పరాయి రాష్ట్రాల నుంచి తిరిగొచ్చేయండి : కేసీఆర్‌ | Warangal : Kakatiya Mega Textile park inaugurated by CM KCR | Sakshi
Sakshi News home page

పరాయి రాష్ట్రాల నుంచి తిరిగొచ్చేయండి : కేసీఆర్‌

Published Sun, Oct 22 2017 5:45 PM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

Warangal : Kakatiya Mega Textile park inaugurated by CM KCR - Sakshi

కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్‌, అనంతరం సభలో ప్రసంగం

సాక్షి, శాయంపేట : వృత్తినైపుణ్యం ఉండి, పొట్టకూటి కోసం పరాయి రాష్ట్రాలకు వలసపోయిన చేనేత కార్మికులు తిరిగి సొంతగడ్డ తెలంగాణకు రావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు ఆయన ఆదివారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అద్భుతంగా రూపుదిద్దుకోనున్నఈ టెక్స్‌టైల్‌ పార్కు ద్వారా లక్షల మంది చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తుందని, ఇకపై నేతన్నలు వలసలు పోవాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు.

చీరలు, బనీన్లు, చెడ్డీలు అన్నీ ఇక్కడే : శాయంపేటలో నెలకొల్పిన కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో అన్నిరకాల దుస్తులూ తయారవుతాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ‘‘గుజరాత్‌లోని సూరత్‌ చీరలకు ప్రసిద్ధి, తమిళనాడులోని సిర్పూరులో బనీన్లు, చెడ్డీలు ఎక్కువగా తయారవుతాయి. అదే మహారాష్ట్రలోని షోలాపూర్‌లో రజాయీలు, దుప్పట్లు తయారవుతాయి. వీటన్నింటి కలబోతగా కాకతీయ పార్కు తయారు కానుంది. చీరల దగ్గర్నుంచి, బనీన్లు, చెడ్డీలు, దుప్పట్లు సర్వం ఇక్కడే తయారుతాయి. పత్తిని వడికించడం మొదలు, తయారైన దుస్తులను దేశదేశాలకు ఎగుమతి చేసేదాకా అన్ని హంగులూ ఇక్కడ ఉంటాయి’’ అని ముఖ్యమంత్రి తెలిపారు.

శంకుస్థాపన రోజే రూ.3,900 కోట్ల పెట్టుబడులు : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు శంకుస్థాపన రోజే రూ.3,900 కోట్ల విలువైన 22 ఒప్పందాలు కుదిరాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఒప్పందాలు చేసుకున్న సంస్థల్లో దేశీయ, విదేశీ సంస్థలు కూడా ఉన్నాయన్నారు. తక్కువ సమయంలోనే కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కుకు పెట్టుబడులు సాధించించిపెట్టిన పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను, ఆ శాఖ ఉద్యోగులను ముఖ్యమంత్రి అభినందించారు.

బంగారు వరంగల్‌.. ఆతర్వాతే బంగారు తెలంగాణ : శాయంపేటలో మెగా టెక్స్‌దీంతో పాటు కాజీపేట ఆర్వోబీ, వరంగల్‌ ఔటర్ రింగ్‌రోడ్డు, మడికొండ ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ ఫేజ్-2 పనులకు కూడా సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. వరంగల్‌ జిల్లా అంటే తనకు ప్రాణమని, ఇక్కడిరైతులు వద్దనేదాకా కాళేశ్వరం నీళ్లు ఇస్తామని, ముందుగా బంగారు వరంగల్‌ను తయారుచేసిన తర్వాతే బంగారు తెలంగాణను తయారుచేస్తామని కేసీఆర్‌ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement