
సాక్షి, వరంగల్ రూరల్: అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమైంది. జిల్లాలో ఇప్పటికే టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించి 45 రోజులు కావొస్తోంది. మహాకూటమి అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమైన బీజేపీ మాత్రం శనివారం పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయబోతుంది. ఇందులో పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. తొలి జాబితాలో చోటు ఎవరికి దక్కుతుందోనని సర్వత్రా చర్చ సాగుతోంది.
పరకాల, వర్ధన్నపేటపై ప్రత్యేక దృష్టి..
పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. వర్ధన్నపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరగగా రెండు సార్లు బీజేపీ, ఒక సారి జనతా పార్టీ గెలుపొం దింది. జనతా పార్టీ తరఫున 1978లో మాచర్ల జగన్నాథం 4 వేల ఓట్ల మెజార్టీ తో, బీజేపీ తరఫున 1985లో వన్నాల శ్రీరాములు 14 వేల మెజార్టీతో, 1989లో డాక్టర్ టి.రాజేశ్వర్ రావు 10 వేల మెజార్టీ తో గెలుపొందారు. రెండు సార్లు బీజేపీ, టీడీపీ పొత్తుతో టీడీపీ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. పరకాల నియోజకవర్గంలో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగగా, రెండుసార్లు బీజేపీ, ఒకసారి జనసంఘ్ పార్టీలు దక్కించుకున్నాయి.
1967లో భారతీయ జనసంఘ్ తరఫున చందుపట్ల జంగారెడ్డి పోటీ చేసి 3 వేల మెజార్టీతో గెలుపొందారు. బీజేపీ తరఫున ఇదే నియోజకవర్గం నుంచి ఒంటేరు జయపాల్ 1985లో 17 వేల ఓట్ల మెజార్టీ తో, 1989లో 2,500 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014లో బీజేపీ, టీడీపీ పొత్తుతో పరకాల నియోజకవర్గాన్ని టీడీపీకి కేటాయించారు. టీడీపీ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి గెలుపొందారు. ఈ స్థానంలో గతంలో గెలుపొందామనే దృష్టితో బలమైన అభ్యర్థులను నిలబెట్టాలనే ఆలోచనలో ఉంది.
వర్ధన్నపేట నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రూర్బ న్(శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిష న్) పథకం కింద పర్వతగిరి మండలంను గతంలోనే ఎంపిక చేశారు. మండలాన్నిరూ.135 కోట్లతో అభివృద్ధి చేస్తామని కేంద్రం ప్రకటించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రత్యేకంగా కేటాయిస్తోంది. పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో ఇటీవల బీజేపీ బస్సు యాత్రను సైతం నిర్వహించింది. పరకాలలో బస్సు యాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభకు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌తోపాటు కేంద్ర మంత్రి సురేష్ ప్రభు హాజరయ్యారు.
మండల అధ్యక్షుల అభిప్రాయ సేకరణ..
పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థిని బరిలో దించాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. టీఆర్‌ఎస్, మహా కూటమి అభ్యర్థులకు దీటుగా బీజేపీ అభ్యర్థులను బరిలోకి దింపాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. మూడు నియోజకవర్గాల్లో సామాజిక వర్గాల వారీగా గుర్తించి ఆయా వర్గాల అభ్యర్థులను ఎంపిక చేయడానికి ప్రాధాన్యమిచ్చే అంశాలను పరిశీలిస్తోంది. ఈ నెల 3న జిల్లాలోని మండలాల అధ్యక్షుల అభిప్రాయాలను, జిల్లా నాయకుల అభిప్రాయాలను రాష్ట్ర పార్టీ సేకరించింది. పరకాల నియోజకవర్గం నుంచి డాక్టర్ పెస రు విజయచందర్ రెడ్డి, సిరంగి సంతోష్ కుమార్, ప్రేమేందర్ రెడ్డి టికెట్ కోసం పోటీ పడుతున్నారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో పెసరు విజయచందర్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి పంచాయతీ రాజ్ రిటైర్డ్ ఎస్‌ఈ కొత్త సారంగరావు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. నర్సంపేట నియోజకవర్గం నుంచి వరంగల్ రూరల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి ఆశిస్తున్నారు. తొలి జాబితాను 30 మంది అభ్యర్థులతో బీజేపీ పార్లమెంటరీ కమిటీ ముందు రాష్ట్ర కమిటీ పెట్టింది. శనివారం విడుదల చేయనున్న ఈ జాబితాలో పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ నియోజకవర్గాల్లో చోటు ఎవరికి దక్కుతుందోనని ఆ పార్టీలో చర్చ సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment