ట్రాఫిక్ కానిస్టేబుల్ గోపాల్‌కు బాడీ వార్న్ కెమెరా అమరుస్తున్న ఎస్పీ కోటిరెడ్డి
సాక్షి, మహబూబాబాద్: ఎక్కడ ఏ నేరం జరిగినా నిందితులను పట్టుకునేందుకు సీసీ కెమెరాల పుటేజీపై ఆధారపడిన పోలీసుల చేతికి ఇప్పుడు మరో ఆయుధం వచ్చింది. ఈ మేరకు సిబ్బంది శరీరాని(చొక్కా)కి అమర్చే కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రం బేతోలు శివారులో మంగళవారం బాడీ వార్న్ కెమెరాలను ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ఎక్కడైనా వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించినా, వారి నుంచి సిబ్బంది డబ్బు తీసుకున్నా ఈ బాడీ కెమెరాల ద్వారా ఉన్నత అధికారులకు సమాచారం చేరుతుందని తెలిపారు. ఎప్పటికప్పుడు సెంట్రల్ సర్వర్‌కు వీడియో చిత్రాలు అందించే ఈ ఆధునిక కెమెరాలను ఉపయోగపడుతాయని చెప్పారు.
ఏమిటీ కెమెరా.. ఎలా పనిచేస్తుంది?
ఇప్పటి వరకు సీసీ కెమెరాలు, పెన్ కెమెరాల పేర్లు మాత్రమే మనం విన్నాం. బాడీ వార్న్ కెమెరాలంటే విధి నిర్వహణలో ఉన్న పోలీసు తన ఒంటికి ఓ ఆధునిక కెమెరాలను పెట్టుకుని ఉంటాడు. బాడీ వార్న్ కెమెరాను ధరించిన పోలీసు నిల్చున్న ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది? ఏ వాహనదారుడు ఏ రూట్‌లో వెళ్లాలి? అందుకు విరుద్ధంగా ఎక్కడ వెళ్తున్నాడు? అక్రమ పార్కింగ్ ఎక్కడెక్కడ జరుగుతోంది? అన్న పూర్తి వివరాలను వీడియో చిత్రీకరించి, సెంట్రల్ సర్వర్‌కు పంపుతుంది. ఈ ఆడియో, వీడియోలను ఎప్పటికప్పుడు సంబంధిత పోలీసు స్టేషన్, ట్రాఫిక్ కంట్రోల్ రూంకు చేరడంతో సెంట్రల్ సర్వర్‌లో డేటా భద్రంగా ఉంటుంది. మెయిన్ సర్వర్‌లో ఈ డేటాను తొలగించడం ఎవరికి సాధ్యపడదు.
అంతేకాకుండా సిబ్బంది ఎక్కడ, ఎలా పనిచేస్తున్నారన్నది కూడా ఉన్నతాధికారులు తెలుసుకోవచ్చు. కేవలం 140 గ్రాముల బరువుతో ఉన్న ఈ కెమెరా ఇంటర్నల్ 8 జీబీ, ఎక్స్‌టర్నల్ 32 జీబీతో మొత్తం 40 జీబీ సామర్థ్యంతో, ఎనిమిది గంటల బ్యాకప్ బ్యాటరీ, హెచ్‌డీ క్వాలిటీతో వీడియోను చిత్రీకరించడం బాడీ వార్న్ కెమెరాల ప్రత్యేకతలు. కాగా, బాడీ కెమెరాల ప్రారంభ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీలు రేల జనార్దన్‌రెడ్డి, శశిధర్, టౌన్ సీఐ సుంకరి రవికుమార్, డీసీఆర్‌బీ సీఐ రమేష్‌కుమార్, ఐటీకోర్ సీఐ బి.రాజయ్య, టౌన్, ట్రాఫిక్ ఎస్సైలు సీహెచ్.అరుణ్‌కుమార్, సిరిసిల్ల అశోక్‌కుమార్, టౌన్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment