరంభమైంది.

మనదేశం మాటేంటి?

మార్చి 27న ట్రాయ్ ఒక సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. టెలికం సంస్థలు తమ నెట్‌వర్క్‌తో పాటు కొన్ని అప్లికేషన్ల సేవలూ టాప్ ప్రాధాన్యంతో అందించే ‘ఓవర్ ది టాప్’ సేవలకు సంబంధించి ఎవరికైనా అభ్యంతరాలుంటే చెప్పాలనేది దాని సారాంశం. దేశంలో నెట్ న్యూట్రాలిటీ ఉద్యమానికి కారణం ఇదే. ఒక నెట్‌వర్క్‌లో కొన్ని యాప్స్‌ను మాత్రం ఉచితంగా అందిస్తే సదరు వినియోగదారుడు మిగతా యాప్‌లను డేటా చార్జీలు చెల్లించి ఎందుకు వాడతాడనేది న్యూట్రాలిటీ ఉద్యమకారుల ప్రశ్న. అవును! ఫ్లిప్‌కార్ట్‌తో పనైపోతుంటే స్నాప్‌డీల్‌నో, అమెజాన్‌నో ఆశ్రయించాల్సిన అవసరమేంటి? ఇంటర్నెట్ చార్జీల్లేకుండా బింగ్ సెర్చింజను అందుబాటులోకి వస్తే గూగుల్ అవసరమేంటి? టెలిఫోన్ చార్జీల్లోనే వాట్సాప్ వీడియో కాలింగ్ వచ్చేస్తే ఇక స్కైప్ అవసరమేముంటుంది? అసలు అందరికీ తెలిసిన ఇంటర్నెట్ దిగ్గజాలను పక్కనబెడితే.. మిగిలిన లక్షల కొద్దీ యాప్స్ మాటేంటి? ఇతర వెబ్‌సైట్లను చూసేదెవరు? అందుకే ‘‘మీరు ఉచితంగా ఇంటర్నెట్ ఇవ్వండి. వెబ్‌సైట్లను కాదు. ఎందుకంటే ఏ వెబ్‌సైట్లు చూడాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను మాకు వదిలేయండి’’ అనే నినాదంతో ఇంటర్నెట్‌లో ఒక మహోద్యమం మొదలైంది. ప్రభుత్వాన్ని సైతం కదిలించింది.
 
పూర్తిస్థాయి న్యూట్రాలిటీ సాధ్యమా?
 

మన దేశంలో సంపూర్ణ నెట్ న్యూట్రాలిటీ సాధ్యం కాకపోవచ్చనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మొదటి నుంచీ డౌన్ లోడింగ్ సామర్థ్యం, స్పీడు వంటివి చెల్లించే చార్జీల ఆధారంగానే అమలవుతున్నాయి. కానీ ఉచితమనే పేరిట కొన్ని యాప్స్, సైట్లను మాత్రమే ప్రతిపాదిస్తుండటంతో వివాదం రాజుకుంది. అంతర్జాతీయ దిగ్గజాలు ఇంటర్‌నెట్లో గుత్తాధిపత్యానికి దీన్నో మార్గంగా ఎంచుకున్నాయనే వాదనలు బలపడి... ఇది లక్షలాది యాప్ డెవలపర్ల, వ్యాపారుల ప్రయోజనాల్ని దెబ్బతీస్తుంది కనక వ్యతిరేకత వెల్లువెత్తింది. అయినా  రిలయన్స్ కమ్యూనికేషన్స్ మాత్రం తాము వెనక్కి తగ్గేది లేదని, ఇంటర్నెట్.ఆర్గ్‌ను అమలు చేసి తీరతామని ప్రకటించింది. ప్రభుత్వం న్యూట్రాలిటీని సమర్థించినా మున్ముందు అమెరికా తరహాలో ఈ సంస్థలు న్యాయస్థానాల్ని ఆశ్రయించవచ్చు.
 
ఇది గుత్తాధిపత్య ధోరణి కాదా?

 
పొద్దున లేస్తూనే చూసే ఫేస్‌బుక్‌కు అమెరికాలో వాడకందార్లు 5 శాత మే. అందుకే అది అభివృద్ధి చెందుతున్న, నిరుపేద దేశాల్లో తమ సేవల్ని ఉచితంగా ఇవ్వడానికి ‘ఫేస్‌బుక్ జీరో’ ప్రాజెక్టును ఆరంభించింది. అంటే దానితో ఒప్పందం చేసుకున్న టెలికామ్ సంస్థల వినియోగదారులకు ఫేస్‌బుక్ వెబ్‌సైట్ ఫ్రీగా వస్తుందన్న మాట. అయితే అది పూర్తి వెబ్‌సైట్ కాదు. ఫొటోల్లేకుండా టెక్ట్స్ మాత్రమే కనిపిస్తుంది. ఫొటోలపై క్లిక్ చేసి తెరిస్తే మాత్రం డేటా చార్జీలు వసూలు చేస్తారు. తర్వాత ఫేస్‌బుక్ మరో ప్రాజెక్టు ఆరంభించింది. ఫేస్‌బుక్‌ను, తమకే చెందిన వాట్సాప్‌ను, ఇంకా తమ దగ్గర లెసైన్సు పొందిన మరికొన్ని సంస్థల యాప్‌లను ‘ఇంటర్నెట్.ఆర్గ్’ పేరిట ఒకచోటుకి చేర్చింది. తమతో ఒప్పందం చేసుకున్న టెలికం కంపెనీల వినియోగదార్లకు ఇంటర్నెట్.ఆర్గ్‌లోని వెబ్‌సైట్లు, యాప్‌లు ఉచితంగా అందుతాయన్న మాట. దానిగ్గాను సదరు కంపెనీలకు ఫేస్‌బుక్ కొంత మొత్తాన్ని చెల్లిస్తుంది. నిజానికి ఫేస్‌బుక్ ఆదాయమంతా దాన్లో వచ్చే ప్రకటనల ద్వారానే వస్తుంది. ప్రకటనలనేవి ఎంత ఎక్కువ మంది వినియోగదార్లుంటే అంత ఎక్కువగా వస్తాయి. అందుకే ఉచిత సేవలతో వినియోగదార్లను పెంచుకోవడం, తద్వారా రెవెన్యూ పెంచుకోవడం ఫేస్‌బుక్ ప్రధానోద్దేశమన్నది విమర్శకుల మాట.
 
గూగుల్‌దీ అదే బాట!

 
 గూగుల్ కూడా తక్కువేమీ తినలేదు. ‘ప్రాజెక్ట్ లూమ్’ పేరిట కొందరు టెలికం ఆపరేటర్లతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం సదరు కంపెనీల వినియోగదార్లకు జీమెయిల్‌తో పాటు గూగుల్ సెర్చింజన్, గూగుల్ ప్లస్ వంటి సేవలు ఉచితంగా అందుతాయి. మిగిలిన వాటికి డేటా చార్జీలు చెల్లించాలి. ఇవన్నీ నెట్ న్యూట్రాలిటీ మద్దతుదార్లకు సుతరామూ నచ్చకపోవడంతో ఉద్యమం మొదలైంది.
 
 కంపెనీలు ఎందుకిలా చేశాయి?


 టెలికం సంస్థల వాదన మరోలా ఉంది. మారిన పరిస్థితుల్లో ఫోన్ వినియోగదారులు సంప్రదాయ కాలింగ్, మెసేజింగ్ పద్ధతులు మానేస్తున్నారు. వీడియో కాలింగ్ కావాలంటే స్కైప్, మెసేజింగ్ కావాలంటే వాట్సాప్, వాయిస్ కాల్స్ కావాలంటే వైబర్ వంటివి ఉపయోగిస్తున్నారు. దీంతో వాటి ఆదాయం తగ్గుతోంది. ప్రధానంగా ఇంటర్నెట్ వాడకం ద్వారా వచ్చే ఆదాయంపైనే ఆధారపడాల్సి వస్తోంది. అందుకే కొంత ఉచితంగా ఇస్తే ఇంటర్నెట్ మెల్లగా అందరికీ అలవాటవుతుందని, అపుడు డేటా ఛార్జీల ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుందనేది వాటి వాదన. స్పెక్ట్రం కోసం భారీ ఛార్జీలు చెల్లించిన తమకు ఆదాయం రాకపోతే ఎలా మనుగడ సాగిస్తామని అవి ప్రశ్నిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement