MITRA SCHEME - Kakatiya Mega Textile Park: చేనేత పరిశ్రమలను భారీ ఎత్తున ప్రోత్సహించేందుకు కేంద్రం మిత్రా పేరుతో సరికొత్త పథకాన్ని అమలు చేయబోతున్ట్టు ప్రకటించింది. ఈ మిత్రా పథకంలో చోటు దక్కించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం పావులు కదుపుతోంది.
మిత్రా అంటే ?
మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్స్ రీజియన్ అపారెల్ (మిత్రా) పేరుతో కేంద్రం సరికొత్త పథకాన్ని అక్టోబరు మొదటి వారంలో ప్రకటించింది. దేశం మొత్తం మీద ఏడు ప్రాంతాల్లో మెగా టెక్స్‌టైల్స్ పార్కును కేంద్రం నెలకొల్పుతుంది. అందులో భాగంగా ఈ పథకం ప్రకారం కనీసం వెయ్యి ఎకరాల్లో ఏర్పాటయ్యే టెక్స్‌టైల్స్ పార్క్‌కి నిధులు సమకూరుస్తుంది.
ఎందుకీ మిత్ర
పొరుగున్న ఉన్న బంగ్లాదేశ్, శ్రీలంకలు మనకంటే వస్త్రాల పరిశ్రమ విషయంలో ఎంతో ముందున్నాయి. ఆ రెండు దేశాల్లో తయారైన దుస్తులు విదేశాలతో ఎగుమతి అవడంతో పాటు ఇండియా కంపెనీలు సైతం అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి, దీంతో వస్త్రాల తయారీకి సంబంధించి స్వయం సమృద్ధి సాధించడంతో పాటు ఎగుమతులు చేయడం లక్ష్యంగా ఈ మిత్రాను కేంద్రం తెర మీదకు తెచ్చింది.
సౌకర్యాలు ఇలా
మిత్రా పథకంలో దేశంలో నెలకొల్పే ఏడు మెగా టెక్స్‌టైల్స్ పార్కుల్లో ప్లగ్ అండ్ ప్లే పద్దతిలో వస్త్ర పరిశ్రమలు మొదలయ్యేలా అన్ని రకాల మౌలిక సదుపాయాలను కేంద్రం కల్పిస్తుంది. ఇందులో రోడ్లు, విద్యుత్తు, నీటి శుద్ధి ప్లాంట్లు, రవాణా సౌకర్యాలు, కార్మికులు ఉండేందుకు వీలుగా క్వార్టర్లు, హస్టళ్లు తదితర అన్ని రకాల మౌలిక సదుపాయలు కేంద్రమే ఏర్పాటు చేస్తుంది. భూసేకరణ నిధులు సైతం కేంద్రం మంజూరు చేస్తుంది.
పోటీలో పలు రాష్ట్రాలు
మిత్రా పథకం దక్కించుకునేందుకు కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, గుజరాత్, ఓడిషా, రాజస్థాన్, అసోం, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. మిత్ర పథకం కోసం పోటీ పడే రాష్ట్రాలు మూడు నెలల్లోగా ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి పంపివ్వాల్సి ఉంటుంది.
కాకతీయ మెగా పార్క్
దేశంలోనే ఎక్కడా లేని విధంగా నూలు నుంచి షర్ట్ వరకు అన్ని వస్తువులు ఒకే చోట తయారయ్యేలా తెలంగాణ ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్కుని వరంగల్ నగరానికి మంజూరు చేసింది. 2017లో ఈ పార్కు పనులు మొదలయ్యాయి. దీని కోసం ఇప్పటికే 1200 ఎకరాల స్థల సేకరణ జరిగింది. మౌలిక వసతులు ఏర్పాటవుతున్నాయి. ఇక్కడ పరిశ్రమలు పెట్టేందుకు వెల్‌స్పన్, కైటెక్స్, దక్షిణ కొరియాకు చెందిన యంగ్‌గూన్ కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించాయి. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. అయితే నిధుల లేమి కారణంగా ఈ పార్కు పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ఈ పార్కు పనులకు నిధులు ఇవ్వాల్సిందిగా ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి తెలంగాణ సర్కారు విజ్ఙప్తి చేసింది.
అనుకూల అంశాలు
మిత్ర పథకం కింద పార్కు మంజూరు కావాలంటే వెయ్యికి పైగా ఎకరాలు రెడీ చేయాలి. తెలంగాణకు సంబంధించి ఇప్పటికే స్థల సేకరణ పూర్తయ్యింది. వరంగల్ చుట్టు పక్కల జిల్లాలో పత్తి అధికంగా పండుతుంది. దీనికి తోడు ఇప్పటికే రైలు, రోడ్డు మార్గాలకు ఇబ్బంది లేదు. త్వరలో వాయు మార్గం కూడా అందుబాటులోకి రానుంది. దీంతో వరంగల్‌కు మిత్ర పథకం మంజూరు అయ్యే అవకాశాలు ఎక్కుగా ఉన్నాయనే ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
ఒత్తిడి తప్పదు
గతంలో తెలంగాణకు మంజూరైన ఐటీఐఆర్ పార్కుని కేంద్రం రద్దు చేసింది. మరోవైపు విభజన చట్టంలో పేర్కొన్న కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని అటక మీదకు నెట్టింది. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రంపై నలువైపులా విమర్శలు వస్తున్నాయి. దీంతో ఈసారి మిత్రాకి అన్ని అర్హతలు ఉన్నా కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్క్‌కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆనవాయితే అనే అభిప్రాయం నెలకొంది. అయితే కేంద్రం ఆమోద ముద్ర వేసే వరకు ఒత్తిడి తేవాలనే యోచనలో తెలంగాణ సర్కారు ఉంది.
- సాక్షి , వెబ్ ప్రత్యేకం
Comments
Please login to add a commentAdd a comment