
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల అభివృద్ధి సంస్థ (ఐడీసీ) ఆధ్వర్యంలోని ఎత్తిపోతల పథకాల పునరుజ్జీవం ద్వారా వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి 2లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు అందిస్తామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద కొత్తగా ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి 25వేల ఎకరాలకు నీరిస్తామని స్పష్టం చేశారు.
గతంలో కోట్లు వెచ్చించినా ఎత్తిపోతల పథకాల ద్వారా ఎకరా ఆయకట్టుకు కూడా నీళ్లు పారలేదని, ప్రస్తుతం ఐడీసీ చైర్మన్‌గా ఈద శంకర్‌రెడ్డిని నియమించిన ఏడాదిలో లక్ష ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు పారిందన్నారు. గురువారం ఇక్కడి ఐడీసీ కార్యాలయంలో జరిగిన సమీక్షకు మంత్రులు ఈటల, తుమ్మల నాగేశ్వరరావు, ఈఎన్‌సీ మురళీధర్, ఐడీసీ ఎండీ సురేశ్‌కుమార్, అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ, అతి తక్కువ ఖర్చుతో వీలైనన్ని ఎక్కువ ఎత్తిపోతల పథకాలు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. నిధుల విడుదలకు ఆర్థిక శాఖ సుముఖంగా ఉందన్నారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ, కోటి ఎకరాల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్నమని, అందుకు అనుగుణంగా ఐడీసీ పనిచేయాలని సూచించారు. ఈద శంకర్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత యాసంగిలో మొత్తంగా 1.70 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment