కొడిశల కుంట గ్రామ సమీపంలో భూమి నుంచి వస్తున్న నీరు
మణుగూరురూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరు గ్రామ పంచాయతీ పరిధిలోని పరిసర గ్రామాల్లో వస్తున్న వేడి జలపాతాలు రైతుల్లో సంతోషాన్ని నింపుతున్నాయి. సింగరేణి బొగ్గు నిక్షేపాల కోసం వేస్తున్న జియోలజికల్ సర్వే బోర్ల నుంచి వేడి నీరు ఉబికి వస్తుండటంతో ఆ నీరు వృథాగా పోకుండా గ్రామాల రైతులు వ్యవసాయానికి సాగు చేసుకుంటున్నారు. పగిడేరు గ్రామంలో గతంలో కేవలం వర్షాధారంతో ఆ ప్రాంతాల్లో ఉన్న చెరువులు కుంటల్లో నీటితో కేవలం వర్షాకాలం పంట పండించాలంటేనే కష్టంగా ఉండేది. సింగరేణి సంస్థ బొగ్గు నిక్షేపాలను కనుగొనడానికి వేస్తున్న బోర్ల నుంచి వేడి నీరు ఉబికి వస్తుండటం విశేషం. పట్టుకుంటే కాలిపోయే విధంగా నీరు రావడం మరో విశేషం.
ఎటువంటి ఖర్చులేకుండా సాగునీరు అందిస్తున్న బోర్లు
పగిడేరు పరిసర ప్రాంతాల్లో ఇప్పటివరకు సుమారు 20 బోర్లు వేయగా అందులో కనీసం 10 బోర్ల నుంచి వేడి నీరు వస్తుంది. తొలుత స్పీడుగా నీరు వచ్చిన బోర్లు కొంతకాలం తరువాత తగ్గుతున్నాయి. 20 సంవత్సరాల క్రితం వేసిన బోర్లు ఇంకిపోగా, ఇటీవల వేసిన బోర్ల నుంచి వేడినీరు ఉబికి వస్తుండటంతో రైతులు ఆనందాన్ని వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల కొడిశల కుంట గ్రామ సమీపంలో వేసిన రెండు బోర్లలో వేడినీరు ఉబికి వస్తుంది. 5 హెచ్‌పీ మోటార్‌కు వచ్చినంత వేగంగా నీరు బయటకు రావడంతో ఆ నీటిని రైతులు చేరువులోకి మళ్లించి పంటలు సాగుచేసుకుంటున్నారు.
అదే విధంగా గొల్లకొత్తూరు గ్రామంలో బోరు వేయడంతో దాని నుంచి వేడి నీరు రావడంతో రైతులకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేశారు. దీంతో పగిడేరు పరిసర ప్రాం తాల్లో కేవలం ఈ బోర్లను ఆధారంగా చేసుకొని సుమారు 500ల ఎకరాల్లో వరి సాగు చేసుకుంటున్నారు. ఈబోర్ల వలన రెండు పంటలు పండటానికి అనుకూలంగా ఉండటంతో రైతులు సం తోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ఖర్చులు లేకుండా సాగునీరు అందిస్తున్న బోర్లు తమకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment