
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా 36 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఇందులో 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగు నీరందుతుందని, మిగతా ఆయకట్టును స్థిరీకరిస్తామన్నారు. మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టుపై సభ్యులు పుట్టా మధు, సోమారపు సత్యనారాయణ, దివాకర్‌రావులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. మేడిగడ్డ వద్ద నీటి లభ్యత 284 టీఎంసీలు ఉందని కేంద్ర జల సంఘం క్లియరెన్స్‌లు ఇవ్వడం, రీ ఇంజనీరింగ్‌పై ప్రశ్నిస్తున్న వారికి సమాధానమన్నారు.
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని మేడిగడ్డ వద్ద 3 టీఎంసీల నీటిని తరలించేలా సివిల్ పనులు జరుగుతున్నాయని, అయితే ప్రస్తుతం 2 టీఎంసీలు మాత్రమే తీసుకునేలా మోటార్ల బిగింపు చేస్తున్నామన్నారు. ఇక గోదావరిపై మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి, తుపాకులగూడెం వంటి బ్యారేజీల నిర్మాణంతో నిజామాబాద్ నుంచి భద్రాచలం వరకు 500 కిలోమీటర్ల గోదావరిలో 274 కిలోమీటర్ల గోదావరి అంతా సజీవంగా ఉంటుందన్నారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు 109 కిలోమీటర్లు ఉండగా అందులో 100 కిలోమీటర్ల మేర ఏడాది అంతటా గోదావరి నిండుకుండలా ఉంటుందన్నారు. నదిపై వరుస బ్యారేజీలు కట్టడం వల్ల మత్స్య పరిశ్రమ, పారిశ్రామికీకరణ అభివృద్ధి చెందుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment