Vardhannapeta constituency
-
వర్ధన్నపేటను ‘వరించని’ మంత్రి పదవి
సాక్షి, హసన్‌పర్తి: వరంగల్నగరం వర్ధన్నపేట నియోజకవర్గాన్ని విడదీస్తుంది. నాలుగు మండలాలతో విస్తీరించిన నియోజకవర్గంలో రెండు మండలాలు పూర్తిగా నగరానికి ఓవైపు..మరో రెండు మండలాలు మరోవైపు ఉన్నాయి. హన్మకొండ, హసన్పర్తికి చెందిన ప్రజలు వర్ధన్నపేటకు వెళ్లాలంటే.. వరంగల్ పశ్చిమ, వరంగల్‌తూర్పు నియోజకవర్గాలను దాటాల్సిందే. 1952లో వర్ధన్నపేట నియోజకవర్గం ఏర్పడింది. జనరల్‌గా ఉన్న ఈ నియోజకవర్గాన్ని 2009లో పునర్విభజన సందర్భంగా ఎస్సీకి రిజర్వ్ చేశారు. ఈ నియోజక వర్గంపై తొలిసారిగా పీడీఎఫ్ జెండా ఎగిరింది. పెండ్యాల రాఘువరావు ఈ నియోజక వర్గం నుంచి తొలి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రిజర్వ్ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి కొండేటి శ్రీధర్ విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 14 సార్లు సాధారణ ఎన్నికలు జరగగా ఒకసారి మాత్రం ఉప ఎన్నికల అనివార్యమయ్యాయి. ఈ స్థానం నుంచి కాంగ్రెస్, టీడీపీలు చెరో మూడుసార్లు విజయం సాధించాయి. జనతాపార్టీ, ఇండిపెండెంట్లు, బీజేపీ రెండుసార్లు, టీఆర్ఎస్ ఒక్కసారి వర్ధన్నపేటపై జెండాను ఎగురవేశారు. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఒక్కరికి కూడా మంత్రి పదవి దక్కలేదు. ఈ స్థానం నుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావు మూడుసార్లు గెలుపొందారు. మాజీ మంత్రి పురుషోత్తంరావు, మాచర్ల జగన్నాధం రెండుసార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. పురుష్తోతంరావు ఒక సారి ఎస్టీపీఎస్, మరోసారి స్వతంత్య్ర అభ్యర్థిగా గెలుపొందారు. మాచర్ల జగన్నాథం ఒకసారి జనతాపార్టీ, మరోసారి కాంగ్రెస్ పార్టీనుంచి విజయం సాధించారు. టి.రాజేశ్వర్‌రావు, వన్నాల శ్రీరాములు బీజేపీ తరఫున గెలుపొందారు. వర్ధన్నపేటపై పీడీఎఫ్ అభ్యర్థులు పెండ్యాల రాఘవరావు, ఏ.ఎల్.ఎన్.రెడ్డి వరుసగా గెలుపొందారు. కె. లక్ష్మీనర్సింహారెడ్డి ఇండిపెండెంట్‌గా గెలుపొందారు. 1957లో జరిగిన ఉప ఎన్నికలో ఎర్రబెల్లి వెంకట రామనర్సయ్య విజయం సాధించారు. ఈ నియోజకవర్గాన్ని కావాలనే పునర్విభజనలో ఎస్సీకి కేటాయించినట్లు పుకార్లు జరిగాయి. పక్క ప్రాంతాల్లో పోటీ చేస్తేనే పదవులు.. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఏ నాయకుడికీ ఇప్పటి వరకు పదవులు దక్కలేదు. ఇక్కడ నుంచి పోటీ చేసిన పురుషోత్తంరావు తర్వాత వరంగల్‌నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి బాధ్యతలు చేపట్టారు. తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా పనిచేసి ఆ తర్వాత నగర మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఎర్రబెల్లి స్వర్ణ సైతం ఎమ్మెల్యేగా ఓటమి పొంది... నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. టీడీపీ నుంచి 1994, 1999లో రెండు సార్లు టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ దయాకర్‌రావుకు మంత్రి పదవి దక్కలేదు. కడియం శ్రీహరి ఈ ప్రాంతానికి చెందిన వారైనా పక్క నియోజకవర్గానికి వెళ్లి గెలుపొంది మంత్రి పదవి చేపట్టారు. పునర్విభజన పరిణామం.. పునర్విభజనకు ముందు వర్ధన్నపేట నియోజకవర్గంలో వర్ధన్నపేట, పర్వతగిరి, సంగెం, రాయపర్తి మండలాలు ఉన్నాయి. జనరల్‌గా ఉన్నప్పుడు ఈ స్థానం టీడీపీ కం చుకోటగా ఉండేది. ఈ నియోజకవర్గాన్ని పునర్విభజనలో ఎస్సీకి రిజర్వ్‌చేశారు. జనరల్‌గా ఉన్న వర్ధన్నపేటను మూడు ముక్కలుగా విభజించారు. ఈ నియోజకవర్గం లో ఉన్న రాయపర్తిని పాలకుర్తిలో, సంగెంను పరకాల నియో జకవర్గంలో విలీనంచేశారు. హన్మకొండ నియోజకవర్గంలో ఉన్న హసన్‌పర్తి, హన్మకొండ రూరల్ మండలాలను వర్ధన్నపేటలో విలీనం చేశారు. దీంతో వర్ధన్నపేట, పర్వతగిరి, హన్మకొండ రూరల్, హసన్‌పర్తి మండలాలతో వర్ధన్నపేట నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. కొత్తగా ఏర్పడిన వర్ధన్నపేట నియోజకవర్గంపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన కొండేటి శ్రీధర్ విజయం సాధించారు. రాజకీయంగా పర్వతగిరికి ప్రత్యేక స్థానం ... రాజకీయంగా పరిశీలిస్తే వర్ధన్నపేట నియోజకవర్గంలోని పర్వతగిరికి ప్రత్యేకస్థానం ఉంది. ఈ మండలానికి చెందిన నాయకులు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులతో పాటు ఇతర రాష్ట్రస్థాయి పదవులు అలంకరించారు. టీడీపీ నుంచి స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మంత్రిగా పనిచేసిన కడియం శ్రీహరి పర్వతగిరికి చెందినవారు. ఇదే మండలం కొంకపాకకు చెందిన పురుషోత్తంరావు కాంగ్రెస్ తరఫున వరంగల్ నుంచి పోటీచేసి గెలుపొంది మంత్రి పదవి చేపట్టారు. దీంతో పాటు మారుమూల ప్రాంతాల అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. పాలకుర్తి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్వతగిరికి చెందినవారు. ఎంపీ వినోద్‌కుమార్ స్వస్థలం పర్వతగిరి మండలం ఏనుగల్లు. అరూరికి భారీ మెజార్టీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేష్ పోటీచేశారు. సుమారు 87వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించి, రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీలో రెండోస్థానంలో నిలిచారు. ఇద్దరు మేయర్లుగా వర్ధన్నపేట వాసులే... నగర మేయర్లుగా పనిచేసిన ఇద్దరు ప్రముఖులు వర్దన్నపేట వాసులే. ఇద్దరు కూడా సమీప బంధువులే. ఇందులో ఒకరు తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు కాగా, మరొకరు ఎర్రబెల్లి స్వర్ణ. తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు బీజేపీనుంచి మేయర్‌గా ఎన్నిక కాగా, ఎర్రబెల్లి స్వర్ణ కాంగ్రెస్ నుంచి మేయర్ పదవి చేపట్టారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పొన్నేలుకు చెందిన వారు. బీజేపీ జాతీయ నాయకుడు పేరాల చంద్రశేఖర్‌రావు ల్యాబర్తికి చెందిన వారు. తెలుగుదేశం హయాంలో రోడ్ల భవనాల శాఖ మంత్రిగా పనిచేసిన సంగంరెడ్డి సత్యనారాయణ (ముచ్చర్ల సత్యనారాయణ)çస్వస్థలం హసన్‌పర్తి మండలం ముచ్చర్ల గ్రామం. సత్యనారాయణ మాత్రం వరంగల్పశ్చిమ (పాత హన్మకొండ)నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. -
వర్ధన్నపేట టికెట్ టీజేఎస్ సొంతం
హసన్‌పర్తి: మహాకూటమి వర్ధన్నపేట నియోజకవర్గ టికెట్ ఎట్టకేలకు తెలంగాణ జనసమితికి కేటాయించారు. ఈ మేరకు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం ఆదివారం రాత్రి ప్రకటించారు. ప్రవాస భారతీయుడు డాక్టర్ పగిడిపాటి దేవయ్యకు ఈ టికెట్ కేటాయించింది. టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు నమిండ్ల శ్రీనివాస్, బక్క జడ్సన్, డాక్టర్ విజయ్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే మహాకూటమి పొత్తులో భాగంగా స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేటలోని ఏదైనా ఒక స్థానం కేటాయించాలని టీజేఎస్ కోరింది. దీంతో చివరి క్షణం వరకు టిక్కెట్‌పై సందిగ్ధత నెలకొంది. ఎట్టకేలకు ఆదివారం అర్ధరాత్రి పగిడిపాటి దేవయ్యకు టిక్కెట్ కేటాయిస్తూ కోదండరాం ప్రకటన చేయడంతో సస్పెన్స్ వీడింది. కాగా పగిడిపాటి దేవయ్య ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించడం ఇది మూడోసారి. రెండుసార్లు టిక్కెట్ కోసం ప్రయత్నించారు. మూడో సారి టీజేఎస్ తరఫున ఆయనకు టిక్కెట్ దక్కింది. 2015లో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో దేవయ్య వరంగల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాగా శనివారం దేవయ్య బీఎస్పీ తరఫున వర్ధన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. సోమవారం ఆయన టీజేఎస్ తరఫున నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందించనున్నారు. పగిడిపాటి దేవయ్య ప్రొఫైల్ పేరు: డాక్టర్ పగిడి దేవయ్య(పిల్లల వైద్యనిపుణుడు) తల్లిదండ్రులు : రత్నం, కోటమ్మ భార్య : డాక్టర్ పగిడి రుద్రమదేవి స్వస్థలం: ఖిలాషాపురం(గ్రామం), రఘునాథపల్లి(మండలం), జనగాం(జిల్లా) విద్యార్హతలు: ఎంబీబీఎస్(ఉస్మానియా మెడికల్ కళాశాల) పిల్లల వైద్య నిఫుణుడు(అనస్థిషియా), హార్ట్‌వేర్ యూనివర్సిటీ జననం: 21–06–1944 సంతానం: ఇద్దరు కుమారులు, కూతురు చిరునామా: బేటా–409, మాదాపూర్, హైదరాబాద్ -
వర్ధన్నపేట అభ్యర్థిని ప్రకటించని మహాకూటమి
సాక్షి, వరంగల్ రూరల్: ఓ వైపు ఎన్నికల ప్రచా రాన్ని నియోజకవర్గాల్లో పలు రాజకీయ పార్టీలు జోరుగా నిర్వహిస్తుంటే.. మరికొన్ని పార్టీలు మాత్రం తమ అభ్యర్థులనే ఇంకా ప్రకటించలేదు. నామినేషన్ల గడువు సమీపిస్తున్నా అభ్యర్థుల ప్రకటన పూర్తి కాలేదు. సెప్టెంబర్ 6న ప్రభుత్వాన్ని రద్దు చేశాక టీఆర్ఎస్ అధినేత 105 మంది ఎమ్మె ల్యే అభ్యర్థులను వెంటనే ప్రకటించిన విషయం తెలిసిందే. వారిలో వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన వర్ధన్నపేట నుంచి ఆరూరి రమేశ్, నర్సంపేట నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి, పరకాల నుంచి చల్లా ధర్మారెడ్డి పేర్లు ఉన్నాయి. ఇటీవల బీజేపీ పరకాల నుంచి డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి, వర్ధన్నపేట నుంచి కొత్త సారంగరావు, మహాకూటమి తరఫున పరకాల నుంచి కొండా సురేఖ, నర్సంపేట నుంచి దొంతి మాధవరెడ్డిని ప్రకటించారు. ఇంకా జిల్లాలో మహకూటమి తరఫున వర్ధన్నపేట అభ్యర్థిని ప్రకటించలేదు. వర్ధన్నపేట మహాకూటమి అభ్యర్థి ఎవరో? వర్ధన్నపేట మహాకూటమి అభ్యర్థిని ఇంత వరకు ప్రకటించలేదు. మహాకూటమిలోని టీజేఎస్ 12 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. అందులో వర్ధన్నపేట నియోజకవర్గాన్ని తెలంగా ణ జన సమితి(టీజేఎస్)కి కేటాయించినట్లు ఇప్పటికే ఆ పార్టీ తెలిపింది. కాంగ్రెస్ పార్టీకే కేటా యించాలని మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌తో పాటు తన అనుచరులు గాంధీభవన్‌లో ఆందోళన చేపట్టారు. ఓ వైపు నామినేషన్ల గడువు దగ్గర పడుతుంటే అభ్యర్థుల ప్రకటనలో కూటమి తర్జనభర్జన పడుతోంది.టీజేఎస్ తరఫున పగిడిపాటి దేవయ్యని నిలబెడతారని సమాచారం. ఇప్పటికే దేవ య్యప్రచార రథాలను సైతం సిద్ధం చేసుకున్నారు. సమీపిస్తున్న గడువు పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల గడువు సమీపిస్తోంది. ఈ నెల 12 నుంచి ప్రారంభమైన నామినేషన్ల గడువు ఈ నెల 19వ తేదీతో ముగియనుంది. ఈ నెల 20న నామినేషన్ల పరిశీలన జరగనుంది. 22న మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ ఉపసంహరణ తుది గడువు ఉంటుంది. గడు వు సమీపిస్తున్నా మహాకూటమి అభ్యర్థిని ప్రకటిం చకపోవడంతో కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. ఓ పక్క టీఆర్ఎస్ ప్రచారంలో దూ సుకెళ్తుండగా అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఆయా పార్టీల కార్యకర్తలు నిరాశకు లోనవుతున్నారు. -
చోటు దక్కేదెవరికో ?
సాక్షి, వరంగల్ రూరల్: అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమైంది. జిల్లాలో ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి 45 రోజులు కావొస్తోంది. మహాకూటమి అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమైన బీజేపీ మాత్రం శనివారం పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయబోతుంది. ఇందులో పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. తొలి జాబితాలో చోటు ఎవరికి దక్కుతుందోనని సర్వత్రా చర్చ సాగుతోంది. పరకాల, వర్ధన్నపేటపై ప్రత్యేక దృష్టి.. పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. వర్ధన్నపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరగగా రెండు సార్లు బీజేపీ, ఒక సారి జనతా పార్టీ గెలుపొం దింది. జనతా పార్టీ తరఫున 1978లో మాచర్ల జగన్నాథం 4 వేల ఓట్ల మెజార్టీ తో, బీజేపీ తరఫున 1985లో వన్నాల శ్రీరాములు 14 వేల మెజార్టీతో, 1989లో డాక్టర్ టి.రాజేశ్వర్ రావు 10 వేల మెజార్టీ తో గెలుపొందారు. రెండు సార్లు బీజేపీ, టీడీపీ పొత్తుతో టీడీపీ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. పరకాల నియోజకవర్గంలో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగగా, రెండుసార్లు బీజేపీ, ఒకసారి జనసంఘ్ పార్టీలు దక్కించుకున్నాయి. 1967లో భారతీయ జనసంఘ్ తరఫున చందుపట్ల జంగారెడ్డి పోటీ చేసి 3 వేల మెజార్టీతో గెలుపొందారు. బీజేపీ తరఫున ఇదే నియోజకవర్గం నుంచి ఒంటేరు జయపాల్ 1985లో 17 వేల ఓట్ల మెజార్టీ తో, 1989లో 2,500 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014లో బీజేపీ, టీడీపీ పొత్తుతో పరకాల నియోజకవర్గాన్ని టీడీపీకి కేటాయించారు. టీడీపీ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి గెలుపొందారు. ఈ స్థానంలో గతంలో గెలుపొందామనే దృష్టితో బలమైన అభ్యర్థులను నిలబెట్టాలనే ఆలోచనలో ఉంది. వర్ధన్నపేట నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రూర్బ న్(శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిష న్) పథకం కింద పర్వతగిరి మండలంను గతంలోనే ఎంపిక చేశారు. మండలాన్నిరూ.135 కోట్లతో అభివృద్ధి చేస్తామని కేంద్రం ప్రకటించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రత్యేకంగా కేటాయిస్తోంది. పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో ఇటీవల బీజేపీ బస్సు యాత్రను సైతం నిర్వహించింది. పరకాలలో బస్సు యాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభకు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌తోపాటు కేంద్ర మంత్రి సురేష్ ప్రభు హాజరయ్యారు. మండల అధ్యక్షుల అభిప్రాయ సేకరణ.. పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థిని బరిలో దించాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. టీఆర్ఎస్, మహా కూటమి అభ్యర్థులకు దీటుగా బీజేపీ అభ్యర్థులను బరిలోకి దింపాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. మూడు నియోజకవర్గాల్లో సామాజిక వర్గాల వారీగా గుర్తించి ఆయా వర్గాల అభ్యర్థులను ఎంపిక చేయడానికి ప్రాధాన్యమిచ్చే అంశాలను పరిశీలిస్తోంది. ఈ నెల 3న జిల్లాలోని మండలాల అధ్యక్షుల అభిప్రాయాలను, జిల్లా నాయకుల అభిప్రాయాలను రాష్ట్ర పార్టీ సేకరించింది. పరకాల నియోజకవర్గం నుంచి డాక్టర్ పెస రు విజయచందర్ రెడ్డి, సిరంగి సంతోష్ కుమార్, ప్రేమేందర్ రెడ్డి టికెట్ కోసం పోటీ పడుతున్నారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో పెసరు విజయచందర్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి పంచాయతీ రాజ్ రిటైర్డ్ ఎస్ఈ కొత్త సారంగరావు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. నర్సంపేట నియోజకవర్గం నుంచి వరంగల్ రూరల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి ఆశిస్తున్నారు. తొలి జాబితాను 30 మంది అభ్యర్థులతో బీజేపీ పార్లమెంటరీ కమిటీ ముందు రాష్ట్ర కమిటీ పెట్టింది. శనివారం విడుదల చేయనున్న ఈ జాబితాలో పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ నియోజకవర్గాల్లో చోటు ఎవరికి దక్కుతుందోనని ఆ పార్టీలో చర్చ సాగుతోంది. -
జిల్లాకు వచ్చిన కేసీఆర్ సతీమణి
వరంగల్ : వర్ధన్నపేట నియోజకవర్గం ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం మొదలవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మొదటి ఉత్సవాలు కావడంతో వీటిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఐనవోలులో జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరవుతారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభారాణి శనివారం రాత్రి వరంగల్‌కు చేరుకున్నారు. దీంతో కేసీఆర్ మరొక రోజు జిల్లాలోనే ఉండే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతుఆన్నయి. కేసీఆర్ ఆది వారం లేదా సోమవారం వరంగల్‌లోని భద్రకాళి ఆలయానికి, ఐనవోలు ఉత్సవాలకు వెళ్తారని తెలుస్తోంది. ఆదివారం ఉదయం భద్రకాళి ఆలయూనికి వెళ్తున్నారు.